Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅగ్రకుల దురహంకారంతోనే పసిబిడ్డ హత్య

అగ్రకుల దురహంకారంతోనే పసిబిడ్డ హత్య

- Advertisement -

దోషులను కఠినంగా శిక్షించాలి : టి స్కైలాబ్‌ బాబు
ఎస్వీకే వద్ద కేవీపీఎస్‌, ప్రజాసంఘాల నిరసన


నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌

అగ్రకుల దురహంకారమే పసి బిడ్డను హత్య చేసిందనీ, ఆ దుర్మార్గానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పసిబిడ్డ ప్రాణాలు తీసిన హంతకులను శిక్షించాలంటూ కేవీపీఎస్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెల్ల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా కాలితో తన్ని ఆగ్రామ అగ్రకుల పెత్తందారులు అత్యంత ధారుణంగా హత్య చేశారని తెలిపారు. దోషులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతోపాటు హత్యానేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

కుమ్మెర గ్రామంలో మల్లన్న్య జాతరలో అట్టడుగు తరగతులకు ప్రవేశాన్ని అడ్డుకుని వివక్ష పాటించడమే కాకుండా మహిళలని చూడకుండా నానా బూతులు తిట్టి అవమానించారని తెలిపారు. ఇదేమిటని సోషల్‌ మీడియాలో ప్రశ్నించిన గణేష్‌ అనే రజక యువకుడిని మూడున్నర గంటల పాటు ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు ఒక గదిలో నిర్బంధించి చితకబాదారని చెప్పారు. తన భర్తను కొట్టొద్దని కాళ్ళ మీద పడి బతిమిలాడి వేడుకున్నా కాళ్లతో తన్నారే కానీ కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది అగ్రకుల దురహంకారులు కాళ్లతో తొక్కి పసిబిడ్డను పొట్టన పెట్టుకున్నారనీ, ఇది అత్యంత అమానవీయ, క్రూరమైన చర్యని ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను రక్షించేందుకే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు. బాధితులకు చట్టబద్ధంగా న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితుల పైన అక్రమ కేసులు పెట్టారని తెలిపారు.

నిందితులు ఎనిమిది మంది కాగా కేవలం నలుగురిని మాత్రమే అరెస్ట్‌ చేశారనీ, మిగతా వారిని కూడా తక్షణమే అరెస్టు చేసి రిమాండ్‌ కు పంపాలని డిమాండ్‌ చేశారు. హత్య జరిగినా హత్యా నేరం కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ ఎస్పీలు.. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఆ గ్రామాన్ని సందర్శించాలని ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు హంతకులైన శ్రీనివాస్‌ రెడ్డి మరికొందరు దగ్గర బంధువులు కావడం వల్ల పోలీసులు కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఎంపీ మల్లు రవి ఈ ఘటనపై ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కోవాబన్‌ అమ్ముకునే అమాయక పేదవాడి పై మత విద్వేషం చిమ్మిన మతోన్మాదులు పసిబిడ్డ హత్య వారి కంటికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు మత కొట్లాటలు పెట్టడం తప్ప మానవీయతను గుర్తించ లేరని విమర్శించారు.

అగ్రకుల హిందువులు నిమ్న కుల హిందువులను చంపితే ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీి మతోన్మాదుల విధానం చంపిన హంతకుల పక్షమేనని రుజువైందన్నారు. సీఎం స్వంత జిల్లాలో ఈ దారుణం జరిగితే సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే హంతకులం దరిని అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడారు. కేవీపీఎస్‌ నగర కార్యదర్శి బి సుబ్బారావు, సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జి రాములు, కేవీపీఎస్‌, ప్రజా సంఘాల నాయకులు కొమ్ము విజయ్ కుమార్‌, లక్ష్మి, ఇందిర, ఎల్లమ్మ, రమేష్‌, నాగేందర్‌, ఆంజనేయులు, శ్రీనివాస్‌, అర్జున్‌, రాంబాబు, సోలంకి, బీమ్‌ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -