– అగ్రకుల దురహంకారులు హత్య ఇది
– రజక సామాజిక ప్రజాసంఘాల ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెల్ల పసిబిడ్డను అమానవీయంగా కాలితో తన్ని హత్య చేసిన దురహంకారులను కఠినంగా శిక్షించాలని రజక సామాజిక, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అగ్రకుల పెత్తందారులు శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కన్నిరెడ్డి, తుకారంరెడ్డి మరికొందరిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతోపాటు హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఎనిమిది మంది హంతకులను 24 గంటల్లో తక్షణమే రిమాండ్ చేయాలని లేదంటే రజక సామాజిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య అధ్యక్షతన జరిగిన సభలో రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మెన్ బొమ్మరాజు కృష్ణ మూర్తి, ఎం నరసింహ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదార్ రజక, జాగృతి రాష్ట్ర అధ్యక్షులు బాలాపూర్ బాలారాజ్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటా రమేష్, అనగంటి వెంకటేష్ ప్రసంగించారు. పండగలు ఉత్సవాల్లో అగ్రకుల దురహంకారంతో ప్రజల మధ్య కులవిద్వేషాలు సష్టించడమేంటని ప్రశ్నించారు. దేవుని దగ్గరికి వెళ్లడానికి రూ. వంద ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించిన పాపానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లించిన డబ్బులకు రషీదు అడగటం నేరమా? అని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు మూడున్నర గంటలపాటు గణేష్ అనే రజక యువకుడిని చితక బాధారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన భర్తను కొట్టొవద్దనీ, తమ్ముడిని కొట్టవద్దని గణేష్ అక్క కీర్తి, భార్య మౌనిక ఎంతగా బ్రతిమిలాడినా.. కాళ్లు మొక్కడానికి ప్రయత్నం చేసినా దుర్మార్గులు కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రెండు నెల్ల పసిబిడ్డను అమానవీయంగా హత్య చేశారని చెప్పారు. ఈ ఘటన పట్ల పోలీసుల పాత్ర నిందితులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. బాధితులే అగ్రకుల పెత్తందారులపైన దాడి చేసినట్టుగా బాధితులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.సీఎం సొంత జిల్లాలో ఈ ఘటన జరిగితే సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే ఎన్ ఆశాలత, కేవీపీఎస్ నగర కార్యదర్శి బి సుబ్బారావు, టీపీఎల్‌ఎఫ్ ఉపాధ్యక్షులు కొమ్ము విజరు కుమార్, ఎం బాలకష్ణ, ఎం గోపాల్, సి మల్లేష్, ఎం గాంధీ, ముత్యాల నరసింహారావు, కృష్ణం గారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పసిబిడ్డ హంతకులను కఠినంగా శిక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



