Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅక్రమ మద్యం, డ్రగ్స్‌, గంజాయి, రవాణాపై ఉక్కు పాదం : జూపల్లి కృష్ణారావు

అక్రమ మద్యం, డ్రగ్స్‌, గంజాయి, రవాణాపై ఉక్కు పాదం : జూపల్లి కృష్ణారావు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో అబ్కారీ, ఎస్టీఎఫ్‌ అండ్‌ డీటీఎఫ్‌ , ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల పనితీరుపై మంత్రి సమీక్షించారు. అక్రమ, కల్తీ మద్యం, కల్తీ కల్లు, డ్రగ్స్‌, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, చర్లపల్లి ప్యాక్టరీలో డ్రగ్స్‌ ముడి సరుకు తయారీ, ఎన్డీపీఎస్‌ కేసుల పురోగతి, శిక్షల రేషియో, పాత నేరస్తుల, నిందితులపై నిఘా, తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంపై ఉక్కు పాదం మోపాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయంతో పాటు వీటితో సంబంధం ఉన్న కింగ్‌ పిన్లను గుర్తించి వారిని పిడి యాక్టు కింద అరెస్టు చేయాలని చెప్పారు. యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న మత్తు పదార్ధాల విక్రయానికి అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

డ్రగ్స్‌, సింథటిక్‌ డ్రగ్స్‌, గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా, కల్తీ కల్లు తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారనీ, ప్రజల ప్రాణాలు తీసేవి ఇక రాష్ట్రంలో కనిపించొద్దని సూచించారు. వాటిపై నిఘా పెట్టటంతోపాటు విస్తృత తనిఖీలను చేపట్టాలన్నారు. మరింత అప్రమత్తతో పని చేయాలని దిశానిర్ధేశం చేశారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల చెక్‌ పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. నిఘాను చెక్కు పోస్టులకే పరిమితం కాకుండా ఆయా గ్రామాల్లోని ఇతర మార్గాలు, సోర్సులపై కూడా నిఘాను ముమ్మరం చేసి దీనిలో భాగస్వాములైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చర్లపల్లిలోని ఓ ప్యాకర్టీలో డ్రగ్స్‌ ముడి సరుకు తయారీ కేసులో పురోగతి, ఎక్సైజ్‌ శాఖ తనిఖీ, బయటపడ్డ అంశాలపై ఇచ్చిన నివేదిక గురించి మంత్రి ఆరా తీశారు. సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, కమిష నర్‌ సి.హరి కిరణ్‌, ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం, అడిషనర్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషీ, అన్ని జిల్లాల డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ఎస్టీఎఫ్‌, డీటీఎఫ్‌ టీమ్స్‌ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -