Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'నీలోఫర్‌'పై విచారణ..!

‘నీలోఫర్‌’పై విచారణ..!

- Advertisement -

కార్పొరేట్‌ నిధుల్లో గోల్‌మాల్‌
పరికరాల కొనుగోలులో అక్రమాలు
నిధులు వెచ్చించిన తీరుపై ఆడిట్‌
విచారణకు ఆదేశించిన ప్రిన్సిపల్‌ సెక్రెటరీ

నవతెలంగాణ-సిటీబ్యూరో
నీలోఫర్‌ ఆస్పత్రిలో పరికరాల కొనుగోళ్లు.. నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా చేపట్టే కొనుగోళ్లన్నీ టెండర్ల ద్వారానే చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన ఆస్పత్రి డెవలప్‌మెంట్‌ సొసైటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందూస్తాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎల్‌) సీఎస్‌ఆర్‌ కింద కేటాయించిన రూ.20 కోట్లను ఖర్చు చేసిన తీరుపై ఆడిట్‌ నిర్వహించాలని, భవిష్యత్‌లో పరికరాల కొనుగోళ్లన్నీ టీజీఎస్‌ఎంఐడీసీ ద్వారానే చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.

యంత్రాలు, పరికరాల కొనుగోలులో అవకతవకలు
నీలోఫర్‌లో వైద్య పరికరాలు, దోబీఘాట్‌ యంత్రాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్టు సర్కార్‌ గుర్తించింది. గతంలో ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ అధికారి అంతా తానై వ్యవహరించి నిధులు పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. నీలోఫర్‌లో అదనపు భవనం, ముఖ్యమైన పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ గతంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద రూ.20 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నిధులతో ప్రస్తుతం ఓపీ భవనం పక్కన రూ.10 కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నారు. మరో రూ.10 కోట్లతో వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతులకు వినియోగించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎంఐఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఆ సదరు అధికారి అత్యవసర పద్దు కింద ఈ నిధుల నుంచి పరికరాల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు.

నిబంధనలు బేఖాతర్‌
మొదట ఆస్పత్రిలోని దోబీ ఘాట్‌లో ఉన్న యంత్రాలను మార్చాలని నిర్ణయించి ఓ ప్రయివేటు సంస్థకు ఆ పనులను ఏకపక్షంగా అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో 60 కిలోలు, 100 కిలోల సామర్థ్యం ఉన్న యంత్రాలను కొనుగోలు చేశారు. ఏవైనా యంత్రాలు డిస్పోజబుల్‌ చేసి కొత్తవి కొనాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. పాత యంత్రాలకు ఎలాంటి ధర లేకుండానే సదరు సంస్థకు అప్పగించినట్టు సమాచారం. ఇవేకాకుండా పలు పరికరాలను ఎలాంటి నిబంధనలూ పాటించకుండా కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇలా మొత్తం దాదాపు రూ.5 కోట్లకు పైగా నిధులకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు ఆస్పత్రి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్కార్‌ విచారణకు ఆదేశించడంతో ఆ అధికారితోపాటు ఆయనకు సహకరించిన మరికొందరు డైలమాలో పడ్డారు. విచారణలో అక్రమాలు జరిగినట్టు తేలితే సదరు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆస్పత్రి వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -