ఎస్‌కేఎం పిలుపు
నతవెలంగాణబ్యూరో-హైదరాబాద్
అమరవీరులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల స్పూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్యపద్మ, బి.రాము, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ ఆ సంఘం కార్యాలయంలో భగత్‌సింగ్ వర్ధంతి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంతోపాటు నాలుగు లేబర్ కోడ్స్‌ను, ఇతర రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇరాన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి పాల్పడుతున్న ట్రంప్, నెతన్యాహులను ‘యుద్ధ నేరస్థులు’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు, సార్వభౌమ దేశమైన ఇరాన్‌పై దాడి చేసినందుకు వారిపై విచారణ జరిగేలా చూడాలని కోరారు. అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం లొంగిపోవడాన్ని నిరసిస్తూ…ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని రైతులు, మేధావులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మూడ్‌శోభన్, జ్వాలా వెంకటేశ్వర్లు, హాజీ మలంగ్, కాశీం తదితరులు పాల్గొన్నారు.



