ఏఐపీకేయంఎస్ జిల్లా అధ్యక్షుడు వీరన్న
నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలోని కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేసి, వెంటనే రూ. 12000 ఇవ్వాలని ఏఐపీకేయంఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ముంజంపల్లి వీరన్న, టీయూసీఐ జిల్లా కమిటీ సభ్యులు చింత నవీన్ వీరన్న డిమాండ్ చేశారు. అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం తహశీల్దార్ వీరగంటి మహేందర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గ్రామ సభలు నిర్వహించి, వ్యవసాయ కూలీలను గుర్తించాలన్నారు. వారికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వాలని, మూడు ఎకరాల లోపు భూమి కలిగిన సన్న, చిన్న కారు రైతులు ఏడాది పొడుగునా వ్యవసాయ కూలీగానే బతుకుతున్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలకు సమగ్రమైన చట్టం రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో బిక్షం, యాకన్న, ఎల్లయ్య, సుమలత తదితరులు పాల్గొన్నారు.