Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంపారిశ్రామికోత్పత్తి వెలవెల

పారిశ్రామికోత్పత్తి వెలవెల

- Advertisement -

– ఏప్రిల్‌లో 2.7 శాతానికి పరిమితం
– ఎనిమిది నెలల కనిష్టానికి పతనం
– తయారీ, మైనింగ్‌, విద్యుత్‌ రంగాల పేలవం

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ సన్నగిల్లుతోంది. ప్రజల ఆదాయాలు తగ్గుముఖం పట్టడం, వ్యయాలు పెరగడంతో ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోతోంది. ముఖ్యంగా తయారీ, విద్యుత్‌, మైనింగ్‌ రంగాలు పడకేయడంతో ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) వృద్ధి 2.7 శాతానికి పతనమయ్యింది. ఇది ఎనిమిది నెలల కనిష్ట స్థాయి కావడం ఆందోళనకరం. గతేడాది ఇదే నెలలో ఐఐపి వృద్ధి 5.2 శాతంగా చోటు చేసుకుంది. దీంతో పోల్చితే దాదాపు సగం మేర పతనమయ్యిందని శుక్రవారం కేంద్ర గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) విడుదల చేసిన అధికారిక గణంకాలు స్పష్టం చేస్తోన్నాయి.
ఎన్‌ఎస్‌ఒ రిపోర్ట్‌ ప్రకారం.. గడిచిన నెలలో తయారీ రంగం వృద్ధి 3.4 శాతానికి పరిమితమయ్యింది. ఈ రంగం 2024 ఇదే నెలలో 4.2 శాతం పెరుగుదలను సాధించింది. ఇదే సమయంలో గనుల రంగం 6.8 శాతం వృద్ధిని సాధించగా.. గడిచిన నెలలో 0.2 శాతానికి క్షీణించింది. మరోవైపు విద్యుత్‌ రంగం ఉత్పత్తి 1 శాతం మాత్రమే పెరిగింది.
గతేడాది ఇదే నెలలో విద్యుత్‌ రంగం ఏకంగా 10.2 శాతం వృద్ధిని కనబర్చింది. 2025 ఏప్రిల్‌లో మిషనరీ, వాహనాలు, ఫ్యాక్టరీ, ముడి సరుకులు తదితర మూలధన వస్తువుల విభాగం మాత్రం 20.3 శాతం వృద్ధిని కనబర్చింది. ఇది ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో 2.8 శాతంగా ఉంది. గడిచిన నెలలో కాస్మోటిక్స్‌, ఆహారం, పానియాలు, ఇంధనం, వస్త్రాలు, పాదరక్షలు తదితర కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరెబుల్‌ గూడ్స్‌ ఉత్పత్తి 1.7 శాతానికి పడిపోయింది. ఇలాంటి సాధారణ అవసరాలకు ఉపయోగించే వస్తువులను కూడా ప్రజలు కొనలేని స్థితికి తగ్గిపోతున్నారని స్పష్టం అవుతోంది. 2024 ఇదే నెలలో కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరెబుల్స్‌ ఉత్పత్తి వృద్ధి 2.5 శాతంగా ఉంది. ఇదే నెలలో మౌలిక వసతులు, నిర్మాణ రంగం ఉత్పత్తుల వృద్ధి 8.5 శాతంగా ఉండగా.. 2025 ఏప్రిల్‌లో 4 శాతానికి పడిపోయింది. గడిచిన ఫిబ్రవరిలో ముడి చమురు, బొగ్గు, ఇనుము, వ్యవసాయ ఉత్పత్తులు తదితర వాటికి సంబంధించిన ప్రాథమిక వస్తువుల ఉత్పత్తి వృద్ధి 0.4 శాతానికి పడిపోయింది. ఇది అంతకుముందు ఏడాది ఫిబ్రవరిలో 7 శాతంగా నమోదయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి గీటురాయిగా భావించే పారిశ్రామికోత్పత్తి సూచీ పడిపోవడం.. మరోవైపు అమెరికా వాణిజ్య టారిఫ్‌ ప్రతికూల పరిణామాలు ఉపాధి, ఆదాయాలను దెబ్బతీయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -