Friday, July 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసందిగ్ధంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం?

సందిగ్ధంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం?

- Advertisement -

– వ్యవసాయం, డెయిరీ రంగాల్లో అమెరికా ప్రవేశంపై భారత్‌లో ఆందోళన
– తుది దశకు చేరిన చర్చలు
– ముగుస్తున్న ప్రతీకార సుంకాల గడువు
వాషింగ్టన్‌ :
భారత్‌, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. 48 గంటల్లో ‘మధ్యంతర’ ఒప్పందం కుదరవచ్చని విశ్వసనీయ సమాచారం. అయితే వ్యవసాయం, డెయిరీ రంగాలలోకి అమెరికా ఉత్పత్తులను పూర్తి స్థాయిలో అనుమతించే విషయంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో వస్త్రాలు, రత్నాలు-ఆభరణాలు, తోలు వస్తువులు, ప్లాస్టిక్‌ వస్తువులు, రసాయనాలు సహా కార్మికులతో ముడిపడిన భారతీయ పరిశ్రమలకు అమెరికా మార్కెట్‌లో మరింత ప్రవేశం కల్పించాలని కోరుతోంది. ప్రతీకార సుంకాల విధింపునకు ఇచ్చిన 90 రోజుల విరామ సమయం శనివారంతో ముగుస్తుండడంతో ఈ లోగానే ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. వాణిజ్య ఒప్పందం విషయంలో బేరసారాలు జరుగుతుండడంతో చిక్కుముడులు ఎదురవుతున్నాయి. ప్రత్యేక కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం వాషింగ్టన్‌లో మకాం వేసి సంప్రదింపులు కొనసాగిస్తున్నది.

భారత వ్యవసాయ రంగంలోకి అమెరికా ఉత్పత్తులను విస్తృత స్థాయిలో అనుమతించాలని ట్రంప్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్నది. అయితే అమెరికాలో జన్యుపరంగా అభివృద్ధి చేసి పండిస్తున్న మొక్కజొన్న, సోయాబీన్‌, బియ్యం, గోధుమలపై సుంకాలు తగ్గించేందుకు భారత్‌ ససేమిరా అంటోంది. మన దేశంలో పాడి పరిశ్రమ రంగంలో ఎనిమిది కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. కోట్లాది మందికి జీవనభృతి కల్పిస్తున్న ఈ రంగంలోకి అమెరికాను అనుమతించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో విదేశీ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం కల్పిస్తే మరోసారి రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. అమెరికాలో వ్యవసాయ రంగానికి భారీ సబ్సిడీలు అందుతున్నాయి.

మన దేశంలో ఒక్కో రైతు ఏడాదికి 282 డాలర్ల సబ్సిడీ మాత్రమే పొందుతున్నారు. అమెరికాలో రైతులు 61 వేల డాలర్లు సబ్సిడీలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాయితీలు ఇవ్వాల్సింది అమెరికానే తప్ప, తాము కాదని భారత్‌ వాదిస్తోంది. తమ వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులను భారత్‌ అనుమతిస్తే ఇరువురికీ ప్రయోజనం చేకూరుతుందనేది అమెరికా వాదన. అయితే దీనివల్ల ఎక్కువ లబ్ది పొందేది అమెరికానే అని, దేశంలోని కార్మికుల్లో దాదాపు సగం మంది వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నందున ట్రంప్‌ ప్రభుత్వ డిమాండ్‌కు అంగీకరిస్తే వారి జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందనే అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అధిక సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి కుప్పలు తెప్పలుగా వచ్చి పడితే ఆహార భద్రతా ప్రమాణాలు దెబ్బతింటాయి. అదీకాక జన్యుపరంగా అభివృద్ధి చేసిన పంటలు కాలుష్యానికి కారణమవుతాయి. అవి మన స్థానిక విత్తన రకాలకు హాని కలిగిస్తాయి. పైగా అమెరికా నుండి దిగుమతి అయ్యే పశువుల దాణా మన సాంస్కృతిక, మత విలువలతో ఘర్షణ పడవచ్చు. వ్యవసాయ ఉత్పత్తి, ఆ రంగం కల్పిస్తున్న ఉపాధి, డిమాండ్‌-సరఫరాల విషయంలో కూడా భారత్‌, అమెరికా మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -