Thursday, January 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅమానుష లైంగికదాడులు-మనువాద మూలాలు

అమానుష లైంగికదాడులు-మనువాద మూలాలు

- Advertisement -

గత వారం సంచలన పరిణామాలు మహిళలపై లైంగికదాడుల సమస్యను మరోసారి నాటకీయంగా దేశం ముందుకు తెచ్చాయి. పదిహేనేళ్ల వయసులోనే స్థానిక శాసనసభ్యుడు కులదీప్‌ సింగ్‌ సెంగార్‌ ఉచ్చులో చిక్కిన ఉన్నావో అత్యాచార బాధితురాలు అసాధారణ కథ ప్రజల్లో చర్చగా విస్ఫోటనం చెందింది. 2017లో జరిగిన ఈ లైంగికదాడి కేసులో సెంగార్‌ కు విధించబడిన యావజ్జీవ శిక్షను నిలిపివేసి ఆయనను విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు తీర్పునివ్వడం నమ్మశక్యంగాని విషయంగా తయారైంది. సహజంగానే ఈ తప్పుడు పరిణామంపై దేశమంతటా నిరసన వెల్లువ వ్యక్తమైంది. లైంగిక హింసకు గురైన మహిళలకు న్యాయం చేసే విషయమై మరోసారి చర్చ ప్రారంభమైంది.
ఈ కేసులో పోరాడిన అంబేద్కర్‌ అనుయాయుడైన న్యాయవాది మెహమూద్‌ ప్రాచా ఈ తీర్పు భయానక పర్యవసానా లను పేర్కొంటూ ‘న్యాయమే బాధితురాలైంది’ అంటూ చాలా లోతైన అర్థంగల వ్యాఖ్య చేశారు. ‘ఆసిఫా కేసు, హత్రాస్‌ కేసు, ఇక ఇప్పుడు ఉన్నావో కేసు వంటివి మొత్తం సమాజాన్ని కలచివేస్తాయి. అయితే ఈ రోజున భారత దేశంలో న్యాయపరమైన ఆలస్యం ఎంత మామూలై పోయిందంటే న్యాయమే బాధిత అవుతున్నది అని కూడా ఆయన అన్నారు.

బిల్కిస్‌ బానో చారిత్రక సమరం
బహుశా ఈ కొత్తరకం భయానక పరిణామాల పరంపర గుజరాత్‌ మత మారణహోమంతో ప్రారంభమై వుండాలి. బిల్కిస్‌ బానో సంచలన కేసు ఒళ్లు గగుర్పొడిచే ఈ తప్పుడు ప్రక్రియలను ముందుకు తెచ్చింది. అంతకుముందు మహిళలు హింసకు గురికాలేదని కాదు. అయితే కొత్త కోణం ఏమంటే అలాటి నేరాలను ఆయుధాలుగా ప్రయోగించడం. అందుకుగాను మొత్తం సామాజిక రాజకీయ సైద్ధాంతిక తోడ్పాటు కూడా అందించడం. ఈ విధంగా అటు మహిళా సమస్యను ఇటు మతపరమైన దళిత హింసను జతపర్చడం ప్రస్తుతం మరింత భయంగొల్పే అంశంగా మారింది.
న్యాయం కోసం చేసిన పోరాటంలో బిల్కిస్‌ బానో చెప్పుకోదగిన దృఢ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. పౌర సమాజం, పెద్ద ఎత్తున లైంగిక హింస జరిగినట్టు హక్కుల బృందాలు వెల్లడించిన నివేదికలలో సాక్ష్యధారాలు లభించాయి. అయితే కొన్ని లైంగికదాడి కేసులు మాత్రమే నమోదు చేశారనీ, అనేకం పోలీసులు సేకరించిన వాటిలోనూ ఆ మహిళలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో వారు తాము ఎదుర్కొన్న నరకాన్ని గురించి చెప్పేందుకు విముఖంగా ఉన్నారని ఆర్‌టిఐ ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారం వెల్లడించింది. సమాజం చులకనకు గురవుతామనే భయం వారిని చెప్పడానికి సంశయిం చేలా చేసేందుకు కారణమైంది. గుజరాత్‌లో 2022 జాతి హత్యాకాండ సాగించిన వారి అమానుష ప్రవర్తనతో భయకంపితులైన బాధితులు పోలీ సులకు ఫిర్యాదు చేసేందుకు జంకారు. మరీ ముస్లిం మహిళల కైతే పోలీసులపై అసలు విశ్వాసం లేకుండా పోయింది.

అలాంటి వాతావరణంలోనూ బిల్కిస్‌బానో ధైర్యంగా ముందుకొచ్చిన కొద్దిమంది బాధిత మహిళలలో బిల్కిస్‌ బానో ఒకరు. చారిత్రకంగా చెప్పుకోదగిన స్థాయిలో ఆమెచేసిన పోరాటం కారణంగానే స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే మత హింస నేపథ్యంలో జరిగిన లైంగికదాడి కేసులో మొట్ట మొదటిసారి శిక్ష పడింది. మత హింస సాగించేప్పుడు మొత్తం ఒకవర్గాన్ని అవమానించేం దుకు, నీరసపర్చేందుకు పాశవిక లైంగికహింస ఒక సాధనంగా ప్రయోగించబడు తుందనేది బాగా తెలిసిన విషయమే. అయితే పోరాటంతో బిల్కిస్‌ శిక్ష పడేలా చేసినా ప్రభుత్వం ఆ దుండ గులను క్షమించి వదిలేసింది. అయితే గౌరవ ప్రదమైన కొన్ని స్వచ్ఛంద సంస్థలూ, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కృషి వల్ల సుప్రీం కోర్టు ఈ కేసు దర్యాప్తును గుజరాత్‌ నుంచి బదలాయించింది. పోలీసులు తయారు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ను తిరస్కరించింది.

అమానుష హత్యాకాండ
2002 గుజరాత్‌ మారణకాండలో బిల్కిన్‌బానో తదితర ఇంకా అనేక కేసుల్లో జరిగిన దాన్ని మరింత భయంకరంగా గుర్తు చేసింది ఉన్నావో కేసు. వాస్తవంగా ఉన్నావో కేసు మొక్కుబడిగా తెరిచి మూసేయడానికి ఉదాహరణ వంటిది. అయితే సెంగార్‌కు బలమైన సంబంధాలున్న కారణంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత చూపాయి. న్యాయ విచారణ సందర్భంలోనే బాధితురాలి సమీప బంధువులను చంపేయడం ద్వారా సాక్ష్యధారాలను మటుమాయం చేసే ప్రయత్నం జరిగింది. సిబిఐ ఈ కేసులో ఉదాసీనతను వ్యతిరేకిస్తూ పిటిషన్‌ వేయలేదు. అతనికి మినహాయింపునిస్తూ ఈ అమానుషమైన ఉత్తర్వునిచ్చిన ఢిల్లీ హైకోర్టు కూడా ఆ మాట చెప్పింది. అయితే ఈ ఉత్తర్వు తర్వాత దేశమంతటా వ్యక్తమైన తీవ్ర నిరసన కారణంగా సిబిఐ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై స్టే కోరుతూ సుప్రీంకు వెళ్లవలసి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వు శాంతి భద్రతల కోణం లోనూ లోపభూయిష్టమని చెప్పడం, మినహాయింపును కొట్టి వేయడానికి సాధారణ నిబంధనలు దాటివెళ్లడం మరో విషయం.
ప్రముఖ సామాజిక కార్యకర్తలు, మహిళా ఉద్యమ నాయకులు, పౌర సమాజ నేతలు ఈ అమానుష పరిణామాలకు సంబంధించి రాజకీయమైన మేధాపరమైన సమాచారం ఎంతో సేకరించారు. ఈ పరిణామాలకు సంబంధించి వారు పొందుపర్చిన అనుభవాలను విస్మరించడం అంటే అనర్థాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. హిందూత్వ శక్తుల పెరుగుదల, ఆరెస్సెస్‌, బీజేపీలకు అధికారం ఉండటానికి మహిళలపై నేరాలు పెరిగిపోవడానికి చాలా దగ్గర సంబంధముందని ఈ నాయకులు, కార్యకర్తలు, న్యాయవేత్తలు, స్త్రీవాదులు చేసిన అధ్యయ నాలు ప్రచురణలూ నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి.

నూరేళ్ల ఆరెస్సెస్‌ భావజాలం
అందువల్ల ఇక్కడ కేవలం నేరం మాత్రమేగాక ఆ నేరాలను విజయోత్సవాలుగా జరిపి నేరపూరిత సమర్థన కూడా దేశం మూలాలను ఛిద్రం చేస్తున్నది. ఈ ప్రమాదకర జాడ్యం సైద్ధాంతిక మూలాల్లోకి వెళ్లడం ఉపయోగకరంగా ఉండగలదు. ఆరెస్సెస్‌ నూరేళ్ల వేడుకల సందర్భంలో ఆ సంస్థ అగ్ర నాయకత్వం అధినేత మోహన్‌ భగవత్‌తో సహా దాని పురుషాధిక్య పోకడలూ పితృస్వామిక లక్షణాలూ అవిభాజ్యమైనవని వెల్లడించుకున్నారు. సనాతన ధర్మంతో సహా హిందూత్వను ప్రబోధించడం దాని అంతస్సారాన్ని పట్టి చూపించాయి. రామాయణ మహాభారతాల కాలం నుంచి ఇవి మనందరి మెదడు పొరలలో నిక్షిప్తమై పోయాయి. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం కోసం అగ్నిపరీక్షను ఎదుర్కోవలసింది సీత మాత్రమే. ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో అవమానాలకు గురయ్యేది ద్రౌపది శరీరమే.

ఇతిహాసాలు మాత్రమే కాదు, వేదాలు, పురాణ పాఠాలు కూడా వాస్తవంగా స్త్రీలను తక్కువగా చూపడం, శిలువ వేయడం చెరిగిపోని వాస్తవాలుగా వున్నాయి. రుగ్వేద అధర్వ వేదాలలో స్త్రీలకు ఇంటి పని, పిల్లలను కనడం మాత్రమే కేటాయించ బడ్డాయి. భర్తకు అంకితం కావడమనే పాతివ్రత్యం లొంగు బాటుకు పర్యాయపదంగా మారింది. భగవద్గీత, అర్థశాస్త్ర అన్నిటినీ మించి మనుధర్మం ”స్త్రీలకు శయనించడం, కామదాహం, కోపిష్టితనం, నయవంచన, కపటం, తప్పు నడత వంటి దుర్లక్షణాలుంటాయి. వారికి హృదయమే వుండదనీ, విశ్వాసహీనులనీ, వారిని కాపలాలో ఉంచాలనీ, స్త్రీలు స్వాతంత్య్రానికి అనర్హులనీ, సామాజిక చట్రాన్ని విచ్ఛిన్నం చేస్తారనీ, చంచల స్వభావులనీ” పేర్కొన్నాయి. భర్త తన భార్యను వదలేయవచ్చనీ, తాకట్టు పెట్టవచ్చనీ, లేదంటే అమ్ముకోవచ్చనీ (ద్రౌపది వలె) మనుస్మృతి చెబుతున్నది. శివ పురాణంలోనూ దేవీ భాగవత పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, భగవత్‌ పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, అగ్ని పురాణం మత్స్య పురా ణం, బ్రాహ్మణ పురాణం అన్నిటిలోనూ అలాంటి జ్ఞానగుళికలు వున్నాయి. ఇంటికి పరిమితమై పతిసేవలో, కుటుంబంలోని ఇతర పురుషుల సేవలో నిమగమై స్త్రీలు తమ స్వాతంత్య్రాన్ని పూర్తిగా మర్చిపోవాలి.

రెండు సవాళ్లపై సమరం
కాలంచెల్లిన ఈ దురభిప్రాయాలన్నీ ఇరవయ్యవ శతాబ్దంలో ఏ విధంగానూ చెల్లుబాటు కాబోవనేది పరమసత్యం. ఎన్నికైన నాయకులు తాము విశ్వగురువులమనీ, సమకాలీన ప్రపంచంలో అపారమైన ప్రభావశీల నేతలమని భావించేట్టయితే వారు ఇలాంటి తిరోగామి ఆలోచనల నుంచి విడగొట్టుకోవలసి వుంటుంది. వాటికి వ్యతిరేకత ప్రకటించుకోవాల్సి వుంటుంది. అయితే ఆరెస్సెస్‌ హిందూత్వతో బీజేపీి పేగుబంధం కారణంగా ఇది జరిగేపని కాదు. అందువల్ల అతి ప్రాచీన కాలాల నుంచి భారత దేశంలో స్త్రీలు సాధికారతకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, ఆదాయం వంటి అంశాల్లో అసమానతలకు తోడు ఇప్పటిపరిస్థితులలో మూఢత్వం, పురుషాధిక్య పోకడలతో కూడిన అమానుష ప్రపంచమనే మరో పెద్దసవాలును ఎదుర్కోవలసి వస్తున్నది. కేవలం ప్రజాస్వామిక, లౌకిక శక్తుల సమిష్టి బలంతోనే ఆ సవాలును ఎదుర్కొనడం సాధ్యమవు తుంది. స్త్రీపురుషులు చేయిచేయి కలిపి పోరాడవలసి వుంటుంది. అలాంటి లక్ష్య సాధన కోసం ప్రజాతంత్ర మహిళా ఉద్యమం ఇప్పటికే గణనీయమైన దోహదం చేసింది.
(డిసెంబర్‌ 31 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -