Tuesday, October 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి

జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ రాజార్షి షా
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయ‌న ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. బిబి నగర్ ఎయిమ్స్ ప్రొఫెసర్ త‌నిగై నాధన్ జిల్లాలో గత నెలలో నమోదైన శిశు మరణాల గణాంకాలు, జనన బరువు ప్రకారం విభజన, సంబంధిత గ్రామాలు, తల్లుల ఆరోగ్య వివరాలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన నవజాత శిశు మరణాలపై సమగ్రంగా విశ్లేషణ చేయాలని సూచించారు.

ఐ సి ఎం ఆర్ సంకల్ప్ లో భాగంగా నవజాత శిశువుల మరణాల సంఖ్య 10 కంటే తక్కువ రావాలని, ముఖ్యంగా జనన బరువు ఆధారంగా శిశు మరణాల సంఖ్యను విభజించి కారణాలను గుర్తించాలని సూచించారు. తల్లుల పోషకాహారం లోపం, గర్భధారణ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అనారోగ్య పరిస్థితుల్లో సమయానికి వైద్యసేవలు అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ స్థాయిలో తల్లుల ఆరోగ్య స్థితి, హీమోగ్లోబిన్ స్థాయి, ఆహారపు అలవాట్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ వాడకం, పోషకాహార పంపిణీ వంటి అంశాలను సమీక్షించి రిస్క్ కేసుల జాబితా తయారు చేయాలని సూచించారు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణీ తల్లిని గుర్తించి, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం, సరైన పోషకాహారం అందించడంలో చురుకుగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా వైద్యాధికారి డా.రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ డా. జైసింగ్ రాథోడ్, వైద్యులు అనంత్ రావ్, ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -