భారీగా క్లెయిముల తిరస్కరణలు, కోతలు
జీరో జీఎస్టీ పైపూత మందు మాత్రమే
పాలసీలపై అవగాహన కొరవడిన వినియోగదారులు
మాయ మాటలతో మోసం చేస్తున్న సిబ్బంది
ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది పాలసీదారులకు ఊరట కలిగించి ఉండవచ్చు. అయితే జీఎస్టీ సంస్కరణలు అభినందనీయమే అయినప్పటికీ దేశీయ బీమారంగం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని నివారించేందుకు అవి కేవలం పైపూత మందుగానే ఉపయోగపడతాయి. దేశంలోని బీమా కంపెనీల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో అనేక చేదునిజాలు బయటపడ్డాయి.
న్యూఢిల్లీ : దేశ ప్రజల బతుకులు కాస్త…జీఎస్టీ ముందు..శ్లాబులు తగ్గించాక అన్న పరిస్థితి మారింది. రెండు శ్లాబులతో మోడీ సర్కార్ పండుగ ఆఫర్‌లా పెట్టి నిలువుదోపిడీకి పాల్పడుతు న్నట్టు..బీమా కంపెనీల తీరు చూస్తే ఇట్టే అర్థమ వుతుంది.కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ తన 2023-24 వార్షిక నివేదికలో మూడు పేరొందిన బీమా కంపెనీల గుట్టును రట్టు చేసింది. ఈ కంపెనీలపై అంబుడ్స్‌మన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. బీమా కంపెనీలు తమ పాలసీదారుల జీవితాలతో ఎలా ఆడుకుంటు న్నాయో ఆ నివేదిక బయటపెట్టింది. ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కంపెనీలలో స్టార్ హెల్త్‌ది మొదటి స్థానం. దీనిపై ఏకంగా 13,308 ఫిర్యాదులు అందాయి. అంటే రోజుకు సగటున 36 ఫిర్యాదుల కంటే ఎక్కువే వచ్చాయన్న మాట.
వీటిలో 10,196 ఫిర్యాదులు కేవలం క్లెయిముల తిరస్కరణ లేదా వాటిలో కోతకు సంబంధించినవే. ప్రీమియంలను సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అనేక మంది పాలసీదారుల క్లెయిములను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. లేదా ఆ మొత్తంలో భారీగా కోత పెడుతున్నారు. ఇక 3,718 ఫిర్యాదులతో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానం నివా బూపాది. దీనిపై 2,511 ఫిర్యాదులు వచ్చాయి. ప్రయివేటు రంగంలోని బీమా కంపెనీల వ్యవహార శైలే ఇలా ఉంటే తామేమీ తక్కువ తినలేదని ప్రభుత్వ రంగంలోని నేషనల్ ఇన్సూరెన్స్ (2,196), న్యూ ఇండియా అస్యూరెన్స్ (1,602) నిరూపిస్తున్నాయి.
కేర్ హెల్త్ ఏమంటోంది?
ఫిర్యాదులపై ఇండియా టుడే పత్రిక ప్రయివేటు బీమా కంపెనీల వివరణ కోరగా కేవలం కేర్ హెల్త్ మాత్రమే స్పందించింది. క్లెయిముల పరిష్కారం విషయంలో కంపెనీ అనుసరిస్తున్న వైఖరిని చీఫ్ ఆపరేటింగ్ అధికారి మనీష్ దొడేగా సమర్థించుకున్నారు. అనేక ఫిర్యాదులు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని ఆయన తెలిపారు. పాలసీ నియమ నిబంధనలకు లోబడే క్లెయిములను తిరస్కరించడం లేదా క్లెయిమ్ మొత్తంలో కోత పెట్టడం జరుగుతోందని చెప్పారు. పాలసీదారుల సమస్యల పరిష్కారానికి అథారిటీ (ఐఆర్‌డీఏఐ) ఓ సంస్థాగత యంత్రాంగాన్ని రూపొందించిందని అన్నారు.
ఆరోగ్య బీమా ఫిర్యాదులే అధికం
భారత బీమా రంగంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఐఆర్‌డీఏఐ తాజా నివేదిక ప్రకారం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అథారిటీకి చెందిన బీమా భరోసా, ఐజీఎంఎస్ వేదికలపై 2,15,569 ఫిర్యాదులు దాఖలయ్యాయి. మరోవైపు ఈ కాలంలో బీమా అంబుడ్స్‌మన్‌కు 52,575 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 31,490 ఫిర్యాదులు కేవలం ఆరోగ్య బీమాకు సంబంధించినవే. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ తరహా ఫిర్యాదులు 21.7శాతం పెరిగాయి. ఫిర్యాదులు ఏ విషయంలో దాఖలయ్యాయో తెలిస్తే షాక్‌కు గురికావాల్సిందే. ఆరోగ్య బీమా ఫిర్యాదుల్లో సుమారు 95శాతం క్లెయిముల తిరస్కరణకు సంబంధించినవే కావడం గమనార్హం. బీమా పాలసీలు తీసుకునే వారికి సంబంధిత కంపెనీల సిబ్బంది అన్ని వివరాలు చెప్పడం లేదు. పాలసీని అంటకట్టే ఉద్దేశంతో అసత్యాలు చెబుతారు. ఒక్కోసారి కస్టమర్ అవసరాలను తీర్చని పాలసీలను కొనిపిస్తారు. దీనివల్ల నష్టపోయేది ప్రజలే. అన్ని రకాల జీవిత బీమా ఫిర్యాదుల్లో 59 శాతం ఈ తరహా పాలసీలకు చెందినవే. ఆరోగ్య బీమా విభాగంలో ప్రయివేటు కంపెనీలపై 26,064 ఫిర్యాదులు రాగా ప్రభుత్వ కంపెనీలపై 5,298 మాత్రమే వచ్చాయి.
సిబ్బంది ఉచ్చులో పడి…
బీమా కంపెనీల వైఖరి కారణంగా పాలసీదారులపై పడుతున్న ఆర్థిక భారం ఆందోళన కలిగిస్తోంది. 2023-24లో రూ.26,000 కోట్ల ఆరోగ్య బీమా క్లెయిములు తిరస్కరణకు గురయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. ఆ సంవత్సరం అంబుడ్స్‌మన్ ఆదేశాల మేరకు బీమా కంపెనీలు రూ.250 కోట్ల నష్టపరిహారం మాత్రమే చెల్లించాయి. దీనినిబట్టి చూస్తే పాలసీదారులు పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయారని అర్థమవుతుంది. పాలసీ తీసుకోవాలన్న తొందరలో వినియోగదారులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి వారి ఉచ్చులో పడుతున్న సందర్భాలు అనేకం. పాలసీలపై వినియోగదారులకూ పూర్తిగా, వాస్తవ సమాచారంతో అవగాహన కల్పించే సిబ్బంది చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు.
ఇలా పాలసీలను అంటకట్టడం సహా మోసపూరిత వ్యాపార కార్యకలాపాలకు పాల్పడిన ఉదంతాలపై 26,107 జీవిత బీమా ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 23,129 ఫిర్యాదులు ప్రయివేటు కంపెనీలపై వచ్చినవే. బీమా పాలసీలను అంటకట్టే ఏజెంట్లకు కంపెనీలు భారీగానే కమిషన్ ముట్టచెబుతాయి. కొన్ని కంపెనీలు ప్రోత్సాహకాలు ఇస్తాయి. దీంతో సీనియర్ అధికారులు మొదలుకొని జూనియర్ అధికారులు, ఏజెంట్ల వరకూ పాలసీల వేటలో పడతారు. వినియోగదారుల అవసరాలను వారు ఏ మాత్రం పట్టించుకోరు. అవసరం లేకపోయినా బీమా పాలసీని అంటకడుతుంటారు. వినియోగదారులు మొదటి సంవత్సరంలో చెల్లించే ప్రీమియంలో 65 శాతం వరకూ వీరికి కమిషన్ రూపంలో అందుతుంది. కంపెనీలు లక్ష్యాలను నిర్దేశిస్తుండడంతో వాటిని చేరుకునేందుకు సిబ్బంది అనైతిక చర్యలకు పాల్పడుతుంటారు. లక్ష్యాలను చేరుకోలేకపోతే ఉపాధి పోతుందన్న భయం వారిని వెంటాడుతుంటుంది.
బ్యాంకులు సైతం…
బీమా కంపెనీలకు బ్యాంకులు ఏమీ తీసిపోవడం లేదు. బీమా ఏజెంట్లతో పోలిస్తే వినియోగదారులు ఎక్కువగా బ్యాంకులను నమ్ముతారు. దీంతో అక్కడి సిబ్బంది వారికి సరిపడని పాలసీలను అంటకట్టడానికి ప్రయత్నిస్తుంటారు. దేశంలోని పదిహేను ప్రధాన బ్యాంకులు బీమా పాలసీల అమ్మకాల నిమిత్తం రూ.21,773 కోట్లు చెల్లించాయంటే పరిస్థితి అర్థమవుతుంది. వినియోగ దారుల అవసరాలతో నిమిత్తం లేకుండా బీమా ఉత్పత్తులను అమ్మడానికే సిబ్బంది ప్రాధాన్యత ఇస్తారు.
ఇది తొలి అడుగే
నగదు రహిత సెటిల్మెంట్ల విషయంలో పాలసీదారులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. వారి క్లెయిములు తిరస్కరణకు గురికావడమో, పాక్షికంగా అంగీకారం పొందడమో లేదా పరిష్కారానికి సుదీర్ఘ కాలం పట్టడమో జరుగుతోంది. గంటలోగా క్లెయిములు పరిష్కరించాలని ఐఆర్‌డీఏఐ నిర్దేశించినప్పటికీ 6-48 గంటలు పడుతోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయానికి కేవలం 8 శాతం క్లెయిములు మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. 2022-23లో 15,088 జీవిత బీమా క్లెయిములు తిరస్కరణకు గురయ్యాయి. వీటి విలువ రూ.1,026 కోట్లు. బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం మంచి విషయమే అయినప్పటికీ పారదర్శకత, క్లెయిముల పరిష్కారం, పాలసీలను నిజాయితీతో విక్రయించడం వంటి మౌలిక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీమా ప్రీమియంలపై జీరో జీఎస్టీ దీర్ఘకాల ప్రయాణంలో తొలి అడుగు మాత్రమే.