ఇద్దరు సభ్యులతో నిపుణుల బృందం ఏర్పాటు
మూడ్రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్రం ఆదేశం
సైట్ విజిట్ నిబంధనలపై కమిటీ ఆరా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నైని కోల్ బ్లాక్ టెండర్ల రద్దును కేంద్ర బొగ్గు గనుల శాఖ సీరియస్‌గా తీసుకుంది. బిడ్ దాఖలు కోసం రూపొందించిన నిబంధనలపై వివాదం తలెత్తడంతో సింగరేణి ఆ టెండర్‌ను రద్దు చేసింది. ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన నిపుణుల బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర బొగ్గుగనుల శాఖ కార్యదర్శి ప్రదీప్‌రాజ్ నాయన్ గురువారం సర్క్యూలర్ జారీ చేశారు. ఈ బృందంలో బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, బొగ్గు శాఖ టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. వివాదానికి, టెండర్ రద్దుకు గల కారణాలపై నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ జరిపి మూడ్రోజుల్లో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.
వివాదం ఇది…
నైనీ బొగ్గు గనిలో ఓవర్ బర్డెన్ (బొగ్గుపై ఉండే మట్టి, ఇతర రాళ్లు) తొలగింపు, బొగ్గు వెలికితీతకు తొలి విడతలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)-1, 2కు తరలించడం, మలి విడతలో మూడో సీహెచ్‌పీకి తరలించే పనులను 25ఏండ్ల కాలానికి రూ.1604.42 కోట్లతో సింగరేణి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. బొగ్గు బ్లాక్ సమగ్ర నిర్వహణ పనులను ఎవరికైనా అప్పగించాలంటే ఓవర్ బర్డెన్ తొలగింపు, భారీ గని నిర్వహణలో పూర్వానుభవంతో పాటు బొగ్గు తరలింపునకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలు, అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ నైనీ బొగ్గు గని విషయంలో మాత్రం విధిగా గనిని సందర్శించి, పరిసరాలను గమనించడంతో పాటు సింగరేణి సంస్థ నుంచి సర్టిఫికెట్ పొందాలనే నిబంధనను పెట్టారు. గతంలో ఇలాంటి నిబంధనను ఎప్పుడూ పెట్టలేదని కాంట్రాక్ట్ సంస్థలు అంటున్నాయి. టెండర్ దాఖలు చేసే సంస్థ సైట్ విజిట్ చేసినా ధృవీకరణ పత్రం ఇవ్వాలా? వద్దా? అనే అంశం సింగరేణి యాజమాన్యం విచక్షణకు వదిలేశారు. దాంతో ఈ నిబంధనపై వివాదం చెలరేగింది. చిలికిచిలికి గాలివానలా మారి రాజకీయ రంగు పులుముకోవడంతో సింగరేణి సంస్థ టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుపై విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



