మన పిల్లలు ప్రపంచంతో పోటీపడాలన్నదే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-వైరా
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక గేమ్ చేంజర్ అని, ఈ స్కూళ్లలో చదివే పిల్లలు ప్రపంచంతో పోటీపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఖమ్మం జిల్లా వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం శంకుస్థాపన చేశారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ స్కూళ్లలో ఉపాధ్యాయులు కూడా ఇక్కడే నివాసం ఉండేలా క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుందన్నారు.
వైరాలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి ఇప్పటికే రూ.30 కోట్లను కలెక్టర్ ఖాతాకు జమ చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ, కాస్మోటిక్ ఛార్జీలను పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 40 శాతం మెనూ, 200 శాతం కాస్మోటిక్స్ ఛార్జీలను పెంచిందని అన్నారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ప్రభుత్వం కృతనిశ్ఛయానికి వచ్చి ఈ స్కూళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరెలను ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎన్‌పీడీసీపీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, సీపీ సునీల్ దత్, జిల్లా విద్యా శాఖాధికారి చైతన్య జైన్ తదితరులు పాల్గొన్నారు.



