Tuesday, May 6, 2025
Homeరాష్ట్రీయంతెలుగు వర్సిటీపీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలు!

తెలుగు వర్సిటీపీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలు!

- Advertisement -

అనర్హులను ఎంపిక చేసిన వైనం
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగికి రెగ్యులర్‌ సీటు
అర్హులకు అన్యాయం చేసిన అధికారులు
ఆందోళనలో విద్యార్థులు
విచారణ జరపాలంటున్న విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (ఎస్‌పీటీయూ) పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగినట్టు పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. అనర్హులకు పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించినట్టు తెలుస్తున్నది. ఓ ప్రభుత్వ ఉద్యోగి (సరిత మహేశ్వరం)కి నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్‌ ప్రాతిపదికన సీటు ఇచ్చేందుకు ఎంపిక చేయడం వివాదానికి దారితీసింది. ఆ ఉద్యోగికి ఎంఫిల్‌, నెట్‌ వంటి అర్హతలు కూడా లేవు. ఇంకోవైపు ప్రవేశ పరీక్షలో ఆ ఉద్యోగికి 41 మార్కులే వచ్చాయి. ఆమె కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని పక్కనపెట్టి ఆమెను ఎంపిక చేయడంలో ఆంతర్యమేంటన్నది తెలియాల్సి ఉన్నది. ఆమె బీసీ మహిళ కాబట్టి ఎంపిక చేశామంటూ వర్సిటీ అధికారులు బుకాయిస్తున్నారు. అయితే ఆమె కంటే ఐదుగురు బీసీ మహిళలు ఎక్కువ మార్కులను సాధించారు. అయినప్పటికీ ఆ ఉద్యోగినే ఎంపిక చేయడం గమనార్హం. ఆ ఉద్యోగి పనిచేస్తున్న తెలుగు అకాడమి నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాలి. కానీ ఆమె ఎన్‌వోసీని సమర్పించలేదని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నందున పార్ట్‌టైం కింద పీహెచ్‌డీ ప్రవేశానికి ఆమెను ఎంపిక చేయాలి. కానీ రెగ్యులర్‌ ప్రాతిపదికన సీటు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటనల ఆధారంగా తెలుగు విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగినట్టు స్పష్టమవుతున్నది.
గుట్టుగా నోటిఫికేషన్‌ జారీ
తెలుగు విశ్వవిద్యాలయంలో రెగ్యులర్‌ ప్రాతిపదికన 2023-24 విద్యాసంవత్సరంలో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ ఏడాది జనవరి 30న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రముఖ దినపత్రికల్లో ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా ఎవరికీ అందుబాటులో లేని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పొందుపర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఫిబ్రవరి పదో తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఎన్ని పీహెచ్‌డీ సీట్లకు ప్రవేశాలను కల్పిస్తారో, ఏయే రిజర్వేషన్ల వారికి ఎన్ని సీట్లు ఉన్నాయో ప్రకటించలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి రశీదు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. హాల్‌టికెట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచలేదు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు విద్యార్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేశారు. పీహెచ్‌డీ పరీక్షను సరైన పద్ధతిలో నిర్వహించలేదు. ఓఎంఆర్‌ కూడా పాతది ఇచ్చారు. వంద మార్కుల ప్రశ్నాపత్రం ఇవ్వాల్సి ఉంటే 50 మార్కులకే ఇచ్చారు. మిగతా 50 మార్కుల గడులను కొట్టేశారు. ఇదేంటని విద్యార్థులు ఇన్విజిలేటర్లను ప్రశ్నిస్తే కొట్టేసిన ఆ 50 గడులను కూడా నింపాలని సమాధానమిచ్చారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అంతా అస్తవ్యస్తంగా సాగింది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.
ప్రాస్పెక్టస్‌కు భిన్నంగా ఎంపిక
ఈ ఏడాది మార్చి 17 నుంచి 20వ తేదీ వరకు పీహెచ్‌డీ ప్రవేశాలకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. అది కూడా విద్యార్థుల ప్రతిభను పరీక్షించలేదు. గతనెల 15న తాత్కాలికంగా ఎంపికైన విద్యార్థుల జాబితాను తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రాస్పెక్టస్‌కు భిన్నంగా ఎంపిక చేయడం పలు విమర్శలకు తావిచ్చింది. ఆ ప్రాస్పెక్టస్‌లో జాతీయ స్థాయిలో ఫెలోషిప్‌నకు ఎంపికైన వారు, యూజీసీ నెట్‌, ఎంఫిల్‌ ఉన్న వారిని మొదటి కేటగిరీలో ఎంపిక చేయాలని ఉన్నది. అయినా మిగిలితేనే రెండో కేటగిరీ వారికి పరీక్ష నిర్వహించి సీట్లివ్వాలని పేర్కొంది. ప్రాస్పెక్టస్‌లో ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా మొదటి కేటగిరీ వారికి సీట్లు కేటాయించకుండా తెలుగు వర్సిటీ అధికారులు మొండిచేయి చూపించారు. తెలుగు అకాడమిలో ఉద్యోగిగా ఉన్న సరిత మహేశ్వరం (బీసీ-బీ)ను ఎంపిక చేసి రెగ్యులర్‌ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసింది.
ఆమెకు ప్రవేశ పరీక్షలో కేవలం 41 మార్కులొచ్చాయి. ఆమె కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేయలేదు. ఆలూరి చంద్రకళ (బీసీ-ఏ) 61 మార్కులు, వజరి రాజేశ్వరి (బీసీ-డీ) 55 మార్కులు, వెంగళ జ్యోతి (బీసీ-బీ) 49 మార్కులు, ఆర్‌ నిర్మల (బీసీ-బీ) 49 మార్కులు, పల్లపు స్వాతి (బీసీ-ఏ) 43 మార్కులు వచ్చాయి. అందులోనూ స్వాతి ఎంఫిల్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించారు. అయినా సరిత మహేశ్వరం ఎంపిక కావడంతో అర్హులైన విద్యార్థులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సమగ్ర విచారణ జరపాలి : ఎస్‌ఎఫ్‌ఐ
తెలుగు విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు కలిసి విజ్ఞప్తి చేశారు. వర్సిటీ స్వయంగా విడుదల చేసిన ప్రాస్పెక్టస్‌కి పూర్తి విరుద్ధంగా పీహెచ్‌డీ సీట్ల కేటాయింపు జరిగిం దని విమర్శిం చారు. అర్హులైన విద్యార్థు లకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -