Monday, June 2, 2025
E-PAPER
Homeహెల్త్అంటు సోకడం…అంటువ్యాధి…

అంటు సోకడం…అంటువ్యాధి…

- Advertisement -

సామాన్య పరిస్థితుల్లో మానవ శారీరిక శక్తి క్రిముల శక్తి కన్నా పోల్చలేనన్ని రేట్లు ఎక్కువ. కానీ అంటు కాస్తా అంటుజబ్బుగా రూపాంతరం చెందిందంటే, ఇమ్మ్యూనిటి ఓడిందన్నమాట. ఇమ్మ్యూనిటి ఓడడం లేదా క్రిములను సంహరించడమనేది ఆయా వ్యక్తుల వయసు, శారీరిక దృఢత్వం, పోషకాహార నిల్వలు వంటి కారకాల పైన ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న: ఎందుకని రెండు రోజులుగా సుమ డ్యూటీకి రావటంలేదు?
జవాబు: త్రోట్‌ ఇన్ఫెక్షన్‌, ఫీవర్‌ అట.
తరుచుగా అన్ని చోట్లలో మనమందరమూ వినే సంభాషణ.
ప్రశ్న: హలో సుమ! ఇన్ఫెక్షన్‌ అట. ఎలా ఉంది? డాక్టర్‌ దగ్గరకు వెళ్ళావా? ఆంటిబయోటిక్‌ వాడుతున్నావా?
పైన సంభాషణలో పేర్కొన్న ఇన్ఫెక్షన్ని తెలుగులో ‘అంటు’ అని అంటారు.
అసలు ఈ ‘అంటు’ అనే పదం ఇన్ఫెక్షన్‌కి వాడాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
మాములుగా లౌకిక భాషలో ఈ పదాన్ని మనముండే పరిసరాలలో ఏదైన వస్తువు తాకడానికి వీలుకానిది, హానిజనకమైనదిగా ఉన్నట్లయితే దానిని ఉద్దేశించి వాడతాము. దానినుండి దూరంగా ఉండమని ఈ పదం ద్వారా తెలియజేస్తాము. అలాంటప్పుడు హానికారక క్రిములతో కలుషితమైన ఆహారం, నీరు, గాలి, రోగగ్రస్తులైన వారి సంపర్కము ఇవన్నీ కూడా అంటే కదా! అంటు సోకడమంటే శరీరం లోనికి కలుషిత నీరు, గాలి, ఆహారం చేరినప్పుడు వాటిలో ఉన్న హానికారక జీవ రాసులైన క్రిములు, వివిధ శరీరంగాలలో ఆవాసమేర్పరుచుకొని, అభివృద్ధి చెందడం. ఆలా అభివృద్ధి చెందుతున్న తరుణంలో శరీరాన్ని మధ్యస్తంగా లేదా తీవ్ర అస్వస్థతకు గురిచేయడాన్ని అంటు వ్యాధిగా పరిగణించడం జరుగుతుంది.
మన ఆహారాన్ని, నీటిని, పీల్చే గాలిని కలుషితం చేసే క్రిములు మూడు రకాలు. అవి బాక్టీరియా, వైరస్‌, పారసైట్స్‌. వీటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి. వీటి సంఖ్య ఒక్కొక్క వర్గంలో కొన్ని బిలియన్లు ఉండవచ్చని అంచనా. ఇవి వేర్వేరు వాతావరణాలలో, పరిస్థితుల్లో, దేశాంతరాలలో పరిస్థితులకతీతంగా పరిణితి చెందగలిగే శక్తి కలిగి, తమని తాము
అనాదిగా రక్షించుకుంటూ, పెంపొందించుకుంటూ వస్తున్నాయి. ఇవి సానుకూల సందర్భ, సమయాలలో మానవశరీరంలోనికి వచ్చి చేరుతాయి. కలుషిత వాతావరణం, ఆహారం, నీటి ద్వారా, బయట నుండి లోనికి చొచ్చుకొని
వచ్చిన ఈ క్రిములను సంహరించే ప్రక్రియను శరీరం చేపడుతుంది. దీనిని మనం ‘ఇమ్మ్యూనిటి’ తెలుగులో రోగ నిరోధక శక్తి అని అంటాం. మన శరీరంలో చేరిన క్రిములు, తమని తాము రక్షించుకునే దిశగా కొన్ని విషపదార్థాలను ఉత్పన్నం చేస్తాయి. వాటిని ‘టాక్సిన్స్‌’ అంటారు. రోగ నిరోధక శక్తి, టాక్సిన్ల మధ్య యుద్ధం మొదలౌతుంది. అటువంటి విపత్కాలంలో, ఇమ్మ్యూనిటి-టాక్సిన్ల శక్తిని బట్టి శరీరంలో వ్యాధి మొదలౌతుంది.
సామాన్య పరిస్థితుల్లో మానవ శారీరిక శక్తి క్రిముల శక్తి కన్నా పోల్చలేనన్ని రేట్లు ఎక్కువ. కానీ అంటు కాస్తా అంటుజబ్బుగా రూపాంతరం చెందిందంటే, ఇమ్మ్యూనిటి ఓడిందన్నమాట. ఇమ్మ్యూనిటి ఓడడం లేదా క్రిములను సంహరించడమనేది ఆయా వ్యక్తుల వయసు, శారీరిక దృఢత్వం, పోషకాహార నిల్వలు వంటి కారకాల పైన ఆధారపడి ఉంటుంది. అవి బలోపేతంగా ఉన్నప్పుడు నూటికి తొంభైతొమ్మిది సార్లు ఇన్ఫెక్షన్ని అరికట్టడంలో శరీరం సఫలీకృతమౌతుంది. అంటు సోకినప్పటికీ అంటు వ్యాధిగా మారదు. అంటు అనేది అక్కడే, ఆ మానవుని, ఆ శరీర స్థావరంలోనే అంతమైపోతుంది. ఇటువంటి ‘యుద్ధ’ దశలో శరీరం కొంత అస్వస్థతకు గురికావచ్చు. తగినంత విశ్రాంతి, మంచి ఆహారం అవసరమౌతుంది. మాములుగా ఇవి మాత్రమే శరీరానికి కావలిసినవి. ఎలాంటి మందులు అవసరం లేదు. ఆంటిబయోటిక్స్‌ అవసరం అసలే లేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్‌ అనేది వచ్చింది లేనిది, రోగ నిరోధక శక్తి, టాక్సిన్ల మధ్య యుద్ధంలో శరీర రోగ నిరోధక శక్తి ఓడిపోయి, సోకిన అంటు, వ్యాధికి దారి తీస్తున్నదా లేదా అని తెలుసుకొనే అవకాశం సాధారణంగా ఈ దశలో కుదరదు. అంటువ్యాధితో బాధపడుతున్న వారి సంపర్కంలో ఉన్నందున, కొద్దీ పాటి శారీరిక అస్వస్థత కలిగితే, అంటువ్యాధి వచ్చినట్లుగా అనుమానించడం జరుగుతుంది.
ఉదాహరణకు సాధారణంగా ఒక తరగతిలో దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఒక చిన్నారి ప్రక్కనే కూర్చునే ఆరోగ్యసమస్యలేవి లేని పిల్లల్లో కొంచం గొంతు జీర బోయిందనుకోండి ఆ పిల్లల తల్లితండ్రులో లేదా సంరక్షకులు కొందరు వెంటనే అంటువ్యాధి వచ్చేసిందని భయపడి, వైద్యసలహా కొరకు పరుగులు తీస్తారు. మంచి మందులు రాసి, వెంటనే జబ్బు నయం చేయమని కోరుతారు. అలాంటప్పుడు కొందరు వైద్యులు, అటువంటి వారి అభ్యర్థన మన్నించడానికి వేరు దారి లేక ఆ చిన్నారికి అధునాతనమైన, శక్తివంతమైన ఆంటిబయోటిక్స్‌ ఇస్తారు. అప్పుడప్పుడు ఒకటి కాదు, రెండు, మూడు కూడా ఇస్తారు కొందరు వైద్యులు. దీనివల్ల ఇన్ఫెక్షన్‌ వెంటనే తగ్గిపోవచ్చు. కానీ ఆంటిబయోటిక్‌ దుర్వినియోగం అవుతుంది. దాని అవసరం లేనప్పుడు వాడితే నిజంగా అవసరమైనప్పుడు పనిచేయకుండా పోతుంది.
ఆంటిబయోటిక్‌లను ‘ఆంటిబయోటిక్‌ పాలసీ’ ప్రకారమే వాడాలి.
ఇన్ఫెక్షన్‌, శరీర ఇమ్మ్యూనిటి మధ్య జరిగే యుద్ధంలో ఇమ్మ్యూనిటి ఓడిపోతేనే అంటు వ్యాధిగా పరిణితి చెందుతుంది. దీనిని ఆంగ్లంలో ‘ఇన్ఫెక్షియస్‌ డిసీస్‌’ అని అంటారు. ఇక్కడ గుర్తుతెచ్చుకోవాల్సిన విషయం-ఇన్ఫెక్షియస్‌ డిసీస్‌ కారకాలు కూడా మూడు. అవి బాక్టీరియా, వైరస్‌, పేరాసైట్స్‌. వ్యాధి వైరస్‌ వల్లనో లేదా పారసైట్‌ వలనో ఐతే, ఆంటిబయోటిక్‌ అవసరం లేదు. వాటికీ ఆంటిబయోటిక్‌ పనిచేయదు. ఎందుకంటే యాంటిబయోటిక్స్‌ అనేవి బాక్టీరియా జనిత జబ్బులను అరికట్టేవి. ఇవి ఎన్నో రకాలు. భిన్నరకాలైన బాక్టీరియా వేర్వేరు యాంటిబయోటిక్స్‌కి స్పందిస్తాయి. ఆంటిబయోటిక్‌ పాలసీ ప్రకారం ఏ అంటువ్యాధి ఏ బాక్టీరియా వలన వచ్చిందో, అది ఏ ఆంటిబయోటిక్‌కి స్పందిస్తుంది అన్నది ప్రయోగశాలలో నిర్ధారించిన పిమ్మట, ఆ ఆంటిబయోటిక్‌ వయసుకు, శరీర బరువుకు తగ్గ మోతాదులో ఇవ్వవలిసి ఉంటుంది.
అప్పుడప్పుడు మిశ్రిత/ ద్వితీయ అంటు (మీక్సిడ్‌/సెకండరీ ఇన్ఫెక్షన్‌), అనగా వైరస్‌, బాక్టీరియా రెండూ కలిసి లేదా ఒకదాని తర్వాత ఇంకొకటి వెనువెంటనే దాడి చేసినప్పుడు, ఆలా అని ప్రయోగశాలలో ధృవించినప్పుడు, అటువంటి సందర్భాల్లో ఆంటిబయోటిక్‌ ఒకటి కన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. ఇంన్ఫెక్షన్ల శృంఖలాలు మరల విజృంభిస్తూ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో, మన అందరిలో విద్య, ఆర్థిక, సాంఘికంగా ఎన్ని తారతమ్యాలున్నప్పటికీ, వయసు, లింగ భేదాలతో సహా పక్కకు పెట్టి, అంటు, అంటు సోకడం, అంటు వ్యాధి, ఆంటిబయోటిక్‌ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే అంశాలపై సతర్కులై ఉండడం వల్ల అంటు వ్యాధుల నుండి మనల్ని, మన చుట్టూ ఉన్న మనవాళ్ళందరిని కాపాడుకొని, తద్వారా సమాజంలో ఉన్న ‘అంటు’ని పారద్రోలే ప్రయత్నం చేద్దాం.
Dr. Meera,
Retired Professor of Microbiology,Fever hospital / Osmania medical college, Hyderabad.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -