Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసర్వేపల్లి స్ఫూర్తితో.. విద్యారంగం అభివృద్ధిపై సర్కార్‌ దృష్టి

సర్వేపల్లి స్ఫూర్తితో.. విద్యారంగం అభివృద్ధిపై సర్కార్‌ దృష్టి

- Advertisement -

నియామకాలు… పదోన్నతులతో గురువులకు పెద్దపీట…
-పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రత్యేక దృష్టి
-ఆ శాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తరగతి గదిలో దేశ భవిష్యత్‌ రూపుదిద్దుకుంటుందని విద్యావేత్త కొఠారి వ్యాఖ్యానించారు. అలాంటి తరగతి గదిని సజీవంగా ఉంచేది… దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే…అలాంటి ఉపాధ్యాయులకు తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి నాయత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతోందని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రపతిగా.. ఉప రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ తనను తాను ఉపాధ్యాయునిగా చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారంటే ఉపాధ్యాయులకు ఉన్న గౌరవం ఎంత విలువైనదో అర్ధం చేసుకోవచ్చు.. అందుకే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ జయంతిని గురు పూజోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. గురు పూజోత్సవం సందర్భంగా విద్యా వ్యవస్థకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం పట్టం కడుతున్న తీరుని ఆ ప్రకటనలో విశ్లేషించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలంటే పాఠశాలల్లో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు, కళాశాల్లలో లెక్చరర్లు ఉండాలి. ఈ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 10, 006 మంది ఉపాధ్యాయులను, జూనియర్‌ కళాశాలల్లో 1,265 మంది జూనియర్‌ లెక్చరర్లు, 64 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 30 మంది లైబ్రేరియన్ల నియామకాన్ని చేపట్టింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 19,717 మంది ఉపాధ్యాయులకు 2024లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా 46,555 మంది ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం పూర్తి చేసింది. 2025 ఆగస్టులో 4,454 మంది ఉపాధ్యాయులకు ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లు, గ్రేడ్‌-2 హెడ్‌మాస్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది. 55 మంది జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా, 22 మంది జూనియర్‌ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోషన్లు కల్పించింది. ప్రమోషన్లు, బదిలీలతో ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో బోధన చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. నాణ్యమైన బోధనకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 1,13,942 ఉపాధ్యాయులు, 5,605 రిసోర్స్‌ పర్సన్లకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులను ప్రభుత్వం నిర్వహిం చింది. ఉపాధ్యాయుల నియామకం, హేతుబద్దమైన బదిలీల విధానంతో ఈ ఏడాది 41 నూతన పాఠశాలలను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో 1565 మంది విద్యార్థులు చేరారు. ఉపాధ్యా యుల నియామకానికి సంబంధించిన డీఎస్సీ రాయాలంటే తొలుత ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్‌) అర్హత సాధించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి 2014 వరకు నాలుగుసార్లు టెట్‌ నిర్వహించగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే టెట్‌ నిర్వహించింది. 2018 నుంచి 2021వరకు వరుసగా నాలుగేళ్లు టెట్‌ ను గత ప్రభుత్వం నిర్వహించలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ సమయంలో టెట్‌ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో వెంటనే టెట్‌ నిర్వహించాలని ఆదేశించారు. 2024 మే, జూన్‌ నెలల్లో టెట్‌ నిర్వహించగా రెండు పేపర్లకు కలిపి 2,36,487 మంది రాశారు. 2024 డిసెంబరు, 2025 జూన్‌ నెలలోనూ టెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇది ఉపాధ్యాయ బోధన విద్య పూర్తి చేసిన వారికి ఎంతో ఊరట కలిగించే అంశం.
నాణ్యమైన బోధన…
పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందడంతో వసతులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అధిక నిధులను కేటాయించింది. 2023-24 బడ్జెట్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యా రంగానికి రూ.19,093 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో గత బడ్జెట్‌ కన్నా రూ.2 వేల కోట్లు అధికంగా రూ.21,292 కోట్లు కేటాయించింది. 2025-26 బడ్జెట్‌లో విద్యా శాఖకు రూ.23,108 కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్‌లో ఇది సుమారు 8 శాతం.
అమ్మ ఆదర్శ కమిటీలు…
పాఠశాలల్లో పని చేసే విద్యార్థుల తల్లులతో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో తలుపులు, కిటీకీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్‌ స్విచ్‌లు, బ్లాక్‌ బోర్డుల ఏర్పాటు, మరుగుదొడ్లతోపాటు ఇతర మరమ్మతులు, గదులకు రంగులు వేయడం వంటి పనులను ఎండా కాలం సెలవుల్లోనే పూర్తి చేశారు. ఇందుకు రూ.676 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది.
పుస్తకాల పంపిణీ…
గతంలో ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా బోధనకు సిద్దమైనా, విద్యార్థుల దగ్గర పాఠ్య పుస్తకాలు ఉండేవి కావు.. కానీ 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభించింది. వీటితోపాటు యూనిఫాంల పంపిణీని పాఠశాలలు తెరిచిన నెల రోజుల్లేనే పూర్తి చేసింది. దాంతో రాష్ట్రంలో విద్యా రంగం గాడిన పడింది. పదో తరగతి పరీక్షల్లోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2025-26 విద్యా సంవత్సరంలోనూ పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ సకాలంలో పూర్తయింది.
డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీల పెంపు…
సరైన ఆహారం లభించినప్పుడే విద్యార్థులు చదువులపైన దష్టి కేంద్రీకరించగలరు..ఆ అవసరాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచింది. మూడో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రూ.950గా ఉన్న డైట్‌ ఛార్జీలను రూ.1,330కి, 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల డైట్‌ ఛార్జీలను రూ.1,100 నుంచి రూ.1,540, ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ వరకు విద్యార్థులకు రూ.1,500గా ఉన్న డైట్‌ ఛార్జీలను రూ.2,100కి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు గతంలో కాస్మోటిక్‌ ఛార్జీలు రూ.55 ఉండగా వాటిని రూ.175, 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు రూ.75గా ఉన్న కాస్మోటిక్‌ ఛార్జీలను రూ.275కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇది రాష్ట్రంలో హాస్టళ్లలో ఉన్న 7,65,700 మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించింది.
మరోవైపు కులమతబేధాలు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతి నియోజకవర్గంలో ఒక బాలుర, ఒక బాలికల యంగ్‌ రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌ నిర్మించనున్నారు. ఈ స్కూల్స్‌కు సంబంధించి ఇప్పటికే డిజైన్ల రూపకల్పన పూర్తయింది. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తికానుంది. విశాలమైన తరగతి గదులు, హాస్టల్‌ గదులు, టీచర్లకు స్కూల్స్‌ ప్రాంగణంలోనే వసతి, విశాలమైన క్రీడా మైదానాలు, లైబ్రరీ, కిచెన్‌ అన్ని రకాల వసతులు ఈ పాఠశాలల్లో ఉంటాయి. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం 120 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్‌ కు అప్‌గ్రేడ్‌ చేసింది. సాంకేతిక విద్యా రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం.. వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగుతోంది. దశాబ్దాలుగా పురాతన కోర్సులతో ప్రాభవం కోల్పోయిన ఐటీఐలను అప్‌ గ్రేడ్‌ చేస్తోంది.
విద్యా కమిషన్‌…
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళీ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులకు నైపుణ్యాల కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది.

ఐటీఐల అప్‌గ్రేడ్‌…
ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అప్‌గ్రేడెషన్‌కు టీటీఎల్‌ రూ.2,016.25 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.307.96 కోట్లు వ్యయం చేస్తాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ప్రభుత్వం వైస్‌ ఛాన్సలర్లను నియమించింది. మహిళా విద్యాపైన సీఎం రేవంత్‌ ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలో మహిళా విశ్వ విద్యాలయం ఉండాలనే ఉద్దేశంతో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ యూన్సివర్సిటీకి వైస్‌ ఛాన్సలర్‌ను నియమించారు. భవన నిర్మాణల డిజైన్‌ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad