ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు ముందు చూపుతో అమలు చేసిన ఎల్పీజీ సంస్కరణల వల్లే తెలంగాణకు విరివిగా పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఆఫీస్’ను బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం కాం గ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణ ఫలాలు నేడు అందుతున్నాయని అభి ప్రాయపడ్డారు.
గత రెండేండ్లుగా తమ సర్కార్ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, రాష్ట్రంలో ఉన్న అనువైన ఎకో సిస్టం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల రాష్ట్రం లో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ‘గ్లోబల్ జీసీసీ హబ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం టెక్నా లజీకి సంబంధించిన జీసీసీలు మాత్రమే ఏర్పాటు కావడం లేదు. అన్ని రంగాలకు చెందిన జీసీసీలను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు ఎదురు చూస్తున్నాయి. హాస్పిటాలిటీ రంగ దిగ్గజ సంస్థ మారియట్ తన మొదటి జీసీసీని ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది.”రైజింగ్ తెలంగాణ” లక్ష్య సాధనకు ప్రభుత్వం కట్టుబడు ఉంది” అని శ్రీధర్‌బాబు అన్నారు.



