Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయ న్యాయం చచ్చుబడిపోయింది!

అంతర్జాతీయ న్యాయం చచ్చుబడిపోయింది!

- Advertisement -

– ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడి నేపథ్యంలో రష్యా వ్యాఖ్య
– భద్రతా మండలి పి-5 భేటీకి పిలుపు
మాస్కో / టెహ్రాన్‌ :
ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాదంతో దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ న్యాయం చచ్చుబడిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు (పి-5) తక్షణమే భేటీ కావాలని పిలుపునిచ్చింది. ప్రపంచ భద్రత, సుస్థిరతలపై చర్చించేందుకు పి-5లోని రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ భేటీ కావాలని తమ అధ్యక్షులు పుతిన్‌ కోరుకుంటున్నారని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తెలిపారు. ఆదివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పుతిన్‌ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు భేటీ కావాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్‌-19 సంక్షోభ కాలానికి ముందు కూడా ఒకసారి ఇదే ప్రతిపాదనను పుతిన్‌ చేశారని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ న్యాయం అనేది దాదాపు నశించిపోయిం దని, ఇలాంటప్పుడు అంతర్జాతీయ న్యాయంలోని నిబంధనలు, సూత్రాలను అనుసరించమని ఇతరులకు ఎలా చెప్పగలమో తనకు అర్థం కావడం లేదన్నారు. కనీసం అంతర్జాతీయ న్యాయం అంటే ఏమిటో నిర్వచించే పరిస్థితిలో కూడా ఇప్పుడెవరూ లేరని ఆయన తెలిపారు. వాస్తవానికి అంతర్జాతీయ న్యాయం అనేది ఇంకా మిగిలి లేదని పెస్కోవ్‌ పేర్కొన్నారు. కేవలం అది కాగితాలు, మాటలకు పరిమితమైందని, ఆచరణలో అస్సలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ‘ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ దాడులు చేశాక పశ్చిమాసియా ప్రాంతంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో సైనిక ఘర్షణల సంఖ్య కూడా పెరిగింది. వీటి ఫలితంగా ప్రతికూలమైన రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని దిమిత్రీ పెస్కోవ్‌ హెచ్చరించారు.

అమెరికా చర్యలు నిబంధనలకు లోబడి ఉన్నాయా? : రష్యా విదేశాంగమంత్రి సెర్గీ
పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక ఘర్షణపై అమెరికా స్పష్టమైన ప్రకటనను విడుదల చేయాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ఎలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం అనే దానిపై చర్చ జరగాల్సివుందన్నారు. అమెరికా దీర్ఘకాలిక ప్రణాళిక ఏమిటో చెప్పాలన్నారు. తమ చర్యలు అంతర్జాతీయ నిబంధనలకు లోబడి ఉన్నాయా లేదా అనేది కూడా అమెరికా వివరించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

394 మంది మృతుల్లో 83 మంది పిల్లలే : లెబనాన్‌
లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 394 మంది చనిపోగా, వారిలో 83మంది పిల్లలే ఉన్నారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి రకాన్‌ నసీరుద్దీన్‌ ఆదివారం వెల్లడించారు. గతవారం ఇజ్రాయిల్‌ ఉత్తర ప్రాంతంపై ఇరాన్‌ సమర్ధిత హిజ్బుల్లా మిలిటెంట్లు రాకెట్లతో దాడులు చేశారన్న సాకుతో లెబ నాన్‌పై ఇజ్రాయిల్‌ భీకర వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లోనే వందలాది మంది ప్రజలు చనిపోయారు.

పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై తీవ్ర దాడులు
పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తామని ఆదివారం ఉదయం ఇరాన్‌ అధ్యక్షులు మసూద్‌ పెజెష్కియాన్‌ హెచ్చరించారు. ఆ వెంటనే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)లోని పలుచోట్ల దాడులు జరిగాయి. ఈ విషయాన్ని యుఎఇ రక్షణ శాఖ ధ్రువీకరించింది. 16 బాలిస్టిక్‌ మిస్సైళ్లు, 117కుపైగా డ్రోన్లతో తమ దేశంపై ఇరాన్‌ దాడి చేసిందని, అయితే వాటిని తాము గగనతలంలోనే అడ్డుకొని నిర్వీర్యం చేశామని తెలిపింది. మరొక ఇరాన్‌ మిస్సైల్‌ నేరుగా సముద్రంలో పడిందని పేర్కొంది. చాలావరకు ఇరాన్‌ డ్రోన్లనూ తాము అడ్డుకున్నా మని, కానీ నాలుగు డ్రోన్లు భూమిపై పడ్డాయని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -