– 9 నెలల ఆదాయం రూ.30,029 కోట్లు
– ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.40 వేల కోట్లు
– మూడు నెలల్లో రూ.10వేల కోట్లు వస్తాయంటున్న అధికారులు
– దాడుల్లో బిజీగా ఎస్టీఎఫ్, డీటీఎఫ్ టీమ్‌లు
– 2025 సంతృప్తిగా ఉంది-ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రం మత్తులో తూగుతోంది. ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు కూడా ఏటా పెరుగుతూనే ఉన్నాయి. బడ్జెట్ అంచనాలకు మించి రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం పెరుగుతుండటం గమనార్హం. 2025-25 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖ ఆదాయం దాదాపు రూ.40కోట్లుగా అధికారులు నిర్ణయించుకున్నారు. దీనిలో మొదటి 9 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఎక్సైజ్‌శాఖ ఖజానాకు దాదాపు రూ.30,029 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపు అయిన చివరి మూడు నెలల్లో (2026 జనవరి నుంచి మార్చి నెలాఖరు నాటికి) మరో రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భరోసాగా చెప్తున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ‘మత్తు’ ఎంతలా విస్తరిస్తుందో అర్థమవుతోంది. ‘మత్తు’ సొమ్ముతోనే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నడుస్తుండటం గమనార్హం. ఏటా ప్రభుత్వ బడ్జెట్ అంచాలకు మించి, ఎక్సైజ్‌శాఖ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఆదాయం పెరగడానికి ఆ శాఖ నిర్వహిస్తున్న వ్యూహాత్మక దాడులు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న నాన్‌డ్యూటీ మద్యాన్ని సరిహద్దు చెక్‌పోస్టుల వద్దే పగడ్బందీగా అడ్డుకుంటున్నారు. దీనికోసం ఆ శాఖలో ప్రత్యేకంగా స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీంలు (ఎస్టీఎఫ్), డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు (డీటీఎఫ్)లను ఏర్పాటు చేశారు. తరచూ తనిఖీలు, రికవరీలు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకోవడంతో స్వరాష్ట్ర మద్యం ఆదాయం పెరుగుతూ వస్తుంది. నాటుసారా తయారీ, డ్రగ్స్, గంజాయిపై దాడులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, గోవా, హర్యానాతో పాటు కేంద్రపాలిత రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. 2025లో 11వేల లీటర్ల నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కేసులు 2025 డిసెంబర్ నెలాఖరు నాటికి 1,350 కేసులు నమోదు చేశారు. తండాల్లో నాటుసారా కోసం వినియోగించే నల్లబెల్లం, పటిక రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గంజాయి కలిపిన చాక్లెట్లను పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు
సంతృప్తినిచ్చింది : సీ హరికిరణ్, కమిషనర్, తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ
2025వ సంవత్సంలో మా శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉంది. ఓవైపు చట్ట ప్రకారం ఆదాయం పెంచుకుంటూనే, మరోవైపు చట్టవ్యతిరేక చర్యల్ని సమర్థవంతంగా నియంత్రించగలిగాం. ఈ ఏడాదిలో 14సార్లు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి, దాడులు నిర్వహించాం. కల్తీకల్లుపై రెండుసార్లు దాడులు చేశాం. ఐటీ లిక్కర్‌పైనా స్పెషల్ డ్రైవ్‌లు చేశాం. వేల కిలోల నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నాం. వందల కిలోల గంజాయిని పట్టుకొని, నిందితులను జైళ్లకు పంపాం. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో మూడునెలలు గడువు ఉంది. ఈలోపు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరగలం.
మత్తు ఆదాయం మస్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



