Monday, March 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ సుప్రీం ఖమేనీ హత్య

ఇరాన్‌ సుప్రీం ఖమేనీ హత్య

- Advertisement -

అమెరికా – ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం
మొత్తం 201 మంది మృతి
‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ట్రంప్‌
ఫోటోలు విడుదల చేసిన వైట్‌హౌస్‌
మధ్యప్రాచ్యంలో భయం..భయం
దాడుల్ని ఖండించిన రష్యా, చైనా

అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఆయన కూతురు, అల్లుడు, మనుమరాలు సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ దాడిలో మృతి చెందారు. ఇరాన్‌ రక్షణశాఖ మంత్రి అజీజ్‌ నసీర్జాదే కూడా అసువులుబాసారు. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో ఇజ్రాయిల్‌-అమెరికా సంయుక్తంగా ఈ దాడుల్ని నిర్వహించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వైట్‌ హౌస్‌ విడుదల చేసింది.

ఖమేనీ మరణాన్ని తొలుత ట్రంప్‌ ధృవీకరించి, ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్‌ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమని ఇరాన్‌ సైన్యం స్పష్టం చేసింది. తమ నేత మరణించిన వార్త తెలియగానే ఇరాన్‌ సైన్యం పెద్దఎత్తున పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. దుబాయ్ లోని అమెరికన్‌ సైనిక స్థావరం బాగా దెబ్బతింది. ఇజ్రాయిల్‌-అమెరికా చర్యను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. ఇరాన్‌లో పాలనను మార్చే బాధ్యత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ది కాదని స్పష్టంచేశాయి.

ఖమేనీ మరణం సందర్భంగా ఇరాన్‌లో 40రోజుల సంతాపదినాలు పాటిస్తున్నట్టు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు చర్చలని ఇరాన్‌ను ఆహ్వానించి, మరోవైపు ఆ దేశంపై దాడులు చేయడాన్ని ప్రపంచదేశాలు సమర్థించలేకపోతున్నాయి. అనేక దేశాలు అమెరికా ఒత్తిళ్లకు భయపడి బహిరంగంగా వ్యాఖ్యలు చేసేందుకు సాహసించట్లేదు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతిపై ఇప్పటి వరకు స్పందించలేదు. దాడులకు రెండ్రోజుల ముందు మోడీ ఇజ్రాయిల్‌లో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే.

టెహ్రాన్‌: ఇజ్రాయిల్‌, అమెరికా కలిసి పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చాయి. శనివారం ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి ఇజ్రాయిల్‌-అమెరికా దేశాలు సంయుక్తంగా దాడులకు తెగబడ్డాయి. ఖమేనీతో పాటు పలువులు ఈ దాడుల్లో మరణించారు. ఖమేనీ మృతికి సంబంధించి ఆ దేశ సీనియర్‌ అధికారులకు స్పష్టమైన సమాచారం అందడంతో శిథిలాల కింది నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను ట్రంప్‌, నెతన్యాహు చూశారని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో ఇరాన్‌ రక్షణ మంత్రి అజీజ్‌ నాసిర్జాదే, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ కమాండర్‌ మహ్మద్‌ పక్పూర్‌, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ అబ్దోల్‌ రహీమ్‌ మౌసావి కూడా మరణించారని ప్రకటించారు. ఈ దాడుల్లో 201 మంది మతిచెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్‌-అమెరికా దేశాలు ఇరాన్‌లోని పాఠశాలలు, కార్మిక నివాసభవనాలపై కూడా మిస్సైల్స్‌ ద్వారా దాడులు చేశాయి. దీనితో పలువురు చిన్నారులు, బాలికలు, మహిళలు, కార్మికులు మరణించారు.

ఇరాన్‌ ప్రతిదాడులు
ఆపరేషన్‌ తొలిరోజే ఖమేనీ మృతిచెందినప్పటికీ పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరుతో ఇరాన్‌ ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్‌ అంతటా యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సైరన్లతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. ఇజ్రాయిల్‌-అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ బాంబులు, ఆత్మాహుతి దాడులతో యుద్ధాన్ని తీవ్రం చేసింది. దీనితో ఆయా దేశాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ప్రాధమిక సమాచారం మేరకు 9 మంది ఇజ్రాయిల్‌ పౌరులతో పాటు ముగ్గురు యూఎస్‌ సైనికులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది.

అనేకమంది క్షతగాత్రులు అయ్యారు. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ మంత్రివర్గం ప్రకటించింది. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని హెచ్చరించింది. ఇజ్రాయిల్‌, యూఎస్‌ స్థావరాలే లక్ష్యంగా భారీ ఆపరేషన్‌ చేపట్టేందుకు ఐఆర్‌జీసీ సిద్ధమైనట్టు అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు అమెరికా- ఇజ్రాయిల్‌ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీతో పాటు ఐఆర్‌జీసీ చీఫ్‌ మహమ్మద్‌ పాక్‌పౌర్‌ ప్రాణాలు కోల్పోయారని తాజాగా ఇరాన్‌ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఐఆర్‌జీసీ తన కొత్త కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా మాజీ రక్షణ మంత్రి అహ్మద్‌ వాహిదీకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రత్యక్ష వ్యూహకర్త ట్రంప్‌
ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా పర్యవేక్షించారు. సాధారణంగా హైవేల్యూ టార్గెట్లపై జరిగే దాడులే అమెరికా అధ్యక్షుడి కనుసన్నల్లో జరుగుతాయి. తాజాగా ట్రంప్‌ పర్యవేక్షణకు సంబంధించిన చిత్రాలను శ్వేతసౌధం విడుదల చేసింది. ఫ్లొరిడాలోని పామ్‌బీచ్‌లోని ట్రంప్‌ స్వగృహం మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో ఆయన ఈ టార్గెట్లపై రివ్యూ చేస్తున్న ఫోటోలను వైట్‌హౌజ్‌ విడుదల చేసింది. ఆ సమావేశంలో ట్రంప్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్మీ కీలక జనరల్స్‌ సుసీ విల్లీస్‌, డాన్‌ కెయిన్‌ తదితరులు ఉన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా వార్‌ రూమ్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న చిత్రాన్ని శ్వేతసౌధం పోస్టు చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు సౌదీ, ఇజ్రాయిల్‌ సహా ఇతర గల్ఫ్‌ నేతలతో కూడా టచ్‌లో ఉన్నట్టు వెల్లడించింది. అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరి’ తోపాటే ఇజ్రాయిల్‌ కూడా ‘ఆపరేషన్‌ రోర్‌ ఆఫ్‌ ది లయన్‌’ చేపట్టిన విషయం తెలిసిందే.

పతనం వైపు అమెరికా : ఖమేనీ చివరి ప్రసంగం
అమెరికా, ఇజ్రాయిల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ చివరి సారిగా ప్రసంగించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 17న ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను ఏమీ చేయలేరని అన్నారు. అమెరికా పతనం వైపు వెళ్తోందన్నారు. ”అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది. విధానాలు, వివిధ సమస్యలతో ఆ దేశం సతమతమవుతోంది. 50శాతానికి పైగా అమెరికా పౌరులు ప్రస్తుత అధ్యక్షుడిని ఆమోదించడం లేదు. ఇరాన్‌ను రూపు మాపాలని వాళ్లు అనుకుంటున్నారు. వారి ప్రయత్నాలను అడ్డుకుం టూనే ఉన్నాం. 47ఏండ్లుగా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ను ఏమీ చేయలేకపోయామని స్వయంగా అమెరికా అధ్యక్షుడే వారి ప్రజలకు చెబుతున్నారు. అది నిజమే. ఇప్పుడు కూడా వాళ్లు ఏమీ చేయలేరు” అని ఖమేనీ ఆ సమావేశంలో పేర్కొన్నారు.

దాడుల్ని ముమ్మరం చేసిన ఇజ్రాయిల్‌-అమెరికా
అమెరికా-ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై సంయుక్తదాడుల్ని ముమ్మరం చేశాయి. గతానికి భిన్నంగా ఈసారి పగటి వెలుగులోనే అమెరికా దాడులకు దిగింది. నివాస భవనాలపై క్షిపణులతో దాడులు చేస్తోంది. ఇరాన్‌లో కూడా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -