విమానంలోని ఖాళీ సీట్లపై మరణించినవారి ఫొటోలు, వస్తువులు
శాంతి చర్చలకు ముందు భావోద్వేగ సందేశం
టెహ్రాన్ : విమానంలో తీసిన ఒక చిత్రం ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇస్లామాబాద్ కేంద్రంగా అమెరికా-ఇరాన్ మధ్య జరగనున్న కీలకమైన శాంతి చర్చల నేపథ్యంలో ఇది ఒక బలమైన సందేశాన్ని ఇస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన వెళ్తున్న విమానంలోని ఖాళీ సీట్లపై మినాబ్ పాఠశాలపై అమెరికా జరిపిన దాడిలో మరణించిన పిల్లలు, సిబ్బంది ఫొటోలు, వారి వ్యక్తిగత వస్తువులు, రక్తంతో తడిసిన బ్యాగులను, పుష్పాలను ఉంచారు. ఘాలిబాఫ్ ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.
” నా ప్రయాణంలో తోడుగా ఉన్న వారు.. మినాబ్ 168” అని పేర్కొన్నారు. అయితే ఇది మినాబ్ పాఠశాలపై జరిగిన దాడిలో మరణించిన పిల్లలు, సిబ్బందిని సూచించే సంకేతం. ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) స్థావరాలే లక్ష్యంగా అమెరికా దాడులు జరపగా.. మినాబ్‌లోని ఓ పాఠశాలను అమెరికాకు చెందిన క్షిపణి తాకింది. ఈ దాడిలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు మరణించగా.. వంద మందికి పైగా గాయ పడ్డారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం చర్చలలో ఇరాన్ తన వైఖరిని బలపర్చడానికి ప్రధాన అంశంగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు.
మంచి ఉద్దేశాలు ఉన్నా.. విశ్వాసం లేదు : ఇరాన్
ఇస్లామాబాద్‌కు చేరుకున్న తర్వాత ఘాలిబాఫ్ మాట్లాడుతూ… తమకు మంచి ఉద్దేశాలే ఉన్నా.. అమెరికాపై విశ్వాసం లేదని చెప్పారు. గతంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని, అమెరికా ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. అమెరికా నిజాయితీగా చర్చలకు సిద్ధమైతే.. ఇరాన్ కూడా ఒప్పందానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అలా కాదని మోసపూరిత చర్యలు జరిగితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు.



