Tuesday, March 3, 2026
E-PAPER
Homeజాతీయంపారిశ్రామికోత్పత్తి మందగమనం

పారిశ్రామికోత్పత్తి మందగమనం

- Advertisement -

జనవరిలో 4.8 శాతానికి పతనం
తయారీ రంగం డీలా

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి పారిశ్రామిక రంగం జనవరి నెలలో తీవ్రంగా మందగించింది. గతేడాది డిసెంబర్‌లో 8 శాతం, నవంబర్‌లో 7.2 శాతం వృద్ధిని కనబరిచిన పారిశ్రా మిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ).. 2026 జనవరిలో 4.8 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించి ంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి కావడం ఆందోళనకరం. గతేడాది 2025 జనవరిలోని 5.2 శాతం పెరుగుదలతోనూ పోల్చినప్పటికీ నిరాశజనకంగానే చోటు చేసుకుంది. ముఖ్యంగా మైనింగ్‌, తయారీ రంగాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే జనవరిలో ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని.. మెరుగైన వృద్ధిని కనబర్చుతోందని మోడీ సర్కార్‌ పదే పదే చెబుతోన్నదానికి క్షేత్ర స్థాయి గణాంకాలు భిన్నంగా చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళకరమని నిపుణులు భావిస్తున్నారు.

మైనస్‌లోకి కన్స్యూమర్‌ డ్యూరెబుల్స్‌..
ముఖ్యంగా దేశ ఆర్థిక ప్రగతికి దిక్సూచిగా భావించే తయారీ రంగం వృద్ధి రేటు గతేడాది జనవరిలో ఉన్న 5.8 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 4.8 శాతానికి క్షీణించింది. మైనింగ్‌ రంగం కూడా గతేడాది 4.4 శాతం వృద్ధి నుండి స్వల్పంగా తగ్గి 4.3 శాతానికి పరిమితమయ్యింది. విద్యుత్‌ ఉత్పత్తి మాత్రం గతేడాది ఉన్న 2.4 శాతం నుంచి ఈ ఏడాది 5.1 శాతానికి మెరుగుపడటం కొంత సానుకూలాంశం. సాధారణ ప్రజలు రోజువారీ వినియోగించే వస్తువుల (కన్స్యూమర్‌ డ్యూరెబుల్స్‌) విభాగం ఏకంగా మైనస్‌ 2.7 శాతం క్షీణతను నమోదు చేసింది. ఇది మార్కెట్‌లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గడాన్ని సూచిస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. మౌలిక సదుపాయాల రంగం 13.7 శాతం పెరుగుదలను కనబరిచినప్పటికీ.. పెట్టుబడి వస్తువుల (క్యాపిటల్‌ గూడ్స్‌) వృద్ధి మాత్రం కేవలం 4.3 శాతానికే పరిమితమైంది.

ఇది పారిశ్రామిక విస్తరణ మందగించిందనడానికి మరో సంకేతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్‌ నుంచి జనవరి కాలంలో స్థూలంగా పారిశ్రామికోత్పత్తి 4 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం 2024-25 ఇదే సమయంలో 4.2 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.గడిచిన జనవరిలో తయారీలోని 23 ప్రధాన విభాగాల్లో 9 సూచీలు ప్రతికూలతను చవి చూడగా.. కేవలం 14 మాత్రమే సానుకూల వృద్ధిని సాధించాయి. లోహాలు, వాహన విడిభాగాల ఉత్పత్తి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. మొత్తం మీద పారిశ్రామిక వాతావరణం మందకొడిగా ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్‌తో పోలిస్తే ఒక్క నెలలోనే వృద్ధి రేటు ఇంతలా పడిపోవడం రాబోయే త్రైమాసికపు జీడీపీ అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -