Friday, July 18, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్భరోసా లేని కౌలు బతుకు

భరోసా లేని కౌలు బతుకు

- Advertisement -

రాష్ట్రంలో 36 శాతం కౌలు రైతులే..
ఏటేటా పెరుగుతున్న కౌలు ధరలు
పట్టాదారులకు మాత్రమే అందిన భరోసా సాయం
కౌలు రైతుల సంగతేంటి?
అమల్లో లేని 2011 కౌలు రైతుల చట్టం
గుర్తింపులేక పంటనూ అమ్ముకోలేని దైన్యం
గ్రామ సభల్లో కౌలు రైతుల్ని గుర్తించాలి : రైతు సంఘం

”భూమి చేతిలో ఉందన్న భరోసా లేదు. పండిన పంటంతా తనదే అన్న ధీమాలేదు. పంట సాగుకు పెట్టుబడులుండవు. బ్యాంకులో రుణమివ్వరు. ప్రయివేట్‌ అప్పులకు తనఖా పెట్టేందుకు భూమిపై హక్కులేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతింటే నష్టపరిహారం ఇవ్వరు. పండిన పంటను మార్కెట్‌లో కనీస మద్దతు ధరకు కొనరు”. ఇన్ని ఇబ్బందుల్లో కౌలు రైతులు నెట్టుకురావడం కష్టతరమే. వ్యవసాయం పట్ల మక్కువతో తరాలుగా కౌలు భూముల్ని నమ్ముకుని సాగుదారులుగా కొనసాగుతున్నారు. వారి సమస్యల పరిష్కారం, రక్షణ కోసం కొన్ని సంస్కరణలు, చట్టాలు వచ్చినా అవి పరిమితంగానే అమల్లోకి వచ్చాయి. రక్షిత కౌలుదారుల చట్టం తెచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్ట్టట్లేదు. రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పైసా సాయం అందలేదు. ఏటేటా కౌలు ధరలు పెరుగుతున్నాయి. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు కష్టాలు, కడగండ్లే మిగులుతున్నాయి.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో 70 లక్షల మంది భూమిపై పట్టాకలిగిన రైతులున్నారు. వీరిలో 69,39,548 మంది రైతులకు చెందిన సాగవుతున్న 1.46 కోట్ల ఎకరాల భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించింది. రూ.8744.13 కోట్లు పట్టాదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా జమ చేశారు. ఇంత మందికి ఎంతో ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని మాత్రం విస్మరించింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ ఇస్తున్న రైతు బంధుకు బదులుగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. పట్టాదారులకు, కౌలు రైతులకు ఎకరాలకు రూ.15 వేలు, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పింది. గత ప్రభుత్వం మాదిరే పట్టాదారులకే భరోసా ఇచ్చింది తప్ప, కౌలురైతులకు, కూలీలను పట్టించుకోలేదు.

36 శాతం కౌలు రైతులు.. అందని భరోసా
రాష్ట్రంలో 36 శాతం మంది కౌలు రైతులున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 70 లక్షల మంది రైతులుండగా అందులో 36 శాతం అంటే 25 లక్షల మంది కౌలుదారులే ఉన్నారు. అధికారపక్షం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా ఎకరాలకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందించాలి. కానీ.. కౌలు రైతుల్ని పట్టించుకోవట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయమంతా కౌలుదారుల చేతుల్లో నడుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 శాతానికి మించి భూముల్ని కౌలుదారులే సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2.67 లక్షల మంది రైతులుండగా వీరిలో 52 వేల మంది కౌలు రైతులే ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 3 లక్షల మంది రైతులు ఉండగా 72 వేల మంది కౌలు రైతులు, మెదక్‌ జిల్లాలో 56వేల మంది కౌలు రైతులున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 1.80 లక్షల మంది కౌలుదారులున్నట్లుగా రైతు సంఘాల గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా కూడా ప్రభుత్వం అందించే రైతు భరోసా వస్తుందని ఆశతో ఉన్నారు. ప్రభుత్వం 2024 రబీ సీజన్‌లో, 2025 ఖరీఫ్‌ సీజన్‌లో రైతు భరోసా ఇచ్చినప్పటికీ కౌలు రైతులకు మాత్రం ఇవ్వలేదు.

ఏటా పెరుగుతున్న కౌలు ధరలు
భూముల విలువలు పెరిగాక పట్టాదారుల్లో చాలా మంది వ్యవసాయానికి దూరమయ్యారు. పట్టణాలకు వలసెళ్లిపోవడంతో ఊర్లలో తమ భూముల్ని కౌలుకు సాగుకు ఇస్తున్నారు. గతంలో కౌలు కాగితం అగ్రిమెంట్‌ రాసుకునేది. కౌలు అగ్రిమెంట్‌ ఉంటే భూమిపై హక్కు కలుగుతుందనే అపోహ వల్ల మాట ఒప్పందంతోనే భూముల్ని కౌలుకిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో భూముల స్వభావం, పంటల సాగు, నీటి లభ్యతను బట్టి కౌలు ధరలు పెంచుతున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలో లాభసాటి పంటలైన కూరగాయలు, మిర్చి, ఆలుగడ్డ, చెరకు, ఉల్లి, అల్లంతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పప్పుధాన్యాలు సాగవుతాయి. మామిడి, సపోట, బొప్పాయి, ఇతర పండ్లు, పూల తోటలున్నాయి. మాగాణి పంటలకు రూ.15 వేల నుండి రూ20 వేలు, పత్తి, మొక్కజొన్నకు రూ.20వేల నుంచి రూ.25 వేలు, అల్లం, చెరకు, మిరప, కూరగాయల సాగు భూములకు రూ.25 వేల వరకు కౌలు ధరలున్నాయి. ఈ ఏడాది 2024 రబీ సీజన్‌లో కొందరు రైతులకు రైతు భరోసా డబ్బులు పడలేదు. దాంతో అట్టి రైతులు కౌలు ధరల్ని ఎకరాకు రూ.5 వేలు పెంచారు. కౌలు పెంచకపోతే భూమిని సాగు చేయొద్దని బెదిరిస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కౌలు రైతులు తప్పని సరిగా పెంచిన ధరలను చెల్లిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నా కౌలు చెల్లిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కౌలు డబ్బును అడ్వాన్‌గా ఇస్తారు.

రక్షిత కౌలుదారు చట్టం తేవాలి
కౌలుదారుల సమస్యలు పరిష్కరించి తగిన రక్షణ కల్పించాలని అన్ని రాష్ట్రాల్లోనూ చట్టాలు చేశారు. తెలంగాణలో 1950లో వచ్చిన వ్యవసాయ కౌలు చట్టం వారిని రక్షిత కౌలుదారుగా గుర్తించి హక్కులు కల్పించారు. ఆ తర్వాత ఆ చట్టం నీరుగారింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కౌలుదారుల రక్షణ కోసం జయతి ఘోష్‌ కమిటీ వేసింది. ఆ కమిటీ సాగుదారుల రక్షణ గురించి సూచనలు చేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వం 2011లో భూ ఆధీకృత సాగుదారుల చట్టం తెచ్చింది. ఈ చట్టం కౌలుదారులకు రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీ)లు జారీ చేయడంతో బ్యాంకుల్లో పంట రుణాలు పుట్టాయి. ఆ చట్టం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలుదారుల సమస్యల పరిష్కారం, రక్షణ నిమిత్తం అధ్యయనం చేసి ఒక చట్టాన్ని రూపొందించాలని తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.రాజయ్య డిమాండ్‌ చేశారు. గ్రామ సభల్లో కౌలు రైతుల్ని గుర్తించి రుణ అర్హత కార్డులు, రైతు భరోసా, పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

కౌలు రైతులను గుర్తించాలి : టి.సాగర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం
భూ ఆధీకృత సాగుదారుల చట్టం-2011 అమలు చేసి కౌలుదారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి. తద్వారా వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. ఈ చట్టం ప్రకారం ఎల్‌ఇసీ రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో 35శాతం సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకు ఎలాంటి సదుపాయాలూ అందట్లేదు. రుణార్హత కార్డులు జారీ చేయడం ద్వారా బ్యాంకుల్లో పంట రుణాలు పొందడమే కాకుండా రైతు బీమా, రైతు భరోసా, పంట నష్టపరిహారం వంటి పథకాలకు అవకాశం కలుగుతుంది. కౌలు రైతులను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. 2011 చట్టం ప్రకారం కౌలు రైతులందరినీ గ్రామసభల ద్వారా గుర్తించాలి. రైతులకు అందుతున్న అన్ని రకాల సదుపాయాలు, సబ్సిడీలు వారికి కూడా అందేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేలు చెల్లించాలి.

మద్దతు ధర లేదు
కౌలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌లో మద్దతు ధరకు అమ్ముకునే అవకాశంలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పట్టాదారు పాసుపుస్తకం ఉంటేనే కౌలుదారులు పండించిన పంటను కొనుగోలు చేస్తారు. చాలా మంది భూమి యజమానులు పాసుపుస్తకాలి వ్వట్లేదు. ఇచ్చినా ధాన్యం డబ్బులు భూ యజమాని బ్యాంకు ఖాతాల్లో జమ కావడం వల్ల కౌలుదారు చేతికి రావట్లేదు. పత్తిని అమ్ముకోవాలంటే వ్యవసాయ శాఖ ఆన్‌లైన్‌లో కౌలుదారునిగా గుర్తించాలి. ఆన్‌లైన్‌ చేయబడిన రైతుల నుంచి మాత్రమే మార్కెటింగ్‌ శాఖ ద్వారా సీసీఐ పత్తిని మద్దతు ధరకు కొంటుంది. ఇతర పంటలకు తిప్పలు తప్పవు. అందుకే కౌలు రైతులు పంటను దళారులకు తక్కువ ధరకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -