Sunday, September 21, 2025
E-PAPER
Homeహెల్త్నిద్రలేమి ఆరోగ్యానికి హానికారకం

నిద్రలేమి ఆరోగ్యానికి హానికారకం

- Advertisement -

సంస్కృతంలో, ‘నిద్ర’ అనే పదానికి అర్థం: ని, లేదు/ వద్దు; ద్ర, పరుగెత్తుట/ ఉపసంహరించుకోవుట.
నిద్ర అనేది దేహానికి సంపూర్ణ విశ్రాంత స్థితి. మనిషికి ఆరోగ్యపరంగా, పోషకభరిత ఆహారం, పరిశుద్ధమైన వాతావరణం, నీరు, గాలి, వ్యాయామం ఎంత అవసరమో, ఆహ్లాదకరమైన నిద్ర కూడా అంతే అవసరం.

శ్రమించిన శరీరం ఏ విధంగానైతే అలిసిపోతుందో, అదే విధంగా శరీరంలోని ఒక అవయవమైన మెదడు కూడా అలసిపోతుంది. మెదడు, శరీరం, రెండూ అలసిపోయినప్పుడు, వాటి అలసట తీర్చి, పునరుత్తేజం చేసే ప్రక్రియ నిద్ర.
కానీ ఇదొక్కటే కారణంగా పరిగణించలేం. నిద్రలో మెదడు పనిచేస్తూనే ఉంటుంది. శరీరం కూడా కొంత మేరకు జాగరూకంగానే ఉంటుంది. ఎంత గాఢ నిద్రలో ఉన్నా, పరిమిత శారీరిక కదలికలు ఉంటాయి. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. బాహ్య ప్రేరణలతో లేస్తాం, కదులుతాం, మాట్లాడతాం కూడా!
అధ్యయనాల ప్రకారం మనం నిద్రపోయినప్పుడు, మెదడు తను పనిచేసే తీరు మొత్తం మార్చేసుకుంటుంది. నిద్రలో ఉన్నంతసేపూ మెదడు, శరీరంలోని అలసటను మాయం చేయడానికి, కణాల్లో నిండిన వ్యర్థాలని తొలగించి, శుభ్ర పరచడానికి పాటుపడుతుంది. నిద్రనుండి మేల్కొనేసరికి కణాలన్నీ వ్యర్థరహితమయ్యి, కొత్త శక్తిని పుంజుకొని, కొత్త రోజుకు సిద్ధంగా తయారౌతాయి.
నిద్రా సమయాన్ని శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలూ జీవశక్తిని పుంజుకోవడానికి ఉపయోగించుకుంటాయి. నిద్రలేమివలన ఈ ప్రక్రియ దెబ్బతింటుంది.

ఎంత నిద్ర అవసరం?
పడుకొని కళ్ళు మూసుకోవడం నిద్రకుపక్రమణే తప్ప అసలు నిద్ర కాదు. నిజానికి, అలా ఉపక్రమించిన తరువాత నిద్ర లోకి ఎప్పుడు జారుకుంటామో మనకు తెలియదు. ఎంతసేపు గాఢంగా నిద్రపోయామూ, ఎంత సేద తీరామూ అనేవి ఆరోగ్యమైన నిద్రకు కొలమానాలు.
నిద్రా కొలమానాల పరిధులు చాలా వ్యక్తిగతంగా ఉంటాయి. కొందరికి, కొంత పనికే, సేదతీరడానికి ఎక్కువ నిద్ర అవసరం పడవచ్చు. పరిధుల్లో ఆడా, మగా, చిన్న, పెద్ద తారతమ్యాలు కూడా ఉంటాయి. సామాన్యంగా, మాములుగా పనిచేసే, ఆరోగ్యంగా, యుక్తవయసులోఉన్న వ్యక్తులకి రోజువారీ ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర సేదతీర్చేలా ఉంటుంది. అదే పనికి, అటువంటి నిద్రే, అరవై ఏళ్ళ వయసు మీరిన వారికి సరిపోక పోవచ్చు.

ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరమన్నది వ్యక్తిగతమైన విషయం. ఎన్ని గంటలు పడుకోవడం జరుగుతుంది అన్నది కాకుండా, నిద్రాభంగం కాకుండా, నిరంతరాయంగా, ఎన్ని గంటలు నిద్రించడం జరుగుతున్నదనేదే ఆరోగ్యపరంగా ముఖ్యమైన అంశం. అదే ఆహ్లాదకరమైన నిద్ర.
సాధారణంగా నెలలోపు చంటిపిల్లలు కూడా రోజులో దాదాపుగా మూడువంతులు నిద్రలోనే గడుపుతారు. నవజాత శిశువులు ప్రతి రెండు మూడు గంటలకొకసారి పాల కోసం మేల్కొని, తాగుతూనే నిద్రపోతారు. అలా మూడు నెలల వరకు కూడా జరుగవచ్చు. ఆ తరువాత మెల్లగా పది నుండి పన్నెండు గంటలు నిద్ర సరిపోతుంది. బడికి వెళ్లే పిల్లలు కూడా అంత సమయమూ నిద్రపోవాల్సిన అవసరం ఉండవచ్చు. పెద్దవారిలో ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది. కొందరికి నాలుగు గంటలే సరిపోతుంది.
స్త్రీలకు, వారి శరీర పనితీరు పరంగా, మగవారి కన్నా కొంత ఎక్కువ నిద్ర అవసరమౌతుంది.

నిద్రలో శరీరం, మెదడు రెండూ చైతన్యవంతమౌతాయా?
ఔననే అధ్యయనాలు చెప్తున్నాయి. నిద్ర, హార్మోనల్‌, ఇతర శారీరిక జీవక్రియలతో సంక్లిష్టంగా అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి, సేద తీర్చే నిద్ర, అంతర్గత జీవక్రియలను, సమతుల్యంగా, స్థిరంగా, సమర్థవంతంగా నిర్వహించే విధంగా శరీరానికి దోహదపడుతుంది.
నిద్రలేమి/ కలత నిద్ర అని ఎప్పుడు అంటారు? వాటివల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు?
పడుకొన్న తరువాత ఎంత ప్రయత్నించినా కొన్ని గంటల వరకు నిద్ర రాకపోవడం, వచ్చినా కొద్దిపాటి అవాంతరానికే నిద్రాభంగమైపోవడం, ఎప్పుడో ఒకసారి కాకుండా, తరుచుగా లేదా రోజువారీ జరుగుతుందంటే అంతర్గత సమస్యలున్నట్టే, సామాన్యంగా మానసిక ఒత్తిడులు కారణం కావచ్చు. కారకాలను స్వయంగా తెలుసుకోలేని పరిస్థితిలో వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
నిద్రలేమి/ కలత నిద్ర వలన మరుసటి రోజంతా నీరసంగా, నిరుత్సాహంగా, నిస్సత్తువగా ఉండి, ఏ పనీ సరిగా చేయలేక పోవడమూ, తలనొప్పి, చికాకు, ఆకలి లేకపోవటమూ, లేదా ఎక్కువగా తినేయడమూ వంటి అనారోగ్య పరిస్థితులు కలుగుతాయి. ఈ విధంగా ప్రతిరోజూ సాగితే, కొంత కాలంలోనే, దీర్ఘకాల, జీవనశైలి సంబంధిత వ్యాధులకు నాందీ జరుగవచ్చు.
నిద్రలో ఇతర సమస్యలు?
శ్వాస ప్రక్రియకు అంతరాయం కలిగి, ఊపిరి తరుచుగా ఆగి, పుంజుకోవడం వంటివి ఆంగ్లంలో స్లీప్‌ అప్నియా అంటారు. కొందరిలో ఊబకాయం, పొగ తాగటం, అతిగా ఆల్కహాల్‌ సేవించడం వంటి పలు కారణాలవల్ల జరగవచ్చు. దీనితో గురక, కలత నిద్ర, నిద్ర లేమి, గుండె జబ్బులు రావచ్చు.

ఆహ్లాదకరమైన నిద్ర కొరకు ఏమి చేయాలి?
ఆరోగ్యపరంగా, క్రమం తప్పకుండ, ఎవరికి ఎంత నిద్ర అవసరమౌతుందో అంత నిద్రకు సమయం కేటాయించాలి.
ప్రతిరోజు వీలయితే రాత్రిపూట, ఉద్యోగరీత్యా పగలు, నిద్రపోవాల్సిన గంటలని క్రమబద్దీకరించుకోవాలి. తప్పనిసరిగా నిద్రే పోవాలి. ఆ సమయాన్ని స్క్రీన్‌ టైంగా దుర్వినియోగం చేయరాదు.
అలాగే వారమంతా రోజూ రెండుగంటలు మాత్రమే నిద్రపోయి, వారాంతరంలో ఇరవై గంటలు నిద్రకుపక్రమించడం, కాలక్రమేణా అనారోగ్యానికి, మధుమేహం వంటి జీవన శైలి సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని అధ్యయనాల్లో తేల్చిచెప్పారు.
అవసరానికి మించిన నిద్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచక పోగా, అలసత్వాన్ని పెంచి, బుద్ధి మాంద్యానికి కారకం అవుతుంది.
కచ్చితమైన నిద్రా ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి నిద్రపోవాలి, మేల్కోవాలి. అలా శరీరంలోని నిద్రని సహజమైన ఇరవై నాలుగు గంటల గడియారం (సిర్కాడియన్‌ రిథమ్‌) నియంత్రించబడుతుంది.

ప్రతి రోజూ శారీరిక వ్యాయామం, వీలయితే, పచ్చని చెట్ల మధ్య, ప్రకతికి దగ్గరగా, సూర్యోదయ వేళలో, యోగ, ధ్యానంతో పాటుగా చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మధ్యాహ్నం కొంత సమయం నిద్రకి కాకుండా విశ్రాంతికి మాత్రమే కేటాయించండి.
నిద్రకుపక్రమించే ముందు భారీ భోజనం, కాఫీ, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు.
ఇష్టమైన సంగీతం మంద్రస్థాయిలో స్వీయ జోల పాట అనిపించేలా వింటూనో, టేబుల్‌ లాంప్‌ మంద్రస్థాయి వెలుతురులో నచ్చిన పుస్తకం చదువుకుంటూనో, నిద్ర గది వాతావరణం ప్రశాంతంగా, నిద్రపోవడానికి సానుకూలంగా చేసుకోవాలి.
మనసుకు నచ్చినవి చేస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఆహ్లాదకరమైన నిద్ర మనలను తప్పక సేద తీరుస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది.
అలాకాని పరిస్థితుల్లో నిపుణుల సంప్రదింపు అవసరమౌతుంది.

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ /ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -