Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంవడ్డీ రేట్లు యథాతథం

వడ్డీ రేట్లు యథాతథం

- Advertisement -

ఆర్బీఐ నిర్ణయం
న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. విశ్లేషకుల అంచనా లకు భిన్నంగా వరసగా రెండోసారి రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ సమీక్షల్లో 0.25 శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ జూన్‌ సమావేశంలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అలా మూడు వరుస సమీక్షల్లో కలిపి రెపోరేట్‌ 1 శాతం తగ్గింది. ట్రంప్‌ టారిఫ్‌, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు సమావేశంలో మాత్రం యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచింది. ఈసారి యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.

అయితే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4 శాతం లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) నివేదిక అంచనా వేసింది. జీఎస్టీ హేతుబద్ధీకరణతో అక్టోబర్‌లో అది మరింత తక్కువ ఉండే అవకాశముందని పేర్కొంది. దాంతో కీలక వడ్డీరేట్లను (రెపోరేట్‌) మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించేందుకు హేతుబద్ధత ఉందని తెలిపింది. కానీ అంచనాలకు భిన్నంగా ఈసారి రేట్‌ను యథాతథంగా కొనసాగించింది.

అలాగే మోడీ సర్కార్‌ తెచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఇది దేశ ఆర్థిక వృద్ధిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల ప్రభావాన్ని కొంతమేర భర్తీ చేస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో సుంకాలకు సంబంధించిన పరిణామాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 నుంచి 6.8 శాతానికి ఆర్బీఐ సవరించిందని చెప్పారు. దీంతో అనుకూల పరిస్థితులు, తక్కువ ద్రవ్యోల్బణం, ద్రవ్య సడలింపుల ద్వారా ఆర్థిక వృద్ధి అంచనా స్థిరంగా ఉందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -