హిజ్బొల్లాతో కలిసి మూకుమ్మడిగా ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడులు
అమెరికా, గ్రీస్ నౌకలను సూసైడ్ బోటుతో ఢీకొన్న ఇరాన్
మా షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తాం : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
హార్ముజ్‌లో భారత నౌకలకు టెహ్రాన్ గ్రీన్‌సిగ్నల్
వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేస్తున్న ప్రపంచ దేశాలు
నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్
అగ్నికి ఆజ్యం తోడైంది. నిన్నటి వరకూ ఇజ్రాయిల్‌పై ఒంటరిగా పోరాడిన ఇరాన్‌కు ఇప్పుడు హిజ్బొల్లా స్నేహహస్తం చాచింది. ఇరాన్, హిజ్బొల్లా కలిసి ఇజ్రాయిల్‌పై వందకు పైగా రాకెట్లను ప్రయోగించాయి. దీంతో హైఫా, అక్రే తదితర నగరాలతో పాటు ఇజ్రాయిల్ ఉత్తర భాగంలో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దూసుకొస్తున్న రాకెట్లను చూస్తూ ప్రజలు భయంతో షెల్టర్ల వైపు పరుగులు తీశారు. లెబనాన్ వైపు నుంచి నజరేత్ నగరంపై పడుతున్న రాకెట్లను ఇజ్రాయిల్ క్షిపణి రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకోవడంతో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే హిజ్బొల్లా ఉత్తర ఇజ్రాయిల్‌పై 150కి పైగా రాకెట్లు ప్రయోగించింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్, హిజ్బొల్లాలు సమన్వయంతో ఇజ్రాయిల్‌పై దాడులు చేయడం ఇదే మొదటిసారి. ఇజ్రాయిల్, హిజ్బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. హెజ్బొల్లా వైపు నుంచి రాకెట్ దాడులు ఉధృతం కావడంతో ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. సెంట్రల్ ఇజ్రాయిల్‌పై కూడా రాకెట్ దాడులు జరిగాయి. టెల్ అవీవ్, జెరుసలేం తదితర ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగించారు. ఇజ్రాయిల్ కూడా లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై దాడులు చేసింది.
నౌకలపై ఇరాన్ దాడులు : భారతీయుడి మృతి
అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలపై దాడులను ఇరాన్ ఉధృతం చేసింది. తాజాగా ఇరాక్ ప్రాదేశిక జలాలలోని ఖొర్ అల్ జుబైర్ ఓడరేవు సమీపంలో రెండు నౌకలపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడికి గురైన ఈ నౌకలను అమెరికాకు చెందిన సేఫ్‌సీ విష్ణు, గ్రీస్‌కు చెందిన జెఫిరోస్‌గా గుర్తించారు. ఈ నౌకలు సముద్ర తీరంలో చమురును నింపుకుంటుండగా పేలుడు పదార్థాలతో ఉన్న ఇరాన్ ‘సూసైడ్ బోటు’ వాటిని ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే నౌకలలో ఉన్న 38 మంది సిబ్బందిని సహాయక బృందం కాపాడింది. సేఫ్‌సీ విష్ణు నౌకపై జరిగిన దాడిలో చనిపోయిన భారతీయుడి వివరాలు తెలియరాలేదు. ఈ దాడి చేసింది తానేనని ఇరాన్ ప్రకటించింది.
కాలిఫోర్నియాపై ఇరాన్ దాడులు : ఎఫ్‌బీఐ హెచ్చరిక
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగవచ్చునని, అమెరికా పశ్చిమ తీరాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులు జరపవచ్చునని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కాలిఫోర్నియాలోని పోలీసు విభాగాన్ని హెచ్చరించింది. అమెరికా తీరంలో ఉన్న ఓ నౌక నుంచి డ్రోన్ దాడులు చేయాలని ఇరాన్ యోచిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. కాలిఫోర్నియాలోని లక్ష్యాలపై అనూహ్య దాడులు జరపాలని ఇరాన్ అనుకుంటోందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఈ హెచ్చరిక పై తాను ఆందోళన చెందడం లేదని ట్రంప్ చెప్పారు.
నాటి డ్రోన్ దాడిలో అమెరికాకు తీవ్ర నష్టం
యుద్ధ ప్రారంభ సమయంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు చనిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో అమెరికా దళాలకు తీవ్ర నష్టం జరిగిందని తాజాగా సమాచారం అందింది. సీబీఎస్ న్యూస్ అందజేసిన సమాచారం ప్రకారం కువైట్‌లో జరిగిన ఆ దాడిలో అనేక మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. 30 మందికి పైగా సైనికులు ఆస్పత్రుల పాలయ్యారు. ఒక సైనికుడు శాన్ ఆంటోనియోలోని బ్రూక్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందాడు.
వాషింగ్టన్ డీసీ సమీపంలోని వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌లో 12 మందికి చికిత్స అందించారు. జర్మనీలోని లాండ్స్‌తుహ్ రీజనల్ మెడికల్ సెంటర్‌లో 12 మంది చికిత్స పొందుతున్నారు. కొందరికి మెదడులో గాయాలయ్యాయి. కువైట్ నగరం వెలుపల ఉన్న షుఐబా పోర్టులోని వ్యూహాత్మక ఆపరేషన్స్ సెంటర్‌పై ఈ నెల 1న దాడి జరిగింది. దట్టంగా పొగలు అలముకోవడంతో భవనంలో చిక్కుబడిన వారిని బయటికి తీసుకురావడం కష్టమైంది. తీవ్రంగా గాయపడిన 20 మందిని సైనిక రవాణా విమానంలో ఆండ్స్‌తుహ్ కు తరలించగా అక్కడ వంద మందికి పైగా వైద్య సిబ్బంది వారికి చికిత్స అందించారు.
యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ షరతులు
తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ తిప్పికొట్టింది. యుద్ధం ముగింపుపై నిర్ణయం తీసుకోవాల్సింది తానేనని తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని, నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగకుండా అంతర్జాతీయ సమాజం హామీ ఇవ్వాలని, అప్పుడే యుద్ధాన్ని ముగిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రష్యా, పాకిస్తాన్ నేతలతో టెలిఫోన్ చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ పోస్ట్ పెట్టారు.
మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు తాము కట్టుబడి ఉన్నామని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే తమ డిమాండ్లను అమెరికా, ఇజ్రాయిల్ నెరవేర్చినప్పుడే యుద్ధం ముగుస్తుందని అన్నారు. దాడులు ప్రారంభించింది ఆ రెండు దేశాలేనని, కాబట్టి స్పష్టమైన హామీలు లభిస్తేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇరాన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు కన్పించడం లేదు. ‘పని పూర్తి చేయాలని’ అమెరికా కృతనిశ్చయంతో ఉన్నదని ట్రంప్ తెలిపారు. యుద్ధంలో సమర్ధవంతంగా విజయాన్ని సాధించామని, అయినప్పటికీ సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేస్తున్న దేశాలు
1970 తర్వాత తొలిసారిగా ఎదురైన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తమ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సూచించిన నేపథ్యం లో బ్యారల్‌కు 200 డాలర్ల చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. కాగా తన వద్ద ఉన్న నిల్వలలో 172 మిలియన్ బ్యారల్స్ చమురును విడుదల చేస్తామని అమెరికా తెలిపింది. ఐఈఏ కూడా తన వద్ద ఉన్న అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారల్స్ చమురును విడుదల చేయబోతోంది. ఐఏఈలోని 32 సభ్య దేశాలు ఇందుకు మద్దతు తెలిపాయి. ఐఏఈ సభ్య దేశాల వద్ద ప్రస్తుతం 1.2 బిలియన్ బ్యారల్స్‌కు పైగా చమురు నిల్వలు ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత అనేక దేశాలు అత్యవసర అవసరాల నిమిత్తం చమురును నిల్వ చేసుకున్నాయి.
భారత్ నౌకలను అనుమతించిన ఇరాన్
ఇంధన సంక్షోభ సమయంలో భారత్‌కు పెద్ద ఊరట లభించింది. భారత్ పతాకంతో ఉన్న నౌకలు హర్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతించింది. భారత్, ఇరాన్ విదేశాంగ మంత్రులు జైశంకర్, అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ ఫలితంగా మన దేశానికి ఈ ఉపశమనం దక్కింది. దీంతో పుష్పక్, పరిమళ్ అనే రెండు భారతీయ నౌకలు క్షేమంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. ఇదిలావుండగా లైబీరియా పతాకంతో ఉన్న చమురు నౌక ముంబయి ఓడరేవుకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని రాస్ తనురా ఓడరేవులో అది చమురును నింపుకుంది.
ప్రతీకారం తీర్చుకుంటాం
గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు తక్షణం మూసివేయాలి
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
పొరుగు దేశాలతో స్నేహాన్ని కోరుకుంటామని ప్రకటన
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ తొలిసారి స్పందించారు. శత్రువులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని తెలిపారు. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, వాటిని తక్షణమే మూసివేయాలని హెచ్చరించారు. మినాబ్ పాఠశాలపై దాడి సహా ఆయా ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
ఈ మేరకు సుప్రీం లీడర్ తన ప్రకటనను అధికారిక మీడియాలో ప్రసారం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహాన్ని ఇరాన్ విశ్వసిస్తుందని, అయినా అక్కడి అమెరికా స్థావరాలపై మాత్రం దాడులు కొనసాగుతాయని ఖమేనీ చెప్పారు. కష్టకాలంలో తమ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారంటూ ప్రశంసించారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగు పర్చుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. దాడుల్లో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించటంతోపాటు బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
హార్ముజ్‌లో తీవ్రమైన పోరు
హార్ముజ్ జలసంధిలో చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలోకి అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలు ప్రవేశిస్తే సముద్రపు మందుపాతరలతో పేల్చివేసేందుకు ఇరాన్ సిద్ధపడింది. మందుపాతరలు అమర్చేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంచిన నౌకలపై అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా గల్ఫ్ జలాలలో ఉన్న మూడు రవాణా నౌకలపై దాడి చేసింది.



