పశ్చిమాసియా యుద్ధంతో ప్రభావం : ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. యుద్ధం ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే మరింత ద్రవ్యోల్బణ అలజడకి కారణం కావచ్చని హెచ్చరించింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచ ఇంధన రంగం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నివేదిక పేర్కొంది. అయితే పశ్చిమాసియా ఘర్షణలు భారత్‌పై పెద్ద ప్రభావం చూపకపోవచ్చని తప్పుల తడకగా రిపోర్ట్ ఉండటం గమనార్హం. బ్యారెల్ చమురు ధర 110 డాలర్లు దాటడంతో భారత ఇంధనం, రవాణపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. గ్యాస్ కొరతతో అనేక కంపెనీలు మూతపడు తున్నాయి. మరోవైపు యుద్ధం ప్రభావంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్ కనిష్టం 94 చేరువలో నమోదయ్యింది. ఎగుమతులు పడిపోతున్నాయి.. అయిన ప్పటికీ యుద్ధ ప్రభావం అంతంతే అంటూ ఎస్‌బీఐ నివేదికలో పేర్కొనడం సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల్లో అస్థిరత ఏర్పడవచ్చని రిపోర్ట్ పేర్కొంది. ఒకవేళ ఈ సంఘర్షణ దీర్ఘకాలం కొనసాగితే.. ముడి చమురు ధర ప్రతీ 10 డాలర్లు పెరిగినప్పుడు.. భారత కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) 36 బేసిస్ పాయింట్లు, ద్రవ్యోల్బణం 35-40 బేసిస్ పాయింట్లు పెరిగే ప్రమాదం ఉందని నివేదిక అంచనా వేసింది. ”భారత్‌కు సంబంధించి ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విదేశీ నగదు, ముడి చమురు దిగుమతులపై ఈ ప్రభావం స్వల్పకాలికంగా ఉండవచ్చు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం సుమారు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.
ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలకమైన హార్ముజ్ నదీమార్గంపై ఆధారపడటం ఇంధన భద్రతపరంగా ఒక సవాలుగా మారింది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా తన చమురు దిగుమతులను ప్రస్తుతం 40 కంటే ఎక్కువ దేశాల నుంచి తీసుకుంటుంది. ముఖ్యంగా 2022 నుంచి రష్యా నుంచి దిగుమతులు పెరగడం మనకు రక్షణగా నిలిచింది. మరోవైపు 2025 ఆర్థిక సంవత్సరంలో భారత విదేశీ రెమిటెన్స్‌లు 15 శాతం వృద్ధితో 138 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 38 శాతం వాటా గల్ఫ్ దేశాలదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత విధానపరమైన నిర్ణయాలు సంక్షోభ ప్రభావాన్ని తట్టుకోవడానికి తోడ్పడతాయి.” అని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది.



