– ఆవును చంపాడన్న నెపంతో దళితుడి హత్య
భువనేశ్వర్ : ఒడిశాలో దేవగఢ్ జిల్లాలో అమానుషం జరిగింది. ఆవును చంపాడన్న నెపంతో 35 ఏండ్ల దళిత వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. రియామల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుండేజురి గ్రామంలో బుధవారం ఘటన జరిగింది. మృతుడ్ని కిషోర్ చమర్‌గా గుర్తించారు. ఈ ఘటనలో అతని సహాయకుడు గౌతమ్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. కౌన్సిధిప గ్రామానికి చెందిన ఈ ఇద్దరూ మరణించిన జంతువుల చర్మాన్ని తొలగించే వృత్తిలో ఉన్నారు. తమ వృత్తిలో భాగంగా కుండేజరి సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఆవు కళేబరం నుంచి చర్మాన్ని సేకరిస్తుండగా కొంతమంది గ్రామస్తులు చూశారు. ఆవును వారే చంపారనే అనుమానంతో దాడికి దిగారు. తాము ఆవును చంపలేదని, అప్పటికే మరణించిన ఆవు నుంచి చర్మాన్ని తొలగిస్తున్నామని చమర్ ఎంతగా చెప్పినా ఆ గుంపు వినలేదు. చమర్, గౌతమ్ నాయక్‌పై తీవ్రంగా దాడి చేశారు. చమర్ అక్కడికక్కడే మరణించగా, తీవ్రగాయాలైన నాయక్ ఏదో విధంగా తప్పించుకున్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరుగుర్ని అరెస్టు చేసినట్టు దేవ్‌గఢ్ ఎస్పీ అనిల్‌కుమార్ మిశ్రా మీడియాకు తెలిపారు.
ఒడిశాలో అమానుషం
- Advertisement -
- Advertisement -