నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డు.. ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించవచ్చునని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటర కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కు ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు.
కాగా.. గతేడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవ్వగా .. ఈ ఏడాది 8 రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ రూపొందించింది. ఈ ఏడాది సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలుస్తోంది. 12 ఏళ్ల తర్వాత ఈసారి ఇంటర్మీడియట్ సిలబస్ ను కూడా బోర్డు మార్చింది. కాగా.. 8 రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించడం వల్ల జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, ఈఏపీసెట్ ఎంట్రన్స్ టెస్టులకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరింత సమయం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.



