Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధరణి దోపిడీపై ఉక్కుపాదం

ధరణి దోపిడీపై ఉక్కుపాదం

- Advertisement -

తీగలాగితే డొంక కదిలిన వ్యవహారం
అక్రమాలపై కఠినచర్యలు తప్పవు : కోడ్‌ ఆడిట్‌కు మంత్రి పొంగులేటి ఆదేశం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తీగ లాగితే డొంక కదిలినట్టుగా ధరణి పోర్టల్‌ వ్యవహారం ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించాల్సిన వ్యవస్థనే గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ధరణి అక్రమాలపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కొల్లగొట్టిన సంఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపిస్తే దిగ్బ్రాంతికరమైన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదనీ, వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని చెప్పారు. బుధవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతస్ధాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు ధరణి పోర్టల్‌ సెక్యూరిటీ ఆడిట్‌ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగానే ఉన్నట్టుగా నివేదిక ఇచ్చారనీ, మానవ ప్రమేయంతో తప్పులు చేసేలా పోర్టల్‌ను రూపొందించారని అన్నారు. భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న వాటి సమాచారం లభించకుండా లాగిన్‌లు డిలిట్‌ చేశారని చెప్పారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్‌ వివరాలు లేకుండాపోయాయని ఉన్నతస్థాయి కమిటీ విచారణలో ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూలావాదేవీల సమాచారం లభించకుండా చేశారని చెప్పారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కోడ్‌ ఆడిట్‌ నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందన్నారు. ఈ నేపధ్యంలో తక్షణమే ధరణి పోర్టల్‌పై కోడ్‌ ఆడిట్‌ నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతను టెర్రాసిస్‌ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించామన్నారు.

తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ధరణి లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కొల్లగొట్టిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. తప్పుచేసినవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ, ప్రభుత్వానికి రావాల్సిన ప్రతిపైసాను వసూలు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా ఏ చిన్న లోపానికి తావులేకుండా అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా భూభారతి పోర్టల్‌ను నిర్వహించాలని సూచించారు.

ప్రజల భూముల విషయంలో ఎలాంటి రాజీ పడబోమనీ, ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామనీ, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, సీఎంఆర్‌వో మందా మకరంద్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డీఐజీ సుభాష్‌, ఎస్‌బి ఎస్‌పీ సింధు శర్మ, సైబర్‌క్రైమ్‌ డీఎస్పీ ఎ సంపత్‌, హోంశాఖ సలహాదారు పి శరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -