Monday, February 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతీరని అన్యాయం

తీరని అన్యాయం

- Advertisement -

తెలంగాణ ఏం తప్పు చేసింది..
జాతీయ ఉపాధి హామీకి బీజేపీ తూట్లు
ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంక్షేమాన్ని పట్టించుకోలేదు
సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు, ఎంపీలు ప్రధానిని కలుద్దాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి

నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) బృందంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుద్దామని విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను పలుమార్లు కలిసినా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశపరిచిందని అన్నారు.

మూసీ పునర్జీవం, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), హైదరాబాద్‌ నగర అభివృద్ధికి సంబంధించి మెట్రో రైల్‌ విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఆశించామని చెప్పారు. బయో ఫార్మా అంటే కేంద్రానికి గుర్తు రావాల్సింది తెలంగాణ అనీ, కేంద్రం ప్రకటించిన బయో ఫార్మాలో నిధులను పొందుపరచకపోవడం తీవ్ర నిరాశపరిచిందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఎలక్ట్రానిక్స్‌కు రూ.40 వేల కోట్ల కేటాయింపులు చేశారని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ అంటే హైదరాబాద్‌ అన్నట్టుగా పేరుగాంచిందనీ, తెలంగాణకు ఈ విభాగంలోనూ నిధులివ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందనీ, కోవిడ్‌ సమయంలో భారత్‌కే కాకుండా ప్రపంచానికి ఔషధాలను అందించిందని గుర్తు చేశారు. ఫార్మా హబ్‌లో కూడా తెలంగాణ ప్రస్తావన లేదన్నారు.

ఆరేంజ్‌ ఎకానమీలో అన్యాయం
తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగంపైన దృష్టిపెట్టిందని భట్టి అన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌లోనూ ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడితో క్రీడలు నిర్వహించామని చెప్పారు. క్రీడారంగంపైన ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్న తెలంగాణ కేంద్రానికి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఆరెంజ్‌ ఎకానమీలో హైదరాబాద్‌ సెంట్రిక్‌ను ముంబయికి తరలించారని అన్నారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడియో, వీడియో, గేమింగ్‌ కామెక్స్‌ లాంటి వాటికి హైదరాబాద్‌ కేంద్రమని వివరించారు. ఆరెంజ్‌ ఎకానమీలో హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. రీజినల్‌ మెడికల్‌ వ్యాల్యూ హబ్‌లో ఇతర రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణకు ఎందుకివ్వలేదని అడిగారు. టూరిజం విభాగంలో కూడా తెలంగాణను పొందుపరచకపోవడం అన్యాయమని విమర్శించారు. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌లో కూడా తెలంగాణపై కేంద్రం దృష్టి సారించలేదని అన్నారు.

సెమీ కండక్టర్లను మంజూరు చేయాలని మోడీని కోరినా తెలంగాణకు మొండిచేయి చూపించారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమంపై ఈ బడ్జెట్‌ దృష్టి సారించలేదని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచిందని చెప్పారు. గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా అభివృద్ధి చేసేలా ముందుకెళ్తున్నామని అన్నారు. రాష్ట్రానికి ప్రోత్సాహం అందించకుండా కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రాష్ట్రాలకు నాలుగు శాతానికి అవకాశమివ్వాలని కోరామని గుర్తు చేశారు. కేంద్రం మాత్రం 4.3 శాతం పెట్టుకుందని వివరించారు. భారత్‌లో తెలంగాణ అంతర్భాగం కాదా?అని ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు ఆర్థిక స్థితిగతులు పెంచడానికి మౌలిక సదుపాయాలు కల్పించే వీలుగా బడ్జెట్‌ ఉండాలని సూచించారు.

చట్టప్రకారమే విచారణ
తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పూనుకోవడం లేదని భట్టి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు విచారణపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన అందించడమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు. విచారణ చట్టబద్ధంగానే జరుగుతుందన్నారు. దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాల్సిన ఫోన్‌ ట్యాపింగ్‌ను కొందరు వ్యక్తులపై ఉపయోగించారంటూ ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. విచారణ అనేది విధానం ప్రకారమే ఉంటుందన్నారు. ఎవరిపైనా కక్షసాధింపు ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -