Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌ రెడ్డి హయాంలో ఇంటర్‌ విద్యకు మహర్దశ

రేవంత్‌ రెడ్డి హయాంలో ఇంటర్‌ విద్యకు మహర్దశ

- Advertisement -

విద్యా జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అంతరించే పరిస్థితికి చేరిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు సీఎం రేవంత్‌ రెడ్డి హయాంలో మహర్దశకు నోచుకున్నాయని విద్యా జేఏసీ తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా జేఏసీ చైర్మెన్‌ డాక్టర్‌ పి.మధుసూదన్‌ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఖ్య 380 కాగా, వాటిలో చేరే వారి సంఖ్య 60 వేలలోపు మాత్రమేనని తెలిపారు. ప్రతి ఏడాది 10మంది విద్యార్థులు ప్రయివేటుకు తరలి వెళ్లే పరిస్థితిలో, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం ప్రాతినిథ్యంతో ఉచిత విద్యను సాధించిందని గుర్తుచేశారు. ఆనాటి ప్రభుత్వం ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న రూ.5 కోట్ల నిధుల స్థానంలో ప్రతి సంవత్సరం కళాశాల దినసరి ఖర్చు కోసం రూ.4 కోట్లు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. ఆ ప్రభుత్వం పాలించిన పదేండ్లలో (2014 -2023 వరకు) ఇచ్చిన నిధులు రూ.2 కోట్లు కాగా, అందులో ఖర్చు చేసింది కేవలం 62 లక్షలు మాత్రమేనని విమర్శించారు.

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఇంటర్‌ విద్యకు జవసత్వాలు నింపారని కొనియాడారు. టీజీపీఎస్సీ ద్వారా 1,300 మంది అధ్యాపకులను నియమించారనీ, ఆయా కళాశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి నెల రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు కాలేజ్‌ ఫెసిలిటీ మెయింటనెన్స్‌ గ్రాంట్‌ మంజూరు చేశారని తెలిపారు. 326 కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతుల కోసం రూ.56.16 కోట్ల మంజూరు, ప్రయోగశాలల ఉన్నతీకరణ కోసం ప్రతి జూనియర్‌ కళాశాలకు రూ.25 వేలు, క్రీడా పరికరాల కోసం రూ.10 వేలు చొప్పున నిధుల విడుదల చేశారని గుర్తుచేశారు. వీటితో పాటు విద్యార్థుల హాజరు శాతం, అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు సీసీ కెమెరాలు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నియంత్రణ చర్యలు తీసుకున్నారని చెప్పారు. మారుతున్న కాలానికి ధీటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రతి కళాశాలలో డిజిటల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొడ్యూర్మెంట్‌ కోసం రూ.34 కోట్లు కేటాయించారనీ, ప్రతి కళాశాలలో కనీసం రెండు చొప్పున ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీఎస్‌), ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ ప్యాడ్స్‌ (ఐడీపీఎస్‌) ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సాధారణ సెలవుల నుంచి మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ వరకు మొత్తం ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారన్నారు. ఇంటర్‌ విద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి ప్రోత్సహించారని గుర్తుచేశారు. హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌లను ముద్రించి పరీక్షా కేంద్రాలను గూగుల్‌ మ్యాప్‌ ద్వారా అతి సులువుగా తెలుసుకునే సౌకర్యంతో పాటు పరీక్షా పత్రాల ముద్రణలో సంస్కరణలు, పునర్‌ మూల్యాంకనం తదితర చర్యలు తీసుకున్నారని చెప్పారు. మనో వైజ్ఞానిక తరగతులు, పునశ్చరణ తరగతులు, యాంటీ డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం, టెలిమానస్‌, హెల్ప్‌ వంటి కార్యక్రమాలు ఇంటర్‌ విద్య బలోపేతానికి ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.

సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత చొరవ, విద్యారంగంపై నిరంతర సమీక్షల ప్రభావమే సంస్కరణలకు కారణమని మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కృషికి అభినందనలు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మధుసూదన్‌ రెడ్డి కోరారు. ఈ సౌకర్యాల కల్పనతో ఇంటర్‌ విద్య మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విద్యా జేఏసీ నాయకులు వి.ఆంజనేయరావు, కె.రవీందర్‌ రెడ్డి, బలరాం జాదవ్‌, ఆర్‌.మాధవరావు, ఎస్‌.శ్రీనివాస్‌, కె.కవిత కిరణ్‌, జి.సునీత, కె.లక్ష్మణ్‌ రావు, కె.రజిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -