ఇజ్రాయిల్, అమెరికన్ స్థావరాలపై క్షిపణుల వర్షం
గల్ఫ్ దేశాల పైనా విరుచుకుపడిన టెహ్రాన్
లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ను అడ్డుకుంటున్న హిజ్బొల్లా
టెహ్రాన్, బీరుట్‌పై భారీగా ఇజ్రాయిల్ బాంబు దాడులు
(నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్)
మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వరుసగా ఏడో రోజు కూడా భీకర పోరు సాగింది. రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయిల్ పైకి క్షిపణులు దూసుకొచ్చాయి. దీంతో ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. అటు గల్ఫ్ దేశాలపైకూడా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. దుబాయిపై క్షిపణి దాడులు జరిగే అవకాశాలు ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. టెహ్రాన్‌పై ప్రయోగించిన రెండు డ్రోన్లను ఇరాన్ సైన్యం కూల్చివేసింది. జోర్డాన్‌లోని ఇర్బిత్ నగరంపై ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. వీటిలో అనేక డ్రోన్లను జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకొంది. రియాద్‌కు తూర్పు వైపున ఇరాన్ ప్రయోగించిన మూడు డ్రోన్లను కూల్చివేశామని సౌదీ అరేబియా చెప్పింది. కాగా ఇజ్రాయిల్ వాణిజ్య కేంద్రం టెల్ అవీవ్‌లో శుక్రవారం అనేక పేలుడు శబ్దాలు విన్పించాయి. ఇరాన్ తాజాగా ప్రయోగించిన క్షిపణులను కనుగొన్నామని ఇజ్రాయిల్ తెలిపింది.
ఇజ్రాయిల్, అమెరికా సేనల దాడిలో ఇరాన్‌లో 3,600కు పైగా నివాస గృహాలు, వాణిజ్య-సేవా కేంద్రాలు, మందుల దుకాణాలు దెబ్బతిన్నాయని రెడ్‌క్రాస్ చెప్పింది. రెడ్ క్రిసెంట్‌కు చెందిన తొమ్మిది భవనాలకు కూడా నష్టం వాటిల్లింది. మరోవైపు హెజ్బొల్లా కూడా దాడులను తీవ్రతరం చేసింది. దక్షిణ లెబనాన్‌లోని ఖియామ్ పట్టణం వైపు వస్తున్న ఇజ్రాయిల్ సైనిక వాహనాలపై దాడి చేసింది. పశ్చిమాసియాలో సైనిక, ఆర్థిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ యుద్ధం ఆర్థిక మార్కెట్లను కుదిపివేసిందని చెప్పింది. కాగా అమెరికా, ఇజ్రాయిల్‌లతో యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారిగా ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున టెహ్రాన్‌లోనూ, దేశంలోని వివిధ ప్రాంతాలలోనూ శుక్రవారం ప్రార్థనలు జరిపారు. అటు ఇజ్రాయిల్, అమెరికా సేనలు ఇరాన్‌పై దాడులను ఉధృతం చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షాన్ని కురిపించాయి. షిరాజ్ నగరంలోని నివాస ప్రాంతంపై జరిగిన దాడిలో 20 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.
సెంట్రల్ టెహ్రాన్‌లో ఇరాన్ సైన్యానికి చెందిన మిలిటరీ అకాడెమీపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఇరాన్ ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలలోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ సైన్యం కనీసం 11 వైమానిక దాడులు జరిపింది. కాగా ఇరాన్‌కు చెందిన డ్రోన్ వాహక నౌకపై అమెరికా దాడి చేసినట్లు సమాచారం. తమ సైన్యం తొలి దశ పోరులో శత్రువులను ఆశ్చర్యకరమైన దెబ్బ తీసిందని, తదుపరి దశలో మరిన్ని ఆశ్చర్యకరమైన ఘటనలు జరగబోతున్నాయని ఇజ్రాయిల్ రక్షణ దళాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ తెలిపారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, క్షిపణి లాంఛర్లను పెద్ద ఎత్తున నష్టపరిచామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్‌పై దాడులను ఉధృతం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ హెచ్చరించారు. కాగా తన సరిహద్దు ప్రాంతంలోని విమానాశ్రయాన్ని, పాఠశాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు జరపడంతో ఆ దేశం నుంచి దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తున్నామని అజర్‌బైజాన్ తెలిపింది.
200 మంది చిన్నారులు బలి
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం అనేక మంది చిన్నారుల ప్రాణాలను బలిగొంటోంది. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇరాన్‌లోనే 181 మంది చనిపోయారు. లెబనాన్‌లో ఏడుగురు, ఇజ్రాయిల్‌లో ముగ్గురు, కువైట్‌లో ఒకరు మృత్యువాత పడ్డారు.
ఇప్పుడప్పుడే భూతల దాడులు జరపం : ట్రంప్
ఇరాన్‌పై ఇప్పుడప్పుడే భూతల దాడులు జరపబోమని, దాని గురించి ఆలోచించడమే వృథా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్ సేనలు భూతల దాడులకు దిగితే వినాశనం తప్పదంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన హెచ్చరికలపై ఆయన స్పందించారు. ఇరాన్ ఇప్పటికే పూర్తిగా నష్టపోయిందని, దాని సైనిక సామర్ధ్యం బాగా బలహీనపడిందని చెప్పారు. ‘వారు తమ నౌకాదళాన్ని కోల్పోయారు. వారు కోల్పోవాల్సిందంతా ఇప్పటికే కోల్పోయారు’ అని అన్నారు.
దీర్ఘకాల యుద్ధానికి సిద్ధం : ఇరాన్
దీర్ఘకాల యుద్ధానికి ఇరాన్ పూర్తి సంసిద్ధంగా ఉన్నదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. ఇప్పటి వరకూ యుద్ధంలో వాడని అత్యాధునిక ఆయుధాలను త్వరలోనే ఉపయోగిస్తామని బ్రిగేడియర్ జనరల్ అలీ మహమ్మద్ నెయినీ చెప్పారు. తదుపరి దాడులలో ఇరాన్ శత్రువులకు ‘బాధాకరమైన ఎదురు దెబ్బలు’ తప్పవని హెచ్చరించారు.
అందులో మా సాయం లేదు : భారత్
శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై అమెరికా జరిపిన దాడికి తాము సహకరించినట్లు వచ్చిన వార్తలను భారత్ తోసిపుచ్చింది. ఇలాంటి వార్తలు నిరాధారమైనవని నౌకాదళానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా అధికారులకు కానీ, సైన్యానికి కానీ భారత్ ఎలాంటి సాయం అందించలేదని ఆయన స్పష్టం చేశారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం ఉన్న కమ్యూనికేషన్, లాజిస్టిక్ ఒప్పందాలు అలాంటి పరిస్థితులకు వర్తించబోవని అన్నారు.
కాగా పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న దేశీయ ఎగుమతిదారులకు అన్ని రకాలుగా సాయం చేస్తామని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. రోజువారీ సమీక్ష నిమిత్తం ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ బృందాన్ని ఏర్పా టు చేసిందని తెలిపారు. ఇదిలావుండగా ఖమేనీ మృతికి సంతాప సూచకంగా న్యూఢిల్లీ లోని తన రాయబార కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఇరాన్ అవనతం చేసింది. రాయబా ర కార్యాలయంలో సంతాప సమావేశాన్ని నిర్వహించింది. ఈ ప్రార్థనా సమావేశానికి ఎంపీ కపిల్ సిబల్ హాజరయ్యారు. రైసినా డైలాగ్ సందర్భంగా న్యూఢిల్లీలో శుక్రవారం ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ ఖటిబ్‌జాదెహ్ తో సమావేశమయ్యానని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు.
పార్లమెంటులో చర్చించాలి : కాంగ్రెస్ డిమాండ్
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే వారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితిపై పూర్తి స్థాయి స్వల్ప కాలిక చర్చ నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన చేసినంత మాత్రాన సరిపోదని అభిప్రాయపడింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో భారత్ అనుసరిస్తున్న ప్రస్తుత వైఖరి ఇంత బలహీనంగా ఎన్నడూ లేదని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ విమర్శించారు.
కేరళీయుల ప్రయాణ కష్టాలు తీర్చండి : పినరయి
యుద్ధం కారణంగా పశ్చిమాసియా నగరాలలో చిక్కుబడిపోయిన కేరళ వాసుల ప్రయాణ కష్టాలు తీర్చాలని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. పశ్చిమాసియా దేశాలలో ప్రవాస కేరళీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ఓ లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తెచ్చారు. ‘స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం లేక అనేక మంది ప్రవాసీలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాల నుంచి తగినన్ని విమానాలు నడవడం లేదు. దీంతో కేరళీయులు సహా వేలాది మంది భారతీయులు అక్కడే చిక్కుబడిపోయారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని విమాన సర్వీసులు పెంచేలా చూడాల్సి ఉంది’ అని గురువారం రాసిన లేఖలో పినరయి తెలిపారు.
ఇరాన్ నావికులకు శ్రీలంక ఆశ్రయం
ఇరాన్ నౌకపై అమెరికా ప్రాణాంతక టార్పెడో దాడి చేసి సముద్రంలో పేల్చివేసిన నేపథ్యంలో ఆ దేశానికే చెందిన మరో నౌకలోని సిబ్బందికి శ్రీలంక ఆపన్నహస్తం అందించింది. అమెరికా దాడి నుంచి తమను కాపాడాలంటూ 200 మంది ఇరాన్ నావికులు చేసిన అభ్యర్థనపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పించింది. ‘మా ప్రాణాలు ఎలాంటివో వారివీ అలాంటివే’ అని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే చెప్పారు. ఆపన్నుల ప్రాణాలను కాపాడడానికే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
మానవతావాద అత్యవసర పరిస్థితి : ఐరాస
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని ‘మానవతావాద అత్యవసర పరిస్థితి’గా ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థి సంస్థ ప్రకటించింది. దీనిపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది. కాగా అన్ని పక్షాలు వెనక్కి తగ్గి శాంతి స్థాపనకు అవకాశం ఇవ్వాలని ఐరాస హక్కుల చీఫ్ ఓల్కర్ టర్క్ కోరారు.



