500 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
సీఐఐ సదస్సులో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈతో ఎమ్‌ఓయూ
త్వరలో తెలంగాణలోనూ ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తిరుపతికి సమీపంలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో రౌతు సురమాల వద్ద పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 ఎకరాల భూమిని కేటాయించిందని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శి (ఇండిస్టీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్) డాక్టర్ ఎన్ యువరాజ్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈఓ సీఎమ్ శ్రీకాంత్‌వర్మ, ఇండిస్టీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ శుభంబన్సాల్‌తో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ ఒప్పందం చేసుకుందన్నారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్క్‌గా పేరొందిన శ్రీసిటీకి 40 కి.మీ., స్పేస్‌కు 40 కి.మీ., రేణిగుంట విమానాశ్రయానికి 30 కి.మీ., కృష్ణపట్నం పోర్ట్‌కు 60 కి.మీ., దూరంలో నూతన చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్‌ఎమ్‌ఈ) కోసం ఈ భూమిని కేటాయించారని వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పనున్నామని తెలిపారు. రూ.2వేల కోట్ల పెట్టుబడి, 15 వేల ఉద్యోగాల కల్పన, ట్రేడ్ యాక్టివిటీతో దాదాపు 900 పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. శ్రీసిటీలోని పెద్ద పరిశ్రమలకు అవసరమైన యాంక్సిలరీ సపోర్ట్ కోసం అవసరమైన పరిశ్రమలను నెలకొల్పేందుకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డితో చర్చించామనీ, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. చెన్నై, కర్ణాటక సరిహద్దులో ఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటవుతున్నదనీ, ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు తమను సంప్రదించాలని కోరారు. తెలంగాణలో కూడా ఈ తరహా పారిశ్రామిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తామని వివరించారు. రెండు తెలుగురాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ కృషి చేస్తుందని చెప్పారు.
తిరుపతి సమీపంలో పారిశ్రామిక పార్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



