న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరుగుతున్న చమురు ధరల ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రథమార్థంలో భారత ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ హెచ్చరించింది. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం అంచనాల కంటే వేగంగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషించింది. దీని వల్ల సామాన్యుల వాస్తవ ఆదాయం తగ్గి వినియోగ వ్యయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫిచ్ తన గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. అయితే.. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2026-27 వృద్ధి అంచనాలను 6.7 శాతానికి సవరించింది. డిసెంబర్ 2026 నాటికి ద్రవ్యోల్బణం 4.5 శాతానికి చేరుకోవచ్చని హెచ్చరించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు స్వల్పంగా మందగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. రుణాల జారీలో రెండంకెల స్థాయిలో పెరుగుదల ఉండొచ్చని పేర్కొంది.



