షేర్‌వాల్ టెక్నాలజీతో నాణ్యమైన గృహాలు – హౌసింగ్ ఎండీ విపి గౌతమ్
నవతెలంగాణ-సదాశివపేట
సదాశివపేట మండలం ఆరూరు గ్రామపంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ మంగళవారం పరిశీలించారు. షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఇంటింటికీ తిరిగి పరిశీలించిన ఆయన, ప్రభుత్వం నిర్దేశించిన ఐదు లక్షల రూపాయల వ్యయంలోనే నాణ్యమైన గృహాలను పూర్తిచేయడం అభినందనీయమని అన్నారు. ఈ విధానంతో నిరుపేదలకు సురక్షితమైన, దీర్ఘకాలిక గృహాలు అందించవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ ఎండీ గ్రామ ప్రజలకు సూచించారు. నిర్మాణ నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదని, అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి నాయికోటి లావణ్య–మధు మాట్లాడుతూ, ఆరూరు గ్రామానికి హౌసింగ్ ఎండీ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఆయన ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను విజయవంతంగా నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీడీ చలపతిరావు, ఆర్డీవో జనార్దన్, ఎంపీడీవో కె.లక్ష్మి, ఎమ్మార్వో బాలరాజ్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, డీఈ మాధవరెడ్డి, ఏఈ (హౌసింగ్) రేష్మ, పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ విట్టల్, మాజీ సర్పంచ్ మధు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



