– విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్
నవతెలంగాణ – కామారెడ్డి
విద్యారంగ అభివృద్ధిలో కామారెడ్డి జిల్లా నిర్లక్ష్యానికి గురవుతోందని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్ ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు పాఠశాలలు మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, జిల్లా కేంద్రం కామారెడ్డి నియోజకవర్గానికి మాత్రం పాఠశాల మంజూరు కాలేదన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించే ఈ పాఠశాలను కామారెడ్డిలో ఏర్పాటు చేస్తే వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
పూలే జయంతి కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వారం రోజుల్లో కామారెడ్డికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు అవుతుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పాఠశాల మంజూరు కాలేదని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలను మంజూరు చేయించాలని కోరారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఏ , ఎంసి ఏ వంటి పీజీ కోర్సులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కోర్సుల కోసం విద్యార్థులు ఇతర జిల్లాలు, హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి వస్తే ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ ) కోసం భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామంలో భూమి కేటాయించారని తెలిపారు. ఏటీసీ ని జిల్లా కేంద్రం కామారెడ్డిలో ఏర్పాటు చేస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల విద్యార్థులకు రవాణా పరంగా మరింత సౌకర్యంగా ఉంటుందని అన్నారు. యంగ్ ఇండియా స్కూల్, ఎంబీఏ –ఎంసి ఏ పీజీ కోర్సులు, ఏటీసీ విషయంలో కామారెడ్డి జిల్లా విద్యార్థులకు న్యాయం చేయాలని వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు పాషా, ప్రధాన కార్యదర్శి చందు, కార్యదర్శి అశ్విని, నాయకులు నోమన్, ప్రణయ్, రిత్విక, వేణు, హిమశ్రీ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.



