మార్చి 18 వరకు నిర్వహణ
జనవరి 21న ఫస్టియర్, 22న సెకండియర్‌కు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్
జనవరి 23న నైతికత, మానవ విలువలు, 24న పర్యావరణ విద్య పరీక్ష
టైంటేబుల్ విడుదల
ఈ నెల 14 వరకు ఫీజు చెల్లింపు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు మార్చి 18 వరకు జరుగుతాయి. జనరల్‌తోపాటు ఒకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తించనుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య శుక్రవారం ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ (టైంటేబుల్)ను విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలను ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.
వచ్చేఏడాది ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయని వివరించారు. ప్రతి రోజూ రెండువిడతల్లో ఈ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత ప్రాక్టికల్ పరీక్షలుంటాయని తెలిపారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనవరి 21న, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అదేనెల 22న నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఒకవేళ ఆయా తేదీల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలుంటే ప్రత్యామ్నాయ తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జనవరి 23న ఉదయ10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నైతికత, మానవ విలువలు రాతపరీక్ష ఉంటుందని తెలిపారు. అదేనెల 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లింపు ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపునకు తుది గడువు ఈనెల 14 వరకు ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.100తో అదేనెల 16 నుంచి 24 వరకు, రూ.500తో వచ్చేనెల 26 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు, రూ.వెయ్యితో డిసెంబర్ మూడు నుంచి ఎనిమిది వరకు, రూ.రెండు వేలతో అదేనెల పది నుంచి 15 వరకు చెల్లింపునకు అవకాశముందని వివరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో థియరీ పరీక్షలకు ఫీజు రూ.530, ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షల కోసం అదనంగా రూ.100 చెల్లించాలని సూచించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగం విద్యార్థులు రూ.870 (థియరీ పరీక్షలకు రూ.530, ప్రాక్టికల్స్‌కు రూ.240, ఇంగ్లీష్ ప్రాక్టికల్ కోసం రూ.100) చెల్లించాలని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం విద్యార్థులు ఆర్ట్స్‌కు రూ.530, ఇంగ్లీష్ ప్రాక్టికల్ కోసం రూ.100 కట్టాలని పేర్కొన్నారు. సైన్స్ విద్యార్థులు రూ.870 చెల్లించాలని వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.870 కట్టాలని కోరారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఫెయిలైన వారు, హాజరు మినహాయింపు ఉన్న ప్రయివేటు విద్యార్థులు కూడా సకాలంలో పరీక్షల ఫీజులను చెల్లించాలని సూచించారు.



