– ఉన్నత ఉద్యోగాల్లో కులవివక్షపై ప్రత్యేక చట్టం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ డిమాండ్
– పూరన్‌కుమార్‌కు కొవ్వొత్తులతో నివాళి
నవతెలంగాణ – ముషీరాబాద్
హర్యానాలో పోలీసు ఉన్నతాధికారి, అడిషనల్ డిజి కె.పూరన్ కుమార్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, దానిపై స్వతంత్ర జడ్జితో విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నత ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో దళితులపై, అణగారిన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, వాటిని అరికట్టాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి పూరన్‌కుమార్‌కు జోహార్లు అర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ పాలనలో అణగారిన వర్గాలపై దాడులు తీవ్రమయ్యాయని, అమాయకులు ప్రాణం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాసంస్థలో రోహిత్ వేముల, నేడు పోలీసు శాఖలో అత్యున్నత స్థాయి అడిషనల్ డీజీ స్థాయి ఉద్యోగి ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేశారని అన్నారు. ఇది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యే అని అన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. గతంలో అనేక సందర్భాల్లో కూడా పూరన్ కులవివక్ష ఎదుర్కొన్నారని, ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో రిపోర్టు చేసినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే దేశంలో అణగారిన వర్గాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి.జావేద్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.విజరు కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.విజరు, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్, నాయకులు నాగేందర్, రజనీకాంత్, కైలాష్, భరత్, ప్రవీణ్, డీవైఎఫ్‌ఐ నాయకులు రాజు, పాటల గోపి తదితరులు పాల్గొన్నారు.
ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES