Sunday, November 23, 2025
E-PAPER
Homeకవితపరిచయాలు..!

పరిచయాలు..!

- Advertisement -

బెరుకు బెరుకు చూపులతో మొదలై,
చిరునవ్వుల చేతులు కలిపి,
మాటలు, అభిరుచులు పంచుకుంటూ
పరిచయాలు మనతో ప్రయాణిస్తాయి.
కొన్ని పరిచయాలు పేర్లు చెప్పుకున్నా,
ఒకరి చూపులను మరొకరు తప్పించుకుని,
ఎలాంటి భావసామ్యం లేకుండానే
అప్పుడే అదే క్షణంలో ముగిసిపోతాయి.
కొన్ని బస్సులో పక్కసీట్ల చర్చలుగా,
రైలులో ఎదురెదురు మాటలుగా ఎదిగి,
ప్రపంచమంతటి దూరభారాన్ని తగ్గిస్తూనే,
అంటుకట్టని మొక్కలా వాడిపోతాయి.
కొన్ని అవసరాల నీడలో మొదలై,
ఇరువురి అవకాశాలను వెతుక్కుంటూ,
స్వార్థాలు ఉన్నంత సేపూ వెంట ఉండి
కొంత దూరం నడిచి చెదిరిపోతాయి.
కొన్ని మొదట్లో ఉత్సాహం నింపినా,
గడుస్తున్న కొద్దీ లోపాలను వెతుక్కుంటూ,
తరువాత ఎలాంటి ఆకర్షణ లేని
వెలసిన రంగుల్లా నిరుత్సాహమవుతాయి.
మరి కొన్ని తక్కువ సమయంలోనే
వ్యక్తిత్వ పరిమళాల్ని ఇచ్చిపుచ్చుకుని,
మనసులో మధుర జ్ఞాపకమై నిలిచి,
నిరంతరం స్పూర్తిని అందిస్తాయి.
కానీ కొన్ని పరిచయాలు మొగ్గ తొడిగి,
స్నేహంగా వికసించి, నీడనిచ్చే చెట్లలా ఎదిగి,
పుష్పించి, ఫలిస్తూ ఆత్మీయతను పంచుతూ
కాల దూరాలను చెరిపేసి అజరామరమవుతాయి.
డా. వాసాల వరప్రసాద్‌, 9490189847

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -