Saturday, June 7, 2025
E-PAPER
Homeబీజినెస్వడ్డీ రేట్లు అర శాతం తగ్గింపు

వడ్డీ రేట్లు అర శాతం తగ్గింపు

- Advertisement -

– వరుసగా మూడో సారి ఉపశమనం
– నగదు నిల్వల నిష్పత్తికి కోత
– ఆర్‌బీఐ ఎంపీసీలో నిర్ణయం
న్యూఢిల్లీ :
రిజర్వ్‌ బ్యాంక్‌ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లకు కోత విధించింది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమీక్షలో కీలక రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం ద్వారా 5.50 శాతానికి చేర్చింది. ఫిబ్రవరిలో 25 బేసిస్‌ పాయింట్లు, ఏప్రిల్‌లో 25 బేసిస్‌ పాయింట్లు చొప్పున వడ్డీ రేట్లను తగ్గించింది. మొత్తంగా రుణాలపై వడ్డీ ఒక్క శాతం మేర కోత విధించడంతో పాత, కొత్త గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలపై వడ్డీ భారం కొంత తగ్గనుంది.
ఆర్‌బిఐ ఎంపీసీ భేటీ తర్వాత శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతోందన్నారు. ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడీపీ 6.5 శాతం పెరగొచ్చన్నారు. పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోందన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ అంచనాలను 4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గిస్తున్నామన్నారు.
ద్రవ్య పరపతి విధాన కమిటీ సర్దుబాటు వైఖరి నుంచి స్థిర విధానానికి మారాలని నిర్ణయించినట్టు మల్హోత్రా తెలిపారు. మరోవైపు బ్యాంక్‌ల వద్ద నగదు లభ్యతను పెంచడానికి నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ను 100 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో సీఆర్‌ఆర్‌ 4 శాతం నుంచి 3 శాతనికి తగ్గనుంది. దీన్ని సెప్టెంబర్‌ నుంచి 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున నాలుగు విడతలుగా అమలు చేయనున్నట్టు తెలిపింది.
ఈ నిర్ణయం బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు నగదు లభ్యతను పెంచనుందని అంచనా వేసింది. దీంతో బ్యాంకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్టవుతుంది.
ఈ ఏడాది జనవరి నుంచి రూ.9.5 లక్షల కోట్లు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చామని మల్హోత్రా తెలిపారు. విదేశీ మారక నిల్వలు 691.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయన్నారు. దీంతో మరో 11 నెలల వరకు దిగుమతులకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ దఫా వడ్డీ రేట్లలో పావు శాతం తగ్గింపు ఉండొచ్చని నిపుణులు అంచనా వేయగా.. ఎస్‌బీఐ మాత్రం అర శాతం కోత ఉండొచ్చని ముందస్తు భావించడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -