గాయాలతో ఆటగాళ్లు సతమతం
ఈ సీజన్‌కు దూరమవుతున్న స్టార్స్
క్రికెటర్లకు గాయాలు సాధారణం. ఐపీఎల్ ప్రతి సీజన్‌లోనూ ఇది చూస్తున్నాం. కానీ 2026 ఐపీఎల్ కాస్త భిన్నం. టీ20 ప్రపంచకప్ ఇటీవలే ముగియగా, ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ క్రికెట్ షెడ్యూల్ బిజీగా సాగింది. ఫలితంగా, క్రికెటర్లు గాయాల పాలవటంతో ఐపీఎల్‌పై ప్రభావం పడుతోంది. ఐపీఎల్ ప్రాంఛైజీలన్నీ ఆటగాళ్ల గాయాల బెడదను ఎదుర్కొంటున్నాయి. ఏ జట్టులో ఏ ఆటగాడు గాయంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమయ్యారో చూద్దాం.
నవతెలంగాణ క్రీడావిభాగం
కోల్‌కతా నైట్‌రైడర్స్
ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్. బంగ్లాదేశ్‌తో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను సీజన్ ఆరంభానికి ముందే విడుదల చేసిన నైట్‌రైడర్స్‌కు.. ఇతర పేసర్లు సైతం దూరమయ్యారు. హర్షిత్ రానా మోకాలి గాయంతో టీ20 ప్రపంచకప్‌తో పాటు ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. లీగ్ దశ ఆఖరు లేదా ప్లే ఆఫ్స్‌కు హర్షిత్ రానా అందుబాటులోకి రావచ్చు. మతీశ పతిరణను వేలంలో భారీ ధరతో దక్కించుకున్న కోల్‌కతా.. అతడు టీ20 ప్రపంచకప్‌లో పిక్క గాయానికి గురవటంతో ఆందోళనకు గురవుతోంది. తాజాగా ఆకాశ్ దీప్ సైతం వెన్ను నొప్పితో ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేస్ విభాగం గాయం బారిన పడింది. ఇప్పుడా జట్టు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ సక్సెస్ ఫార్ములా కెప్టెన్ పాట్ కమిన్స్. జట్టు నాయకుడిగా సన్‌రైజర్స్‌కు దూకుడు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన ఘనత అతడిదే. గాయం నుంచి కోలుకుని యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టు ఆడినా.. ఫిట్‌నెస్ సాధించని పాట్ కమిన్స్ టీ20 ప్రపంచకప్‌కు సైతం దూరమయ్యాడు. పాట్ కమిన్స్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. 5-7 లీగ్ దశ మ్యాచ్‌లకు కమిన్స్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. మరో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కాలు గాయంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
రాజస్తాన్ రాయల్స్
టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు చేరుకోవటంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ శామ్ కరణ్. టీ20 ప్రపంచకప్‌లో గజ్జల్లో గాయానికి గురైన శామ్ కరణ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. శామ్ కరణ్ సైతం ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఆస్ట్రేలియా పేసర్ జోశ్ హాజిల్‌వుడ్ సీజన్‌లో తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని నెలలుగా ఆటకు దూరమైన హాజిల్‌వుడ్ యాషెస్ సిరీస్‌లో సైతం ఆడలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హాజిల్‌వుడ్ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తోంది.
చెన్నై సూపర్‌కింగ్స్
చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా కనిపిస్తోంది. కానీ ఆ జట్టు బౌలింగ్ బృందమే కాస్త బలహీనంగా ఉంది. ఈ సమయంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ నాథన్ ఎలిస్ తొడ కండరాల గాయం సూపర్‌కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. ఆస్ట్రేలియా దేశవాళీ వన్డే కప్ ఫైనల్లో నాథన్ ఎలిస్ పాత గాయం తిరగదోడింది. దీంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్
ఎన్నో ఆశలు, అంచనాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను తీసుకుంది. కానీ మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభం నుంచి క్యాపిటల్స్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. బిజీ అంతర్జాతీయ షెడ్యూల్‌తో మిచెల్ స్టార్క్ పనిభారాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పర్యవేక్షిస్తోంది. దీంతో మిచెల్ స్టార్క్ లీగ్ దశ ద్వితీయార్థ నుంచే క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆరంభ మ్యాచ్‌ల్లో క్యాపిటల్స్ విజయావకాశాలను ఇది దెబ్బతీయనుంది.
పంజాబ్ కింగ్స్
భారత పిచ్‌లపై మంచి రికార్డున్న న్యూజిలాండ్ లాకీ ఫెర్గుసన్. ఫిట్‌నెస్ పరంగా ఫెర్గుసన్‌కు ఎటువంటి ఇబ్బంది లేదు. పుత్స్రోహంలో ఉన్న ఫెర్గుసన్ కుటుంబంతో కలిసి కొంత సమయం గడపాలని అనుకుంటున్నాడు. దీంతో ఐపీఎల్ సీజన్‌కు ఆరంభం నుంచి అందుబాటులో ఉండటం లేదు. సీజన్ మధ్యలో పంజాబ్ కింగ్స్ శిబిరంలో చేరనున్నాడు.
క్రికెటర్లకు గాయాలతో ఐపీఎల్ 2026 సీజన్‌లో సుమారు ఏడు ప్రాంఛైజీలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కానీ ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌లకు ఈ ఇబ్బంది లేదు. ఈ మూడు జట్ల ఆటగాళ్లు గాయాల బారిన పడిన జాబితాలో లేరు. కానీ చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు గాయాలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి.
కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవటం జట్ల విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. పూర్తిగా అందుబాటులో ఉండని ఆటగాళ్ల స్థానంలో మరొకరిని ఎంచుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే ఆటగాళ్ల స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఐపీఎల్ 2026 ఈ నెల 28న చిన్నస్వామి స్టేడియంలో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌తో ఆరంభం కానుంది.



