Friday, February 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రమాదంలో పారిశ్రామిక ప్రగతి!

ప్రమాదంలో పారిశ్రామిక ప్రగతి!

- Advertisement -

బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం
గడచిన మూడేండ్లుగా ఇదే ధోరణి
కేంద్రం చర్యలతో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు కుదేలు
ప్రచారం కోసమే పథకాలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలు దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) కుదేలు చేస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయరంగం తర్వాత అత్యధికంగా ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్నది ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగమే. అలాంటి ఈ రంగంపై కేంద్రం కక్షనట్టినట్టే వ్యవహరిస్తున్నది. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఓవైపు ప్రభుత్వరంగంలోని పరిశ్రమల్ని క్రమంగా కార్పొరేట్లకు అప్పగిస్తున్న కేంద్రం, స్థానిక పారిశ్రామికరంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ఎలాంటి వివక్షాపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నదో గడచిన మూడేండ్ల గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

మోడీ 2.0 సర్కారు హయాంలోనే దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు మూతపడినట్టు స్వయంగా కేంద్రం పార్లమెంటులోనే ప్రకటించింది. కాగితాల్లో మాత్రమే పారిశ్రామిక ప్రగతిని సృష్టించి, ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర అర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.24,566.27 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గత బడ్జెట్‌ కేటాయింపులతో పోల్చినప్పుడు ఈ ఏడాది అధిక మొత్తం ఇచ్చామనీ, ఇక పారిశ్రామికరంగం పరుగులు తీస్తుందని కేంద్రం ప్రచారం చేసుకున్నది. కానీ గడచిన మూడేండ్ల లెక్కల్ని పరిశీలిస్తే 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి కేంద్రం రూ.21,543 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత సవరించిన అంచనాల పేరుతో ఆ మొత్తాన్ని రూ.15,628కి పరిమితం చేశారు. అంటే కేటాయింపునకు ఖర్చు చేసిన సొమ్ముకు మధ్య ఆర్థిక అంతరం రూ.5,916 కోట్లు ఉంది.

2024-25లో కూడా ఇదే పరిస్థితి. బడ్జెట్‌లో కేటాయింపు రూ.22,137 కోట్లుగా ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ఏడాదిలో ఖర్చు చేసింది కేవలం రూ.9,700 కోట్లు మాత్రమే. అంటే దాదాపు రూ.12,437 కోట్లకు కోతపెట్టారు. 2025-26 బడ్జెట్‌లో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగానికి మోడీ సర్కార్‌ కేటాయింపు రూ.23,168 కోట్లు. కానీ ఆ తర్వాత కేటాయింపుల్లో రూ.11,073 కోట్లు కోత పెట్టి, కేవలం రూ.12,095 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఈ రంగానికి రూ.24,566.27 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. సవరించిన అంచనాల్లో కేటాయింపుల్ని తగ్గిస్తూ బడ్జెట్‌ సమయంలో మాత్రం పాత కేటాయింపులకంటే ఎక్కువ సొమ్మునే మళ్లీ మళ్లీ ప్రకటిస్తుండటం గమనార్హం.

పేరుకే స్కీంలు
ఉద్యోగాల సృష్టి, గ్రామీణ నైపుణ్యాలకు మార్కెట్‌ లింకేజీలు, అత్యవసర రుణ హామీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల ప్రచారంతో కేంద్ర బడ్జెట్‌ను రూపొందించారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈకి సంబంధించి 2026-27లో పేర్కొన్న ప్రధాన పథకాల్లో ‘పీఎమ్‌ విశ్వకర్మ’ ఒకటి. గ్రామీణ వృత్తిదారులు, శిల్పకారులకు నైపుణ్యాభివృద్ధితో పాటు టూల్‌ కిట్స్‌, వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశ్యం. దీనికోసం వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ. 3,860.89 కోట్లు కేటాయించారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక మద్దతుతో సబ్సిడీతో కూడిన స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం ‘ప్రధానమంత్రి ఎంప్లాయ్ మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (పీఎమ్‌ఈజీపీ)ని ప్రకటించారు. దీనికోసం రూ. 4,500 కోట్లు కేటాయించారు.

రాష్ట్రాల స్థాయిలో పరిశ్రమల మధ్య వారధిగా నిలిచేందుకు మార్కెటింగ్‌, టెక్నాలజీ, డిజిటలైజేషన్‌ కోసం క్రెడిట్‌ సహాయాన్ని అందించేందుకు రైజింగ్‌ అండ్‌ యాక్సెలరేటింగ్‌ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పెర్ఫార్మెన్స్‌ (ఆర్‌ఏఎమ్‌పీ) స్కీంను ప్రకటించారు. దీనిద్వారా ఆయా కంపెనీల అత్యవసర ప్రణాళికలకు బ్యాంకుల ద్వారా నిధుల్ని సమకూర్చి, దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటర్‌గా ఉంటుంది. ఖాదీ, కాయర్‌బోర్డ్‌ వంటి సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం రూ.1,300 కోట్ల నిధితో ఎస్‌ఎఫ్‌యూఆర్‌టీఐ స్కీంను ప్రకటించారు. గడచిన మూడేండ్లలోనూ ఈ పథకాలన్నీ ఉన్నాయి. వాటి కేటాయింపులు, సవరణలు, ఖర్చుల్ని గమనిస్తే, ఈ స్కీంల పరిస్థితి ఎంత దుర్భలంగా ఉందో అర్థమవుతుంది. కేవలం ప్రచారార్భాటం కోసం చేస్తున్న ప్రకటనలే తప్ప, నిజంగా ప్రజలకు వాటిద్వారా మేలు చేకూర్చాలనే చిత్తశుద్ధి ఈ పథకాల్లో ఏ కోశానా కనిపించట్లేదని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -