ఇజ్రాయిల్ అణుపరిశోధనా కేంద్రం లక్ష్యంగా క్షిపణులతో దాడి అడ్డుకోలేకపోయిన రక్షణ వ్యవస్థలు
హార్ముజ్‌ను తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను నేలమట్టం చేస్తా : ట్రంప్ హెచ్చరిక
అదే జరిగితే ప్రతిదాడులు మరింత తీవ్రం : టెహ్రాన్
నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్
ఇజ్రాయిల్‌పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్‌లోని నతాంజ్‌లో ఉన్న అణు శుద్ధి కేంద్రంపై ఇజ్రాయిల్ శనివారం వైమానిక దాడి జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలోని దిమోనా, అరద్ నగరాలపై క్షిపణులను ప్రయోగించింది. దిమోనా నగరం సమీపంలో ఉన్న నెగెవ్ ఎడారిలో ఇజ్రాయిల్ అణు పరిశోధనా కేంద్రం ఉంది. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకోలేకపోయామని ఇజ్రాయిల్ అంగీకరించింది. అణు కేంద్రం సమీప ప్రాంతంలోని ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని ఇరాన్ క్షిపణులు పడడం ఇదే మొదటిసారి. ‘అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ ఉన్న దిమోనా ప్రాంతంలో మా క్షిపణులను ఇజ్రాయిల్ అడ్డుకోలేకపోయింది.
యుద్ధం సరికొత్త దశలో ప్రవేశించిందని చెప్పడానికి ఇది సంకేతం’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఘలిబాఫ్ వ్యాఖ్యానించారు. దాడి నేపథ్యంలో ఘటనా స్థలానికి అత్యవసర సిబ్బందిని పంపామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. ‘ఇది చాలా క్లిష్టతరమైన సాయంత్రం’ అని ఆయన అన్నారు. ఇరాన్‌పై దాడులు ఆగబోవని, వాటిని కొనసాగిస్తామని హెచ్చరించారు. అరద్‌పై నేరుగా క్షిపణి పడడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, కనీసం పది అపార్ట్‌మెంట్ భవనాలు దెబ్బ తిన్నాయని, వాటిలో మూడు భవనాలు బాగా ధ్వంస మయ్యాయని, అవి కూలిపోయేలా ఉన్నాయని సహాయ సిబ్బంది తెలిపారు. దాడిలో గాయపడిన 64 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. సుమారు రెండు వందల కుటుం బాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అరద్ మేయర్ మాయన్ తెలిపారు.
ఇజ్రాయిల్ గగనతలానికి ఇక రక్షణ లేదు : ఇరాన్
దిమోనాపై జరిగిన దాడితో ఇజ్రాయిల్ గగనతలానికి ఇకపై రక్షణ లేకుండా పోయిందని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఆక్రమిత ప్రాంతాలపై తమ క్షిపణులు ఆధిపత్యం ప్రదర్శించాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ ఏరోస్పేస్ దళం అధిపతి మేజర్ జనరల్ సెయెద్ మజీద్ మూసావీ చెప్పారు. ఇజ్రాయిల్ గగనతలంపై తాము జరపబోయే దాడులతో శత్రు దేశాల నోట మాట రాదని అన్నారు. కాగా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా జరిపిన తాజా దాడులలో వందలాది మంది చనిపోవడమో లేదా గాయపడడమో జరిగిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. ఆక్రమిత భూభాగాలలోని దక్షిణ, ఉత్తర భాగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపామని చెప్పింది.
సమాచారం లేదన్న ఐఏఈ
ఇజ్రాయిల్ అణు పరిశోధనా కేంద్రానికి పశ్చిమంగా 20 కిలోమీటర్ల దూరంలో దిమోనా నగరం, ఉత్తరంగా 35 కిలోమీటర్ల దూరంలో అరద్ నగరం ఉన్నాయి. మధ్య ప్రాచ్యంలో అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయిల్. అయితే ఈ విషయాన్ని ఇజ్రాయిల్ నేతలు ధృవీకరించడం కానీ, తోసిపుచ్చడం కానీ చేయడం లేదు. అణు కేంద్రానికి జరిగిన నష్టంపై, లేదా రేడియో ధార్మిక పదార్థాల విడుదలపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈ) తెలియజేసింది.
మా విద్యుత్ ప్లాంట్ల జోలికి వస్తే మా దాడులు మరింత తీవ్రమవుతాయి : అమెరికాను హెచ్చరించిన టెహ్రాన్
అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న ఉగ్రవాద, సైబర్ దాడుల కారణంగా తమ జల, ఇంధన మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం జరిగిందని ఇరాన్ ఇంధన శాఖ మంత్రి అబ్బాస్ అలియాబది చెప్పారు. జల ట్రాన్స్‌మిషన్-ట్రీట్‌మెంట్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయని, ఈ దాడులలో కీలక నీటి సరఫరా వ్యవస్థలకు నష్టం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కాగా గల్ఫ్‌లో నౌకల రవాణాకు సహకరిస్తామని ఐరాస సముద్రయాన సంస్థలో ఇరాన్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అలీ మౌసావీ తెలిపారు.
‘ఇరాన్ శత్రువుల’కు చెందిన నౌకలకు మినహా మిగిలిన వాటన్నింటికీ హర్మూజ్ జలసంధి తెరిచే ఉన్నదని ఆయన చెప్పారు. భద్రత, రక్షణ ఏర్పాట్లపై ఇరాన్‌తో సమన్వయం చేసుకుంటే జలసంధి మీదుగా ప్రయాణించవచ్చునని అన్నారు. హర్మూజ్ జలసంధిని 48 గంటలలో తెరవని పక్షంలో ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను నేలమట్టం చేస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై సైనిక ఆపరేషనల్ కమాండ్ తీవ్రంగా స్పందించింది. తమ విద్యుత్ ప్లాంట్ల జోలికి వస్తే మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన ఇంధన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సముద్రపు నీటిలోని లవణాల నిర్మూలనకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది.
బాగ్దాద్‌లోని అమెరికా సెంటర్‌పై ఎనిమిది దాడులు
ఇరాన్ వైపు నుంచి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నదని ఇజ్రాయిల్ సైన్యం ప్రజలను హెచ్చరించింది. జెరుసలేంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. గగనతల దాడులు జరగవచ్చునంటూ నగరమంతటా సైరన్లు మోగించారు. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న అమెరికా దౌత్య-లాజిస్టిక్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని శనివారం రాత్రి ఎనిమిది దాడులు జరిగాయి. కొన్ని రాకెట్లు విమానాశ్రయం సమీపంలో పడ్డాయని ఇరాక్ భద్రతాధికారి ఒకరు చెప్పారు. విమానాశ్రయం సమీపంలో పోలీసులు ఓ రాకెట్ లాంఛర్‌ను గుర్తించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి విమానాశ్రయంలోని అమెరికా కేంద్రంపై అనేక దాడులు జరిగాయి. ఇరాక్‌లో అమెరికా ఆస్తులపై దాడులు జరుపుతున్నది తామేనని ఇరాన్ అనుకూల సాయుధ గ్రూపులు చెబుతున్నాయి.
హార్ముజ్ సమీపంలో బ్రిటన్ అణు జలాంతర్గామి
హర్మూజ్ జలసంధిని 48 గంటలలో తెరవని పక్షంలో ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లను నేలమట్టం చేస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికతో పశ్చిమాసియా లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఎలాంటి బెదిరింపులకు పాల్పడకుండా జలసంధిని పూర్తిగా తెరవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఇదిలావుండగా తోమహాక్ క్షిపణులతో కూడిన బ్రిటన్ అణు జలాంతర్గామి హెచ్‌ఎంఎస్ అన్సన్ హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఉత్తర అరేబియా సముద్రానికి చేరుకుంది. ఈ జలాంతర్గామి ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి ఈ నెల 6వ తేదీన బయలు దేరింది.
ఇంధన సరఫరాలకు సాయపడతాం : జీ-7
అంతర్జాతీయ ఇంధన సరఫరాలకు భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాలతో కూడిన జీ-7 తెలిపింది. హర్మూజ్ జలసంధి సహా సముద్రయాన మార్గాలలో నౌకల రవాణాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పింది. ఈ మేరకు జీ-7 దేశాల విదేశాంగ మంత్రులు, యూరోపియన్ యూనియన్ సీనియర్ దౌత్యవేత్తలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దాడులను వెంటనే నిలిపివేయాలని వారు ఇరాన్‌కు విజ్ఞప్తి చేశారు.



