– టీ షర్టులు ధరించి ప్రతిపక్షాల నినాదాలు
– ఎన్నికల ప్రక్రియ పారదర్శకతకు డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓట్ల చోరీ (ఓట్ల దొంగతనం)కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వినూత్న నిరసన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలోని మకర్ ద్వార్ వద్ద మంగళవారం ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం డిమాండ్ చేశారు. బీజేపీ పిరికిచర్య.. నియంతృత్వం.. మా గళాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల ఓటు హక్కు కోసం తాము పోరాడుతామని నినదించారు. ఇటీవల బీహార్‌లో విడుదలైన ఓటరు ముసాయిదా జాబితాలో మింతా దేవి(124) మహిళను గుర్తించడంపై టి షర్టులు ధరించి ఎంపీలు ఆందోళన చేపట్టారు. మింతా దేవి ఫొటో ఉన్న టీ షర్టులు, వాటిపై 124 నాటౌట్ అని రాసి ఉన్న వాటిని ధరించి నిరసనలో పాల్గొన్నారు. నినాదాల హౌరె త్తించారు. అంతేకాక ఈ అంశాన్ని సీరియస్‌గా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీ-షర్టులు కేవలం నిరసన సాధనాలు మాత్రమే కావని, ఈ సమస్య తీవ్రత గురించి చెప్పడమే తమ ఉద్దేశమని అన్నారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకే ఎంపీలు టిఆర్ బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, ఎన్‌సీపీ నేత సుప్రియా సులే, సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, అమ్రారామ్, రాధాకృష్ణన్, శివదాసన్, ఎస్. వెంకటేషన్, ఎఎ రహీమ్, సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్, ఎస్‌పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, జేఎంఎం ఎంపీ మహువా మాంఝీ, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి.
ఓట్ల చోరీకి బీజేపీ కుట్ర: రాహుల్ గాంధీ
గతేడాది కర్నాటక, మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ఓట్ల చోరీ చేసిన ఎన్నికల కమిషన్, ఈ ఏడాది చివరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి సన్నద్ధమవు తోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఇందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. ఒకటీ రెండు సీట్లలో కాకుండా చాలా సీట్లలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఇది ఒక క్రమపద్ధతిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇది తెలుసనీ, గతంలో దీనికి ఆధారాలు లేవనీ, ఇప్పుడు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతున్న తీరుపై గతంలో తమ దగ్గర రుజువులు లేవని, ఇప్పుడు రుజువులు ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణలో వెనకడుగు వేసే సమస్యే లేదని వ్యాఖ్యానించారు. ‘మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం. ఒక వ్యక్తి- ఒకే ఓటు అనే విధిని ఎన్నికల కమిషన్ పాటించడం లేదు. ఇక సినిమా చూపించడమే ఆలస్యం’ అని రాహుల్ చమత్కరించారు. ఒక మనిషి, ఒక ఓటు అనేది రాజ్యాంగానికి భూమిక అని రాహుల్ గాంధీ అన్నారు. ఒకరికి ఒక ఓటు అనే అంశాన్ని ఈసీ తుంగలో తొక్కిందని విమర్శించారు. ఈసీ తీరుతో రాజ్యాంగానికి విఘాతమని, తాము రాజ్యాంగాన్ని కాపాడుతూ వస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ఓట్ల చోరీపై వినూత్న నిరసన
- Advertisement -
- Advertisement -