తొలి తెలుగు పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు పైడి జయరాజ్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా.. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన 116వ జయంతి నేడు (ఆదివారం).
1909లో తెలంగాణలోని సిరిసిల్లలో జన్మించారు పైడి జయరాజ్. హైదరాబాద్‌లోని నిజామ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే ఆయనకు నాటక, సినిమా రంగాలపై మక్కువ ఏర్పడింది. ఈ మక్కువతోనే 1929లో ఆయన ముంబయి చేరుకున్నారు. ఎన్నో ప్రయత్నాల అనంతరం తొలిసారి ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే మూకీ చిత్రంలో నటించారు. ఆ తరువాత ‘ట్రయాంగిల్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతీ’, ‘ఫ్టైట్ ఇన్‌టు డెత్’, ‘మై హీరో’ వంటి దాదాపు 11 మూకీ చిత్రాల్లో నటించి, అలరించారు.
అమర్‌సింగ్‌రాథోర్, పృధ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి అత్యద్బుతమైన గొప్ప వ్యక్తుల పాత్రలలో ఒదిగిపోయి, శభాష్ అనిపించుకున్నారు. అలాగే షార్జహాన్, టిప్పు సుత్తాన్, హైదర్ ఆలీ వంటి రాజుల పాత్రలతో కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీతో ప్రేక్షకులను మైమరపించారు. ‘పాపాజీ’గా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు కూడా.
తెలుగు, హిందీ, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ, ఇంగ్లీషు తదితర భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. జాతీయ చలనచిత్ర సీమను కొన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన గొప్ప నటుడుగా పేరొందారు. అలాగే ‘ప్రతిమ’, ‘సాగర్’, ‘మెహర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, అభిరుచిగల దర్శకుడిగానూ గుర్తింపు సొంతం చేసుకున్నారు.
సినిమాల్లో నటించాలన్న తన కలను సాధించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని గెలిచిన జైరాజ్ జీవితం నేటి తరానికీ స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వం డాక్యుమెంటరీగా రూపొందించింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా పైడి జయరాజ్ ఘనత సాధించారు.
నేటి తరానికీ స్ఫూర్తిదాయకం..
- Advertisement -
- Advertisement -