Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeకథలోచూపు

లోచూపు

- Advertisement -

గూగుల్‌ మేప్‌ అక్కడిదాకా వచ్చింది గానీ వాళ్ళ ఇంటిని అందుకోవడం లేదు. బాబన్న ఫోన్‌ చేసాడు.
”తెల్లకారు మీదేనా.. ముందుకొచ్చి రైట్‌ తిరగండి. కొద్దిగా ముందుకొస్తే కుడివైపు ఇల్లే.. సంస్కతి సదన్‌” అటునుండి వినపడుతోంది.
కారు ముందుకెళ్ళింది. కానీ రైట్‌ తిరగడానికి లేకుండా రోడ్డుకి రాళ్ళు అడ్డం పెట్టున్నాయి. ఎడమకి తిరిగి మళ్ళా చుట్టుతిరిగి ఇందాక వున్నచోటకే వచ్చాం. బాబన్న మళ్ళీ ఫోన్‌ చేసాడు.
ఈసారి ఆయన, అమ్మాయి తండ్రి అనుకుంటా, కిందకి వచ్చాడు.
”అరె, ఇదేనా. కారు ఇక్కడే ఆపాం ఇప్పటిదాకా. మీరు ముందుకెళ్ళమంటే ముందుకెళ్ళాం” బాబన్న ఆయనకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.
”ఆ ముందు రోడ్డులో తెల్లకారు మీదే అనుకున్నానండీ” ఆయన సంజాయిషీ ఇచ్చాడు.
”అద్దీ..” బాబన్నకి తనది పొరపాటు కాదని నిరూపించుకోవడం ఇష్టం.
అందరం లిఫ్ట్‌లో ఆయన ఇంటికెళ్ళాం. అందరం అంటే నేను, మా ఆవిడ, బాబన్న, బాబన్నతో కారు డ్రైవింగ్‌ చేసుకొచ్చిన బాబన్న బావ ప్రకాష్‌, అమ్మాయి తండ్రి.
ఇంతకీ ఏందంటే మేం బాబన్న కొడుకుకి అమ్మాయిని చూడటానికని పెళ్ళిచూపులకొచ్చాం. బాబన్న భార్య పద్మావతికి ఆరోగ్యం బాలేక రాలేదు. ఆమెకి నయం కావడానికి పదిపదిహేను రోజులు పడుతుంది. అందుకే తోడుగా హంగుగా వుండడానికి మమ్మల్ని రమ్మన్నారు బాబన్న. ఊరి నుంచి బాబన్న, ప్రకాష్‌ గారు ఉదయమే దిగారు.
వాళ్ళ అపార్ట్‌మెంట్‌ ఇళ్ళు కొత్తదే అనుకుంటా.. శుభ్రంగా, అందంగా వుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ, పెదనాన, పెద్దమ్మ మొకమంతా నవ్వుతో పరిచయం చేసుకున్నారు. మా పరిచయాలు కూడా చేసుకున్నాం. వరసగా మంచి నీళ్ళు, ఫలహారం, డ్రింకు వచ్చాయి. ఎవరెక్కడ పని చేశారు, ఏం చేశారు, ఏ హోదాలో పని చేశారు లాంటి మాటలు నడుస్తున్నాయి. వాళ్ళ పెద్దమ్మ వచ్చి కూర్చొని, మా ఆవిడని పిలిచి పక్కన కూర్చొనబెట్టుకుంది.
అమ్మాయి వచ్చి కూర్చుంది. ఫొటోలో చూసినట్టే వుంది. నవ్వితే మొఖమంతా నవ్వే.. కళగల మొఖం. మనిషి అటు సన్నము కాదు, ఇటు లావు కాదు. కాస్త పొడగరే. కొన్ని నిమిషాల ఇబ్బందికర మౌనం తర్వాత బాబన్న పద్మావతికి వీడియోకాల్‌ చేశాడు. రడీ అయి కూర్చున్న పద్మావతి టక్కున కాల్‌ ఎత్తింది.
”ఇదిగో మాట్లాడు.. అమ్మాయికి ఇస్తున్నా..” వెంటనే ఫోన్‌ అమ్మాయికి ఇచ్చాడు బాబన్న.
పద్మావతి ఫోన్‌లోనే అమ్మాయితో ఇంటర్వ్యూ మొదలుపెట్టింది.
‘ఎక్కడ చదువుకున్నావు? స్కూటీ మీద ఆఫీసుకి వెళ్తావా..? ఎన్నాళ్ళ నుంచి జాబ్‌ చేస్తున్నావు?
వీసా వుందా? వంట వచ్చా?’ లాంటి ప్రశ్నలు వరదలా వినపడుతుంటే ఆ అమ్మాయి ఓపిగ్గా నవ్వుతూ సమాధానాలు చెపుతోంది. ఈలోపు మా ఆవిడ దగ్గర నుండి పక్కనే కూర్చున్న పెద్దమ్మ బాబన్న అబ్బాయి గురించి కూపీ లాగుతోంది.
చాలాసేపటికి ఫోను అమ్మాయి నుండి వాళ్ళ అమ్మకు, ఆమె నుండి బాబన్నకు వచ్చింది. ఆ అమ్మాయో, వాళ్ళ నానో అబ్బాయి గురించి ఏమన్నా అడుగుతారేమోనని చూశాను గానీ, వాళ్ళేమీ అడగలేదు. బాబన్నే ఇంట్లో ఖర్చుల గురించి ఆ అమ్మాయిని ఏవో రెండు పొడిపొడి ప్రశ్నలు వేశాడు. ఆడపిల్లలు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసినా గానీ, ఉప్పులు పప్పులు ఖర్చుల గురించి తెలిసుండాలని బాబన్న ఉద్దేశం అంట.

కార్లో తిరిగి వచ్చేస్తున్నాం. బాబన్న ఫోన్లో పద్మావతితో మాట్లాడుతున్నాడు. ” అమ్మాయి సంప్రదాయం, మాటతీరు అదీ బాగానే వుంది గానీ.. అమ్మాయి ముక్కట్లు క్లియర్‌గా లేవు. రంగు కూడా చామనఛాయ” ఆయన గొంతులో అసమ్మతి ధ్వనిస్తోంది.
ఇంతలో మా ఆవిడ ”వాళ్ళ పెద్దమ్మ నన్ను అన్నీ ఆరాలు అడుగుతుంది బావగారూ.. పిల్లోడు తెలుపేనా.. ఏం ఉద్యోగం.. పర్మినెంటేనా.. అంటా” అని చెప్పుకుపోతా వుంది. నేను బాబన్న వాళ్ళు చూడకుండా మా ఆవిడని మాట్లాడవద్దని వారించాను. మా ఆవిడ నన్ను పట్టించుకోకుండా ఉత్సాహంగా మాబాబన్నకి చెపుకుంటా పోతానే వుంది. కారులోనే మాటలన్నీ అయిపోయాయి. ఈ సంబంధం కూడా అయిపోయినట్టే అనిపించింది నాకు.
బాబన్న మమ్మల్ని మా ఇంటి దగ్గర దించి ”తెల్సిన ఆయన ఇంక ఏవో రెండు సంబంధాలు వున్నాయని అన్నాడు. వీలు కుదిరితే అవి కూడా రేపు చూసి ఊరికి వెళ్తామండీ” అని చెప్పి వెళ్ళిపోయాడు.
బాబన్న వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా ఆవిడతో ”ఆగమని చెపితే ఆగవే.. అడక్కపోయినా లొడలొడా అలా మాట్లాడతావేం?” అన్నా చిరుకోపంగా.
”ఏం జరిగిందో పద్మావతి అక్క చెప్పమంటే చెపుతున్నా”
”అన్నీ పిన్‌ టు పిన్‌ చెప్పాలా..? అసలే బాబన్నకి ఈ సంబంధం అట ఇటా అన్నట్టుగా వుంటే..”
”సర్లెండి.. అంతా నాదే తప్పు..ఇంక ఏం మాట్లాడను.. మూసుకొని కూర్చుంటాను” నోటి మీద చేయి పెట్టుకొని కోపంగా అంది మా ఆవిడ.
”అది కాదు.. మన మాటల్ని బట్టి వాళ్ళు సంబంధం వద్దనుకునే నిర్ణయానికి బలం రాకూడదు కదా..”
”అబ్బా.. బాబు బావ ఎవడి మాటైనా వింటాడా? వందమంది చెప్పినా తన మనసులో వున్నదే చేస్తాడు”
”అదే నేను అనేది. ఎంత చెప్పినా విననప్పుడు మనం చెప్పి ఉపయోగం ఏవుంది? అయినా చూస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ రెండిళ్ళల్లో ఒకతే కూతురులా వుంది. పైగా వాళ్ళందరూ ఉద్యోగస్తులే. ఈ అమ్మాయి కూడా ఏడు ఎనిమిదేళ్ళ నుంచి జాబ్‌ చేస్తా వుంది. అంటే తన సొంత సంపాదన మీదే బతుకుతుంది. తన కంటూ కొన్ని అభిప్రాయాలు, కోరికలు వుంటాయి కదా.. మొదటిసారే తనవన్నీ బయట పెట్టకుండా ఓపిగ్గా వుందంటే.. ఆ అమ్మాయి కొంత ఆలోచన కలది అని అర్థం కదా..పైగా ఒక్కతే కూతురు.. ఉన్నవేవన్నా అన్నీ ఆ అమ్మాయికేగా..”
”అవునండి.. కానీ పొద్దాక అమ్మాయి నవ్వితే మొకమంతా పళ్ళే కనబడుతున్నాయి.. పళ్ళే కనపడుతున్నాయి అంటుంది పద్మావతి అక్క..”
”అందుకు కదూ.. ఇన్ని సంబంధాలు చూసినా ఒక్కటీ కుదరలేదు.. ఒకళ్ళకి ఒకటి నచ్చితే మరొకళ్ళకి నచ్చదు. ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి. ఎర్రగా బుర్రగా వున్న అమ్మాయి కావాలి. అమెరికా వచ్చే అమ్మాయి కావాలి. అణకువగా వుండే అమ్మాయి కావాలి. కట్నం బాగా తెచ్చే అమ్మాయి కావాలి. ఇన్ని వున్న అమ్మాయి తనకి తగ్గ అబ్బాయిని చూసుకుంటుంది కదా..’
”అయినా మీ అక్క ఆ అమ్మాయిని ఏమి అడగాలి..? అమ్మా.. నువ్వు తలిదండ్రులను వదిలి అమెరికా వచ్చి వుండగలవా? నీ ఉద్యోగానికి సంబందించి అమెరికా రావడం వల్ల నీకు ఇబ్బంది ఏమైనా వుందా ? ఒకవేళ ఆ ఉద్యోగం వదిలి అమెరికా రావాల్సొస్తే, ఉద్యోగం వదిలి రాగలవా ? ఇలాంటివి కదా ఆ అమ్మాయిని అడగాల్సిన ప్రశ్నలు..”
”……………..”
” ఎనిమిదేళ్ళుగా అదే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అదే కంపెనీలో చేస్తూ వున్నదంటే, అక్కడ తనకంటూ ఒక స్థానం, పరపతి ఏర్పరుచుకొని వుండి వుంటుంది కదా.. అవేం పట్టించుకోకుండా, అమ్మాయిలో అందమొకటే చూస్తున్నారంటే ఏమనుకోవాలి? అందం నాలుగు రోజుల్లో మామూలయిపోతుంది. వయసొస్తే మాయమవుతుంది. ఆ అమ్మాయి గుణం మంచిదయితే కదా వీళ్ళ ముసలిదశలో బాగా చూసుకోగలదు”
”ఏమోనండి.. మొదటి నుండీ అక్క అమ్మాయి లావుగా వుంది.. చామనఛాయలో వుంది. మొకమంతా పళ్ళే కనపడుతున్నాయి.. ఇవే అంటుంది”
”కాదమ్మారు.. అన్ని హంగులున్న అమ్మాయినే ఇన్ని అంటున్నారు.. మరి మనవాడి సంగతి ఏమిటి? అది తెలిస్తే వాళ్ళే కాదు.. ఎవరైనా పెళ్ళికి ఒప్పుకుంటారా..?”
”ఏంటండి..అది?” మా ఆవిడ తెల్లముఖం వేసింది అర్థం కాక.
”చూసావా నువ్వూ మీ అక్క రూట్లోనే ఆలోచిస్తున్నావు..”
”ఏంటండి అది? నాకు అర్థం కాలేదు”
”ఎందుకు అవుతుంది? కాస్త మనవైపు కూడా ఆలోచించాలి. ఎప్పడూ అవతలి వాళ్ళ లోపాలే వెతికితే ఎలా?”
మా ఆవిడ మొఖంలో ఏదో మబ్బు విడిన భావం కనపడింది.
”ఆఁ.. మీ అక్క కొడుకుకి బట్టనెత్తికి విగ్‌ పెట్టారని వాళ్ళకి తెలిస్తే.. పెళ్ళికి ఒప్పుకుంటారా? అందులోనూ వీళ్ళ గొంతెమ్మ కోరికలకి..?”
”అవునండి.. నేనంత లోతుగా ఆలోచించలేదు..”
మీ అక్కా వాళ్ళు ఇన్ని సంబంధాలు తిరగ కొట్టారు కదా.. ఒక సంబంధం వీళ్ళని కాదంటే వీళ్ళకి తెలుస్తుంది ఆ బాధ..”
”……………….”
”మీ అక్కా వాళ్ళు ఈ సంబంధం కాదనుకోవడం కన్నా.. ఆ అమ్మాయి వాళ్ళు ఈ సంబంధం కాదనుకోవడం కరెక్ట్‌.. నా దష్టిలో..”
అవునన్నట్టు మా ఆవిడ మెల్లగా తలూపింది.
– పి.శ్రీనివాస్‌ గౌడ్‌, 9949429449

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad