Friday, July 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలువేల్పూర్ లో తీవ్ర ఉద్రిక్తత..

వేల్పూర్ లో తీవ్ర ఉద్రిక్తత..

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్​ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన కాంగ్రెస్​ కనువిప్పు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కనువిప్పు పేరుతో కాంగ్రెస్.. చలో వేల్పూర్ పేరుతో బిఆర్ఎస్ కాలు దువ్వడంతో ఇరు పార్టీలు ఇచ్చిన చలో వేల్పూర్ కార్యక్రమంతో  ఉదయం నుండి మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరుపాటిల పిలుపు నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.వేల్పూర్​లో ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డికి కాంగ్రెస్​ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తానంటూ బయల్దేరేందుకు సిద్ధమైన మానాల మోహన్​ రెడ్డిని పోలీసులు జిల్లా కేంద్రంలో హౌస్​ అరెస్ట్ చేశారు.

అదేవిధంగా నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పలువురిని హౌస్ అరెస్ట్ లో ఉంచారు. అయినప్పటికీ వేల్పురుకు తరలివచ్చిన వారిని దొరికిన వారిని దొరికినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఎమ్మెల్యే ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని వాహనాల్లో తరలిస్తుండగా మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు స్వరూప అడ్డుపడడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి పైకి రావడంతో అక్కడే ఉన్న బిఆర్ఎస్ నాయకులు అతనిపై దాడికి దిగారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి నంగి దేవేందర్ రెడ్డిని అక్కడినుండి బయటకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.వేల్పూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు వచ్చిన ఆర్మూర్ ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, ఆర్ఎస్ నాయకులు అక్కడినుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. మీడియాతో వేరువేరుగా మాట్లాడిన బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
వేల్పూర్​లో పరిస్థితి చేయిదాటకుండా…
వేల్పూర్​లో పరిస్థితి చేయిదాటకుండా ఉందేందుకు సీపీ సాయిచైతన్య  ముందస్తు చర్యలు తీసుకున్నారు. ముందుగానే మండలంలో 163 బీఎన్ఎస్ యాక్ట్​ అమలుకు ఆదేశించారు. అయితే పలువురు కాంగ్రెస్​ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకుని పోలీసులు పోలీస్​స్టేషన్​కు తరలించారు.
గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మెల్యే ఇంట్లోకి
ఉద్రిక్తత నడుమ జిల్లా గల్ఫ్​ సంక్షేమ సంఘం నాయకుడు, కాంగ్రెస్​ ప్రతినిధి నంగి దేవేందర్​రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి ఇంట్లో జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు ​బీఆర్​ఎస్​ కార్యకర్తల్లో కలిసిపోయి ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి సదరు కాంగ్రెస్​ నాయకుడు సెల్​ఫోన్​లో వీడియో లైవ్​పెట్టి అక్కడి విషయాలను కాంగ్రెస్​ నాయకులకు తెలియజేసేందుకు ప్రయత్నించినట్లు బిఆర్ఎస్​ నాయకులు ఆరోపించారు. చివరికి ఆ వ్యక్తి బీఆర్​ఎస్​కు చెందిన వాడు కాదని గుర్తించిన కార్యర్తలు దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అనంతరం ఇంట్లోనే ఉన్న ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి సదరు గొడవను విని ఆ కాంగ్రెస్​ నాయకుడిని వదిలేయాలని పేర్కొనగా పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ..

పోలీసుల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, 163 బీఎన్​ఎస్​ అమల్లో ఉండగా.. గుట్టుచప్పుడు కాకుండా ఓ కాంగ్రెస్​ నాయకుడు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి వీడియో ద్వారా లైవ్​ పెట్టేందుకు ప్రయత్నించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పోలీసులు సైతం కాంగ్రెస్​ నాయకులకే మద్దతు తెలుపుతున్నారంటూ బీఆర్​ఎస్​ నాయకులు పలువురు ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -