భారీగా డబ్బులు వసూలు
నకిరేకల్ లో ఇద్దరు నిందితుల అరెస్ట్
నవతెలంగాణ – నకిరేకల్
భూమి పంచాయితీలో తనకు పరిచయమైన వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ కే. శివరాంరెడ్డి తెలిపారు. మంగళవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నకిరేకల్ పట్టణానికి చెందిన ముద్ధం బాలరాజు తన వద్ద ఉన్న కార్లను సెల్ఫ్ డ్రైవ్ లకు ఇస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఎక్కువగా కిరాయిలు రాకపోవడంతో మధ్య మధ్యలో గ్రామాలలో జరుగుతున్న భూమి పంచాయతీలకు వెళ్తుండేవాడు. మండలంలోని నోముల గ్రామానికి చెందిన సామవిక్రం రెడ్డికి అదే గ్రామానికి చెందిన సామ సురేందర్ రెడ్డి తో భూమి తగాదాలు జరుగుతుండేవి. ఈ పంచాయితీలకు బాలరాజు కొన్నిసార్లు పెద్ద మనిషిగా వెళ్లాడు. సామ విక్రమ్ రెడ్డి తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బాలరాజు వారికి దగ్గరయ్యాడు. ఓసారి తనకు నకిరేకల్ లోని ఓ హాస్పిటల్ వద్ద ఉన్న ఫ్లాటు లిటికేషన్ లో ఉందని రూ. 23 లక్షలు అప్పుగా ఇవ్వమని బాలరాజు విక్రం రెడ్డి తండ్రి లింగారెడ్డిని అడిగాడు.
అతను మా వద్ద లేవని చెప్పడంతో ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను మీ ఎక్స్ పార్టీ వారి వద్దకు వెళ్లి వారి తరఫున మాట్లాడి మీ భూమి మీకు రాకుండా మీ అంతు చూస్తా అని బెదిరించడంతో భయపడిన విక్రమ్ రెడ్డి కుటుంబ సభ్యులు బాలరాజుకు రూ. 23 లక్షలు అప్పుగా తీసుకొచ్చి ఇచ్చారు. కొన్ని రోజులకు లింగా రెడ్డి, బాలరాజు ను అతను ఇచ్చిన డబ్బులు ఇవ్వమని అడగడంతో రేపిస్తా, మాపిస్తా అంటూ కాలయాపన చేశాడు. లింగారెడ్డి డబ్బులు ఇవ్వకపోతే వదిలేలా లేరు అనుకోని ఎలాగైనా డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశ్యంతో బాలరాజు చిన్నమ్మ కొడుకైన నిడమనూర్ మండలం లోని ముకుందాపురం గ్రామానికి చెందిన దుంప సాయి కృష్ణ అలియాస్ సాయి ఇద్దరు కలిసి పథకం ప్రకారం ఒక రోజు లింగా రెడ్డి, అతని కొడుకు విక్రమ్ రెడ్డిని పిలిపించి వారితో “నీ కొడుకు విక్రమ్ రెడ్డిని చంపడం కోసం మీ ఎక్స్ పార్టీ సురేందర్ రెడ్డి నల్లగొండ కు చెందిన పెద్ద రౌడీ షీటర్ మెంటల్ రాజేశ్ అనే వ్యక్తికి రూ.40 లక్షలకు సుపారి ఇచ్చాడు” అని చెప్పి వారి ముందు, వారు నమ్మి భయపడాలనే ఉద్దేశ్యంతో బాలరాజు వాళ్ళ తమ్ముడైన సాయి కు ఫోన్ చేసి ముందుగా వేసుకున్న పదకం ప్రకారం కాల్ లో “అన్నా విక్రమ్ రెడ్డిని చంపమని సుఫారి ఇచ్చింది ఎవరు అని అడుగగా! అతను సురేందర్ రెడ్డి అని చెప్పాడు” ఆ మాట విన్న లింగా రెడ్డి ఇంకా ఎక్కువ భయపడి అతనితో చంపకుండా ఉండటం కోసం మీకు ఎంత కావాలని అడుగగా! సురేందర్ రెడ్డి నాకు రూ.40 లక్షలు ఇచ్చాడు.
కాబట్టి మిమ్మల్ని చంపకుండా ఉండటం కోసం ఇంకో రూ.20 లక్షలు అంటే మొత్తం రూ. 60 లక్షలు ఇస్తే వదిలేస్తా అని చెప్పడంతో నిజంగానే చంపుతాడేమో నన్న భయంతో వారికి ఉన్న భూమిలో 3 ఎకరాల నిమ్మతోట ని అమ్మి బాలరాజు కు పలు ధపాలుగా మొత్తం రూ. 63 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజులకు మెంటల్ రాజేశ్ అనే వ్యక్తి జైలులో ఉన్నాడని తెలుసుకున్న లింగా రెడ్డి, బాలరాజు వద్దకు వెళ్ళి అతను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడగడంతో “మెంటల్ రాజేశ్ జైలుకు పోతే ఇంకా ఎవరు లేరనుకుంటున్నారా? నాకు తెలిసిన రౌడీ షీటర్లు చాలా మంది ఉన్నారు. అవసరం అయితే నేనే మిమ్మల్ని చంపేస్తా అని బెదిరించాడు”. దీంతో నాలుగు రోజుల క్రితం సామ లింగారెడ్డి నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ముద్దం బాలరాజు తనను బెదిరించి, భయపెట్టి, మోసం చేసి డబ్బులు తీసుకున్న విషయం అంతా వివరించి చెప్పారు. తమపై కేసు నమోదు అయిందని భయపడిన బాలరాజు, సాయి కృష్ణ హైదరాబాద్ వెళ్తుండగా నకిరేకల్ పోలీసులు వారిని పట్టుబడి చేసి వారి నుండి రెండు సెల్ ఫోన్లు, మూడు కార్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. గతంలో కూడా నిందితుడు ముద్దం బాలరాజు ఒక కేసులో జైలుకు వెళ్ళాడు. నల్లగొండ డియస్పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును చేదించిన నకిరేకల్ సి. ఐ. వెంకటేష్, ఎస్ ఐ వీరబాబు, యస్.ఐ. క్రిష్ణాచారి, సిబ్బంది సురేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, జనార్ధన్, వెంకటేశ్వర్లు, నాగార్జున్ లను జిల్లా ఎస్పి అభినందించారు.


