93 పరుగుల తేడాతో ఘన విజయం
నాగ్‌పూర్ (మహారాష్ట్ర) : దేశవాళీ క్రికెట్ సర్క్యూట్‌లో తనదైన సత్తా చాటుతున్న విదర్భ ముచ్చటగా మూడోసారి ఇరానీ కప్ విజేతగా నిలిచింది. నాగ్‌పూర్‌లో జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాపై 93 పరుగుల తేడాతో విదర్భ ఘన విజయం సాధించింది. 361 పరుగుల ఛేదనలో రెస్టాఫ్ ఇండియా 73.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (92, 117 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), మానవ్ సుథర్ (56 నాటౌట్, 113 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (35, 65 బంతుల్లో 3 ఫోర్లు) పోరాడినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. విదర్బ పేసర్ హర్ష్ దూబె (4/73), ఆదిత్య ఠాకరే (2/27), యశ్ ఠాకూర్ (2/47) వికెట్ల వేటలో రాణించారు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 342/10 పరుగులు చేయగా.. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 214/10 పరుగులు చేసింది. విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగులు చేసింది. సెంచరీతో చెలరేగిన విదర్భ బ్యాటర్ ఆథర్వ తైడె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.